Site icon NTV Telugu

Off The Record : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తారా..?

Brs Otr

Brs Otr

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్‌ తీర్పు బీఆర్‌ఎస్‌కు బూస్ట్‌ ఇచ్చిందా? అదే ఊపులో మరో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిందా? ఈసారి పెద్దల సభవైపు గులాబీ పెద్దల దృష్టి మళ్ళిందా? ఆ దిశగా ఇప్పుడేం చేయాలనుకుంటోంది కారు పార్టీ? ఏంటా సంగతులు? బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌ మీద గెలిచి కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్న పది మంది శాసనసభ్యుల విషయంలో స్పీకర్‌ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్ట్‌. అయితే…ఈ మూడు నెలల్లోపు పరిణామాలు ఎలా మారిపోతాయి? పొలిటికల్‌ ఎత్తులు, వేటు పడకుండా తప్పించుకునే జిత్తులు ఎలా ఉంటాయన్నది వేరే సంగతి. కానీ… మూడు నెలల్లోపు తేల్చేయాలన్న సుప్రీం కోర్ట్‌ ఆదేశం మాత్రం బీఆర్‌ఎస్‌కు ఊపు నిచ్చిందని అంటున్నారు. అందుకే… ఎమ్మెల్యేలతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో కూడా న్యాయపోరాటం చేయాలనుకుంటున్నట్టు తెలిసింది.

పెద్దల సభలో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్సీల మీద కూడా కఠిన చర్యలు తీసుకునేలా న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించారట. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని మీటింగ్‌లో అభిప్రాయపడ్డట్టు తెలిసింది. నిపుణులతో చర్చించి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు పడేలా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయాలని కూడా డిసైడైనట్టు సమాచారం. ఎమ్మెల్యేల విషయంలో లాగే… ఎమ్మెల్సీల వ్యవహారంలో కూడా పట్టు వదలకుండా పోరాడాలని గులాబీ పార్టీ డిసైడైందట. ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, సారయ్య, దండె విఠల్‌, ఎంఎస్ ప్రభాకర్‌, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్‌ కండువా కప్పారు. అంతకు ముందు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి కూడా పార్టీ ఫిరాయించారు. అయితే కొందరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కార్యకలాపాల్లో బహిరంగంగా పాల్గొనడం పట్ల BRS నాయకత్వం మరింతగా ఆగ్రహంగా ఉందట.

దండే విఠల్, భాను ప్రసాద్ రావు, కె. దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్‌లో కనిపించారు. అదే సమయంలో బీఆర్ఎస్ వ్యయవహారాలకు దూరంగానే ఉంటున్నారు ఫిరాయింపు ఎమ్మెల్సీలు. కారు గుర్తు పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆధారాలు… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీడియోలు, ఫోటోలు, ప్రసంగాలతో పాటు పలువురు ఎమ్మెల్సీల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న సమాచారాన్ని కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ సేకరించిందట. ఆ వివరాలను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు న్యాయస్థానాలకు అందించినట్టు సమాచారం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు ఉన్నందున ఎమ్మెల్సీల కేసును కూడా జోడించాలని గులాబీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంలో ఇంకెన్ని మలుపులు ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

Exit mobile version