Site icon NTV Telugu

Off The Record: వాలంటీర్‌ వ్యవస్థను వైసీపీ లైట్‌ తీసుకోబోతోందా..?

Ycp

Ycp

Off The Record: ఈ మధ్య కాలంలో కార్యకర్తలతో ఏ సమావేశం నిర్వహించినా వైసీపీ అధినేత జగన్ రిపీట్‌ చేస్తున్న ఒకే మాట జగనన్న 2.o. ఇక నుంచి కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తా.. మీకోసం ఎంతదాకైనా వస్తా….. అందర్నీ గుర్తు పెట్టుకుంటానని కూడా చెప్పుకొస్తున్నారు జగన్. 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని విస్మరించి కేవలం వాలంటీర్స్‌ని నెత్తిన పెట్టుకున్నారన్న విమర్శలున్నాయి. కేడర్‌ సంగతి మర్చిపోయి… వాళ్ళని నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళడం వల్లే దారుణమైన ఫలితాలు వచ్చాయని పార్టీ పోస్ట్‌మార్టంలో తేలినట్టు చెప్పుకుంటున్నారు. వాలంటీర్‌ వ్యవస్థే దారుణమైన పతనావస్థకు చేర్చిందన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయట వైసీపీ పెద్దల్లో. ఈ పరిస్థితుల్లో… ఈసారి కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం అంటూ 2.oని పరిచయం చేశారు జగన్‌. అది ఎలా ఉండబోతోందో… ఒక్కో మీటింగ్‌లో ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ వస్తున్నారాయన. జగన్‌ 2.0 భిన్నంగా ఉంటుందని చెప్పడం వెనుక.. ప్రస్తుతం ఉన్న నాయకులకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వటం, తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకం కలిగించడమన్న ప్రధాన అజెండా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: JD Vance: ఎలాన్ మస్క్ శకం ముగియలేదు.. ట్రంప్‌కు సలహాలిస్తారు

2.oకు కేడర్‌ నుంచి కూడా మంచి స్పందన వస్తుండటంతో… దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ని కూడా పెంచుతున్నారు జగన్‌. కార్యకర్తలను వేధించిన అధికారులను వదిలి పెట్టబోనని, వారు రిటైరై ఖండాల అవతల ఉన్నా….. తీసుకు వచ్చి బోనులో నిలబెడతామని, మీరు పేర్లు నోట్‌ చేసుకోమంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు. 2.oలో చెబుతున్నవన్నీ… పార్టీ అధికారంలోకి వచ్చాక చేసే పనులు. కానీ… అంతకంటే ముందు ఏం చేయాలన్న విషయంలో కూడా ఫుల్‌ క్లారిటీకి వచ్చేశారట జగన్‌. క్షేత్రస్దాయిలో కార్యకర్తలను కలిసేందుకు వస్తానని ఇప్పటికే చెప్పగా…. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే… వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త వర్ధంతికి హాజరై… అక్కడి నుంచే కార్యకర్తల్ని కలిసే ప్రోగ్రాం మొదలు పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళకు చెందిన అప్పటి వైసీపీ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు మీద గత ఎన్నికల తర్వాత పలు కేసులు బుక్‌ అయ్యాయి. ఆయన్ని స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారించడంతో.. మనస్దాపానికి గురై నిరుడు జూన్ 4న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Read Also: MLA Raja Singh : బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం.. కానీ..

దీంతో… వచ్చేనెల 3న రెంటపాళ్ల వెళ్ళి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారట జగన్. 4న గ్రామంలో వర్ధంతి జరగబోతున్నందున అందుకు ఒకరోజు ముందుగానే గ్రామానికి వెళ్ళడంతో పాటు… నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారట. ఈ చర్య ద్వారా… ఇక నుంచి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా… తాను డైరెక్ట్‌గా వస్తానన్న సంకేతం పంపాలనుకుంటున్నట్టు సమాచారం. అటు కమ్మ సామాజికవర్గానికి చెందిన నాగమల్లేశ్వరరావు వైసీపీ కోసం గట్టిగా నిలబడటం కూడా నోట్ చేసుకోవాల్సిన అంశమేనని అంటున్నారట వైసీపీ అధ్యక్షుడు. కూటమి సర్కార్‌ ఏడాది కాలంలో… పెన్షన్లు తప్ప మిగతా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయిందని, అందుకే ఇక పోరుబాట ఎంచుకోవాలని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. మరోసారి పాదయాత్ర ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా…. వచ్చే ఏడాది ప్లీనరీ తర్వాత ఇక జోరు పెంచాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 2024 ఓటమి జగన్‌కు కార్యకర్తల విలువ తెలిసివచ్చేలా చేసిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. వాలంటీర్స్‌ని నెత్తిన పెట్టుకుని నష్టపోయామని ఇప్పటికే క్లారిటీకి రావడం, ఇక నుంచి కేడర్‌కే ప్రధమ ప్రాధాన్యం అంటున్నందున… మళ్ళీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్స్‌ని పట్టించుకోరా? ఆ వ్యవస్థకు మంగళం పాడేస్తారా అంటూ క్వశ్చన్‌ మార్క్‌ పేస్‌లు పెడుతున్నారు కొందరు. భవిష్యత్‌ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.

Exit mobile version