Off The Record: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. కానీ… తీరా శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో త్రిమూర్తులు ఏ వైపు ఉన్నారు? మనిషి ఒకచోట మనసు మరో చోట అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందా అని మాట్లాడుకుంటున్నారట పొలిటికల్ పండిట్స్. తోట త్రిమూర్తులు అంటే… గోదావరి జిల్లాల కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కూడా నాకు ముందు కులం ముఖ్యం, తర్వాతే రాజకీయం అంటూ ఏ మాత్రం దాచుకోకుండా పలు సందర్భాల్లో చెప్పారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా, గత వైసిపి ప్రభుత్వ హయాం నుంచి ఎమ్మెల్సీ కొనసాగుతున్నారాయన. ఇప్పటి వరకు తెలుగుదేశం… ప్రజారాజ్యం… కాంగ్రెస్… వైసీపీ ఇలా చాలా పార్టీల్లో తిరిగారు తోట. ఇక జనసేనలో చేరతారని 2014 ఎన్నికల నుంచి ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి గానీ…. ఆ ఒక్కటీ జరగడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో టిడిపి నుంచి వైసీపీలో చేరిన త్రిమూర్తులకు ఒకేసారి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అప్పటినుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎన్ని ఊాగానాలు వచ్చినా వైసీపీలోనే కొనసాగుతున్నారు. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ సమావేశాలకు వైసీపీ సభ్యుడుగా హాజరవుతూ అధికారుల తీరును ఎండగడుతున్నారు. కానీ…జిల్లా నుంచి అమరావతికి వెళ్ళేసరికి ఆయన ప్రాధాన్యతలు మారిపోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ వైసీపీకి దూరం జరుగుతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట గమనిస్తున్న వాళ్ళకు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఫోటో సెషన్స్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తోట త్రిమూర్తులు ఆత్మీయంగా ప్రత్యేకంగా ఫోటో దిగటం చర్చనీయాంశంగా అయింది. అదే సమయంలో అటు టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియడంతో… ఆయనను తిరిగి కొనసాగించాలని వాయిస్ వినిపించారు. ప్రతిపక్ష నేత అయి ఉండి శాసనమండలిలో అధికార పార్టీ సభ్యుడిని కొనసాగించాలని కోరడం పలు ఊహాగానాలకు తావిస్తోందంటున్నారు.
తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు ఇటు వైసీపీలోనూ, అటు టిడిపిలోనూ గందరగోళానికి దారి తీశాయి. శాసనమండలిలో ఇరు వర్గాల ఎమ్మెల్సీలు త్రిమూర్తులు వ్యవహార శైలికి అవాక్కయ్యారట. ఇప్పటికే ఐదుగురు వైసిపి ఎమ్మెల్సీలు కండువాలు మార్చేశారు. దీంతో శాసనమండలిలో వైసీపీ బలం తగ్గిపోతోంది. తాజాగా తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారిపోతారన్న ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఆయన మాత్రం ఎప్పటికప్పుడు తాను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.