Off The Record: సింహపురి పాలిటిక్స్‌లో అప్పుడే లోకల్ హీట్ మొదలైపోయింది. అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాల కోసం ఎత్తులు వేస్తుంటే… అడ్డుకోవడం మనకు సాధ్యపడుతుందా అంటూ విపక్షం వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య నియోజకవర్గ ఇన్చార్జ్‌లతో మీటింగ్ పెట్టినప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఒప్పుకోనని.. అలా జరిగితే అందుకు ఇన్చార్జ్‌లను బాధ్యుల్ని చేస్తానని హెచ్చరించారాయన. వాటిని తల్చుకునే… ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? ఏకగ్రీవాలైతే ఆయన ఒప్పుకోరు, అలా జరక్కుండా చేయాలంటే… అధికార పార్టీ శక్తి ముందు మనం ఆనేట్టు లేమంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా వైసీపీ కీలక నేతలు పలువురిపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏకంగా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వంటి నేతలు, వారి అనుచరుల మీద కేసులు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో… లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పలువురు నియోజకవర్గ ఇన్చార్జ్‌లలో పెరుగుతున్నట్టు సమాచారం. అధినేత వార్నింగ్‌ను తలచుకుని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని అంటున్నారట. గూడూరు నియోజక వర్గానికి కొత్త ఇన్ఛార్జ్‌ని ప్రకటించారు. దీంతో ఆయన ఎక్కువ కంగారు పడుతున్నట్టు సమాచారం. గతంలో ఫ్యాన్ పార్టీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాను ఇప్పుడు టిడిపి ఆక్రమించేసింది. దాంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకునేలా పసుపు నేతలు అడుగులు వేస్తున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు పలు కార్పొరేటర్ స్థానాలను కూడా అప్పటి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవం చేసుకున్నారు. దీంతో అదే స్ఫూర్తితో ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఏకగ్రీవాల మీదే దృష్టి పెడుతున్నారట. ఇటీవల సీఎం చంద్రబాబు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యేలకి సూచనలు సలహాలు ఇచ్చారు. దీంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సీఎం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఎక్కువ ఏకగ్రీవాలకు స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో… అధికార పార్టీ ఎమ్మెల్యేలని ఎదుర్కొని అభ్యర్థిని నిలబెట్టగలమా అన్న సందేహం ఫ్యాన్ లీడర్స్‌లో వ్యక్తం అవుతోందంటున్నారు. కావలి, ఉదయగిరి, గూడూరు సూళ్ళూరుపేటల్లో ఇదే తరహా పరిస్థితి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
ఈసారి మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు వైసిపికి ఒక్క సీటు కూడా రాకుండా గట్టిగా పని చేయాలని పట్టుదలగా ఉన్నారట అధికార పార్టీ నేతలు. అదే సమయంలో సీఎం జగన్ ఇచ్చిన వార్నింగ్ తో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారు మాజీలు. అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ, మండల స్థాయి నేతలను పట్టించుకోకుండా వాలంటీర్లకి పగ్గాలు ఇవ్వడం వల్ల పార్టీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందన్న ఆందోళనలో మాజీలు ఉన్నారట. ఇదే సమయంలో కీలక నేతలపై కేసులు ఉండటం, కేడర్ సైలెంట్ అవడం వల్ల రూలింగ్ పార్టీని ఢీ కొట్టడం సాధ్యమేనా అన్న చర్చ విపక్షంలో జరుగుతోంది. పోలీసుల కేసులు, అధికార బలాన్ని తట్టుకొని లోకల్ బాడీస్‌లో నిలబడగలమా అన్నది ఎక్కువ మంది ఇన్ఛార్జ్‌ల సందేహం. కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జ్‌లు మెరుపు తీగల్లా వచ్చిపోతున్నారని, అలాంటి వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చంటున్నారు. మొత్తం మీద ఇటు అధినేత వార్నింగ్, అటు అధికార పక్షం పట్టు చూసి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా మా పరిస్థితి మారిందని కామెంట్ చేస్తున్నారు సింహపురి ఫ్యాన్ లీడర్స్.

