Site icon NTV Telugu

Off The Record: ఆ నేతలకు వైసీపీ అధినేత షాక్‌..! కొడాలి, అనిల్‌, అవంతిలకు ఝలక్‌

Ysrcp

Ysrcp

వరస సమీక్షలు.. హెచ్చరికలు తర్వాత మాట వినని పార్టీ నేతలకు షాక్‌ ఇచ్చారు వైసీపీ అధినేత, సీఎం జగన్‌. వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్య నేతలనే పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రెండు నెలల కిందట గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సందర్భంగా రీజినల్‌ కోఆర్డినేటర్ల పనితీరును అసెస్‌ చేసిన జగన్‌.. కొంతమంది పనితీరుపై ఓపెన్‌గానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మంత్రి బుగ్గన పేర్లను ఆయన ప్రస్తావించారు. ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు కూడా. కో ఆర్డినేటర్లుగా ఉండలేకపోతే తప్పుకోవాలని.. కొత్త వారికి అవకాశం ఇస్తానని ఆ రోజే నిక్కచ్చిగా చెప్పేశారు. అప్పటి నుంచే కసరత్తు జరిగింది. ఈ ప్రక్రియలో పార్టీ అధినేత రెండు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఒకటి.. పని చేయకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సంకేతాలు పంపారు. రెండోది.. సొంత జిల్లాలకు చెందిన నేతలు అదే జిల్లాలకు సమన్వకర్తలుగా ఉండకుండా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ పరిధిలో ఉన్న విజయనగరం జిల్లాలను ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అదే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్న ప్రకాశం.. బాపట్ల జిల్లాలను బీద మస్తానరావు, భూమన కరుణాకర్‌రెడ్డిలకు ఇచ్చారు.

Read Also: Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రక్షాళన..? ఇక్కడ ఉండేది ఎవరు.. పోయేదెవరు?

ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వ, పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతల్లోనూ మార్పులు చేశారు. సజ్జల ఇప్పటికే 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అబ్జర్వర్ల బాధ్యత కూడా ఆయనకే పార్టీ అప్పగించింది. దీనితో గతంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు బుగ్గనతో కలిసి సమన్వయకర్తగా ఉన్న సజ్జలను ఆ బాధ్యతల నుంచి విముక్తి కలిగించారు. ఇక తనకు కేటాయించిన జిల్లాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అనిల్‌ను తప్పించి.. కడప, తిరుపతి బాధ్యతలు బాలినేనికి ఇచ్చారు. పల్నాడు జిల్లా కోఆర్డినేటర్‌గా ఉండి ఒకటిఅరసార్లు తప్ప.. అక్కడ పనైనా చూడని కొడాలి నానిని కూడా పక్కన పెట్టేశారు.

Read Also: Off The Record: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పట్టించుకోని బీజేపీ అధిష్ఠానం?

జిల్లా అధ్యక్షుల విషయంలోనూ సీఎం జగన్ ఇదే విధానాన్ని అవలభించారు. అధ్యక్ష బాధ్యతలు సరిగ్గా చూడని వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టారు. గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల అధ్యక్షలు రాజీనామాలు చేస్తే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. అదే విధంగా పని తీరు సంతృప్తికరంగా లేకపోవటంతో పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిని తప్పించి ఆమె భర్త పరీక్షిత్ రాజుకు పగ్గాలు ఇచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కొత్త బాధ్యతలు ఇవ్వటంతో.. తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి.. నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని తీసుకొచ్చారు. ఈ మధ్య ఆడియో టేపులతో వైరల్ అవుతున్న అవంతిని పక్కన పెట్టి ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ కు విశాఖ జిల్లా బాధ్యతలను ఇచ్చారు. అవంతి సెల్ఫ్‌గోల్స్‌ వేసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రకాశం జిల్లా లో కూడా బుర్రా మధు సూధన్ యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్షాళన చర్యలు చూస్తుంటే.. పార్టీ నేతల పనితీరుపై అధినేత సీరియస్‌గానే ఉన్నారని.. వారి ప్రొగ్రస్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. మరి.. ఈ చర్యల తర్వాత ఎంత మంది తమ పనితీరుకు మార్కులు వేయించుకుంటారో చూడాలి.

Exit mobile version