పదవిపోతే ఏ నేతకైనా ప్రాధాన్యం తగ్గడం సహజమే. ఆ మాజీ మంత్రి పరిస్థితి అలాగే ఉందట. సొంతపార్టీ నాయకులే టచ్ మీ నాట్‌గా ఉంటున్నారట. పొమ్మనలేక పొగబెడుతున్నారనే ప్రచారమూ సాగుతోంది. సొంత నియోజకవర్గంలోనే ఆయనకు అవమానాలు ఎదురవుతున్నాయనే చర్చ ఉంది. తాజాగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ వస్తుందో లేదో అనే డౌట్ మొదలైందట. దీంతో అసహనానికి.. అంతర్మథనానికి మధ్యలో నలిగిపోతున్నారట ఆ మాజీ మంత్రి. ఆయనెవరో.. లెట్స్ వాచ్..!
ఉమ్మడి విశాఖ జిల్లాలో పట్టుకోసం విఫలయత్నం
ఈయనే ఆ మాజీ మంత్రి. అవంతి శ్రీనివాస్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. మూడేళ్లపాటు జిల్లాలో ఏకైక మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పట్టుకోసం విఫలయత్నం చేశారనే వాదన ఉంది. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోయాక.. అవంతికి విశాఖ జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం. కానీ.. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఆయన ప్లేస్‌లో జిల్లా వైసీపీ పగ్గాలు చేపట్టారు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు. అవంతి డ్రీమ్ టీమ్‌ను పక్కన పెట్టి.. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం పెంచారు పంచకర్ల. మార్పులు చేర్పుల పేరుతో తన వర్గాన్ని పక్కన పెట్టడం మాజీ మంత్రికి మింగుడు పడలేదు. ఆ తర్వాత పార్టీ ఆఫీసు గుమ్మం తొక్కడం తగ్గించేశారు అవంతి. కీలక సమావేశాలుంటే ముఖం చూపించి వెళ్లిపోవడం తప్పితే రాసుకు పూసుకొని తిరగడం లేదని ఓపెన్ టాక్.
వైసీపీ ముఖ్య నేతలతో తగ్గిన సఖ్యత
వైసీపీ ముఖ్య నేతలతో అవంతికి సఖ్యత తగ్గిందనేది తాజా ప్రచారం. జిల్లా నాయకత్వంతోనూ గ్యాప్ పెరిగిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం అవంతి ఒంటరయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ మంత్రి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆడియో టేపులు వైరల్ అయ్యాయి. అవి ఎక్కడి నుంచి ఎవరి ప్రోద్బలంతో వెలుగులోకి వచ్చాయనే దానికంటే.. ఆయన పొలిటికల్ కెరీర్‌కు మచ్చను తెచ్చిపెట్టాయి. ఇటీవల గడప గడపకు వెళ్తే.. టీడీపీ నాయకులు రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి ఎమ్మెల్యేను అవమానించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా వైసీపీ నుంచి ఎవరూ రియాక్ట్ కాలేదు. మాజీ మంత్రిని టీడీపీ టార్గెట్ చేసినప్పుడు అండగా ఉండాల్సిన వైసీపీ నేతలు పిన్‌డ్రాప్ సైలెన్స్ పాటించారు. అంతర్గత రాజకీయాల వల్లే వాళ్లెవరూ అవంతికి సపోర్ట్‌గా రాలేదన్నది మరో ప్రచారం.
ఫ్లెక్సీలో కనిపించని అవంతి ఫొటో
ఇటీవల ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వైసీపీ రీజినల్ పార్టీ కార్యాలయం ఫ్లెక్సీ వ్యవహారం దుమారం రేపింది. ప్రారంభోత్సవ ఆహ్వానంలో అవంతి ఫొటో కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీలో ఫొటో పెట్టలేదని అవంతి అనుచరులు గొడవకు దిగారు. దాంతో అప్పటికప్పుడు అవంతి ఫొటో అతికించారు. ఈ పరిణామాల మధ్యే భీమిలిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు మాజీ మంత్రి. మినిస్టర్‌గా ఉన్నప్పుడు నియోజకవర్గ బాధ్యతలన్నీ కుటుంబ సభ్యులకు అప్పగించారు అవంతి. దాంతో కేడర్‌కు.. అవంతికి గ్యాప్ వచ్చిందనేది ఓ చర్చ. పైగా మంత్రి అమర్నాథ్‌కు దగ్గరయ్యేందకు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్నారట అవంతి. వీటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రాజధాని ఎమ్మెల్యే అవ్వొచ్చనే లెక్కల్లో ఆయన ఉన్నారు.
అవంతికి భీమిలి వైసీపీ టికెట్ దక్కేనా..?
2024 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ భీమిలిలో టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. అదే నిజమైతే అవంతికి గట్టి పోటీ తప్పదనే చర్చ జరుగుతోంది. దీనికితోడు భీమిలిలో అవంతికి వైసీపీ టికెట్ ఇస్తుందా అనే అనుమానాలూ పార్టీ వర్గాల్లో ఉన్నాయట. అందుకే అవంతికి రానున్న రోజుల్లో అవమానాలు.. మరిన్ని ఛాలెంజ్‌లు తప్పకపోవచ్చనే అభిప్రాయం ఉంది.