Off The Record: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో జెట్ స్పీడ్‌తో అధికారంలోకి వచ్చింది వైసీపీ. కట్ చేస్తే… ఐదేళ్ళు తిరిగేసరికి అంతకు మించిన స్పీడ్‌తో 11 సీట్లకు పరిమితమై డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ పరిస్థితి చూశాక అసలు వైసీపీ ఇప్పట్లో కోలుకుంటుందా అన్న అనుమానం వచ్చిందట చాలామందికి. కానీ… ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ…. త్వరగానే బౌన్స్ బ్యాక్ అయ్యారు ఆ పార్టీ అధినేత జగన్. ఓవైపు కీలక నేతలు పార్టీని వీడటం, మరోవైపు ఉన్నవాళ్లు కేసులతో ఉక్కిరి బిక్కిరి లాంటివి నడుస్తుండటంతో… కేడర్‌లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా…పార్టీని బలోపేతం చేసే పని మొదలుపెట్టారాయన. వారంలో కచ్చితంగా ఒకటి, రెండు రోజులు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణితో పాటు పార్టీ పెద్ద తలకాయలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగవంటూ 2.0ని పరిచయం చేసిన జగన్…. ఇప్పుడు పాత సక్సెస్ ఫార్ములాకే ఇంకాస్త పదునుపెట్టి కొత్తగా పరిచయం చేయబోతున్నారట. పార్టీకి ఊపు ఉత్సాహం తీసుకురావాలంటే అదొక్కటే మార్గం అని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
Read Also:Off The Record: చిత్తూరు కూటమి నేతల్లో చిచ్చుపెట్టిన నామినేటెడ్ పోస్టులు..?
మీ జిల్లాలకు మీరే బాస్‌లు, ఎవరి నిర్ణయం కోసమో ఎదురు చూడవద్దని ఇటీవల జిల్లాల అధ్యక్షుల సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు వైసీపీ అధ్యక్షుడు.పార్టీకి గుండెకాయ లాంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోని ఖాళీలను కూడా తాజాగా పూర్తి స్థాయిలో భర్తీ చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లకు కూడా టార్గెట్స్ పెట్టినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో తమ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మంది పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకొస్తారన్నదాన్నిబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పేశారట. లోక్‌సభ నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌ల మీటింగ్‌లోనే పలు కీలక అంశాలను చర్చించారట జగన్. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని భారీ స్థాయిలో నిర్వహిద్దామని చెబుతూనే… మళ్ళీ పాదయాత్ర ప్రస్తావన తీసుకొచ్చారట. 2027లో తాను మరోసారి పాదయాత్ర చేయబోతున్నట్టు పార్టీ నేతలకు చెప్పినట్టు తెలిసింది. గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మూడు వేల కిలోమీటర్లు నడవగా… ఈసారి దాన్ని ఐదు వేల కిలోమీటర్లకు పెంచాలనుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికలకు ముందు నాయకులు పాదయాత్రలు చేయడం, తర్వాత అధికార పీఠం ఎక్కడం ఏపీలో సెంటిమెంటల్ సక్సెస్ ఫార్ములా అయింది.
Read Also: Off The Record: తల ఉండి మొండెం లేనట్టుగా టీపీసీసీ
ఉమ్మడి రాష్ట్రంలోను, విడిపోయాక ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇదే అస్త్రాన్ని జగన్ మరోసారి సంధించాలని డిసైడయ్యారట. పాదయాత్ర వంటి భారీ కార్యక్రమాన్ని చేపడితే… క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయవచ్చన్నది ఆయన వ్యూహంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుత పరాజయాన్ని ఓ ఎదురుదెబ్బలానే భావిస్తున్న జగన్.. పార్టీని కింది నుంచి బలోపేతం చేయాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. 2019కి ముందు చేసిన పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిందని బలంగా నమ్ముతున్న జగన్ ఈసారి పాదయాత్ర 2.0తో తిరిగి అధికార పీఠం ఎక్కడంతో పాటు… ఇక మీదట పార్టీని కూడా ఎవరూ టచ్ చేయలేని విధంగా పటిష్టమైన పునాదులు వేయాలనుకుంటున్నారట. వచ్చే ఏడాది నిర్వహించబోయే ప్లీనరీలోనే… పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాలనుకుంటున్నట్టు సమాచారం. ఆలోపు జమిలి ఎన్నిలకపై క్లారిటీతో పాటు కూటమి ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలపై పూర్తిస్ధాయి గ్రౌండ్ రిపోర్ట్ కూడా వస్తుందని భావిస్తున్నట్టు తెలిసింది. 2026 ప్లీనరీ కల్లా జిల్లాల పర్యటనలు పూర్తి చేయడంతోపాటు కార్యకర్తలను కలసి లోటుపాట్లను సరిచేసుకుని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారట. ఈసారి గనుక దెబ్బ గట్టిగా కొట్టకపోతే పార్టీని నిలబెట్టడం కూడా కష్టమవుతుందన్న జగన్ అభిప్రాయంగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే క్లియర్ పిక్చర్‌తో పాదయాత్ర 2.oకి సిద్ధమైనట్టు సమాచారం.