Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముక్కు సూటి. మోనార్క్ ఎవరంటే…టక్కును గుర్తొచ్చే పేరు బొల్లా బ్రహ్మనాయుడు. ఆ మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వినుకొండ ఎమ్మెల్యేగా పని చేసిన బ్రహ్మనాయుడు…అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకులనే కాదు…సొంత పార్టీ నాయకులను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇప్పుడు కూడా అదే పంథాలో రాజకీయం చేస్తుండటంతో…పార్టీ నేతలకు రుచించడం లేదట. కొన్ని నెలలుగా బ్రహ్మనాయుడు…వైసీపీలో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అలాగని పార్టీని, పార్టీలో పెత్తనాన్ని మాత్రం వదిలిపెట్టలేదట. కష్టాల్లో ఉన్న పార్టీకి 10 మంది నాయకులతో బలం చేకూర్చాల్సింది పోయి…డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి 2024 వరకు వినుకొండ నియోజకవర్గంలో…వైసిపిలో కీలకంగా వ్యవహరించిన నాయకుల్ని పక్కన పడేసారని టాక్ వినిపిస్తోంది. తన దగ్గరకు వచ్చి భజన చేసే నాయకులను తప్ప…మిగతా నాయకులను పట్టించుకోకపోవడంతో కేడర్ అసంతృప్తితో రగిలిపోతోందట.
నాలుగు రోజుల క్రితం జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశానికి సైతం…కొందర్ని కావాలని బ్రహ్మనాయుడు దూరం పెట్టారనే చర్చ నడుస్తోంది. ఈపూరు, నూజెండ్ల, శావల్యాపురానికి చెందిన సుమారు 30 మంది కీలక నాయకులు…వినుకొండలో బ్రహ్మనాయుడుకి వ్యతిరేకంగా రహస్యంగా భేటీ అయ్యారట. ఓ ఎంపీపీ భర్త…ఓ జడ్పిటిసికి అత్యంత సన్నిహితుడు, ఓ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దీనికి నేతృత్వం వహించినట్లు వినికిడి. బ్రహ్మనాయుడు నాయకత్వాన్ని మార్చి…వేరే అభ్యర్థికి వినుకొండ ఇన్చార్జి పదవి ఇవ్వాలని చర్చలు జరిపారట. బ్రహ్మనాయుడు వ్యవహారశైలిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నేతలంతా…నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవాలను పరిశీలిస్తే…ఇప్పటికిప్పుడు బొల్లాను ఇన్చార్జి పదవి నుంచి తప్పించే పరిస్థితి కనిపించడం లేదు. నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకోవాలంటే…కోట్లలో ఖర్చు అవుతుందని అంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు దొరకాలంటే అంత ఈజీ కాదని మరోవర్గం వాదన. వినుకొండ నియోజకవర్గంలో దాదాపు 55 వేల కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి నిలబడాలన్నా…కమ్మ సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెడుతుంటారు. ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండు అదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి.
వైసీపీ ఆవిర్బావం నుంచి వినుకొండలో…కమ్మ సామాజికవర్గం నేతలు వైసీపీని నడిపిస్తున్నారు. 2012 నుంచి 2014 వరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న నన్నపనేని సుధది కమ్మ సామాజికవర్గమే. ఆ తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు…నాయకుడిగా చలామణి అవుతున్నారు. 2024లో బొల్లా ఓటమి పాలయినప్పటికీ…ఆయన్నే ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తోంది. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న బ్రహ్మనాయుడు… హైకమాండ్ సూచనలతో మళ్లీ యాక్టివ్ అయ్యారట. ఉమ్మడి జిల్లా సమన్వయకర్తల సమావేశానికి..భారీ అనుచర గణంతో హాజరయ్యారు. ఇది నియోజకవర్గంలోని కొంతమంది కీలక నాయకులకు రుచించలేదట. బ్రహ్మనాయుడు నియంతృత్వం, నోటి దురుసుతో అవస్థలు పడుతున్న నేతలు…ఆయనకు చెక్ పెట్టాలని సమావేశం నిర్వహించారు. అయితే జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ బొల్లా బ్రహ్మనాయుడు నోటి దురుసే ప్రధాన కారణమని పార్టీ కేడర్ చర్చించుకుంటోంది. వినుకొండలో రేగిన ఈ అసంతృప్తి..తీవ్ర రూపం దాలుస్తుందా ? లేక ఉత్తుత్తి అసంతృప్తిగా మిగిలిపోతుందా ? అన్న చర్చ జరుగుతోంది. బ్రహ్మనాయుడునైన మార్చాలి…లేదంటే తామన్నా పార్టీ మారాలి అనే ధోరణిలో కొందరు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు శివరాత్రి నాటికి అసంతృప్తి నాయకుల బలం పెరుగుతుందని, మరొసారి సమావేశం పెట్టి…బ్రహ్మనాయుడు ఇన్చార్జి పదవికి ఎసరు పెట్టాలని…ఆలోచనతో అసంతృప్త నేతలు ఉన్నారట. మరి ఈ వ్యవహారం వినుకొండ వైసిపి రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.