NTV Telugu Site icon

Off The Record: ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారా? షర్మిలకు మద్దతుగా రంగంలోకి రేవంత్‌రెడ్డి..!

Jagan Revanth

Jagan Revanth

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీకి ఊహించనైనా ఊహించని ఫలితాలు వచ్చాయి. వై నాట్ 175 అని ప్రచారం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పార్టీ.. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఆఖరికి ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ప్రతపక్ష నేత హోదా ఇవ్వడానికి ఎమ్మెల్యేల సంఖ్యకు సంబంధం లేదని.. దానితో ముడిపెట్టకుండా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. జగన్‌ లేఖకు తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. మొత్తం అసెంబ్లీ సీట్లలో 10 శాతం సీట్లు గెలవనందున ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కొత్త చర్చలు మొదలయ్యాయి. అందులో ఒకటి.. పులివెందుల శాసనసభ సభ్యత్వానికి జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Read Also: Pa Ranjith: ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై డైరెక్టర్ పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు.. డీఎంకేపై తీవ్ర విమర్శలు..

కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి.. అక్కడి నుంచి జగన్ ఎంపీగా పోటీ చేయడం ఇంకొకటి. నాలుగైదు రోజులుగా సోషల్ మీడియా నిండా ఇవే మెసేజ్‌లు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనేలా.. సోషల్ మీడియాలో దీని మీద గట్టిగానే చర్చ జరుగుతోంది. కొంత మంది దీన్ని నమ్ముతుంటే.. ఇంకొందరు వట్టి ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు. పట్టించుకునే వాళ్లు పట్టించుకుంటే.. పట్టించుకోని వాళ్లు పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు. సరిగ్గా ఇదే ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. జగన్ రాజీనామా చేస్తే కడపలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం గల్లీ గల్లీలో తిరిగి ప్రచారం చేస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ కామెంట్స్ చేశారు. సీఎమ్మే ఈ విధంగా అనడంతో.. నిజంగానే జగన్ రాజీనామా చేస్తారా ? ఎంపీగా పోటీ చేస్తారా ? అనే చర్చ మరింత ఊపందుకుంది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అంటే పెద్ద విషయమే. అలాంటి పెద్ద విషయాన్ని రేవంత్ ప్రస్తావించడంతో అది ఇంకా పెద్ద చర్చయింది. 175 మంది ఎమ్మెల్యేలున్న సభలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలున్నారు. జగన్ సాధారణ ఎమ్మెల్యేగా తన టీంతో ఈ కూటమిని ఢీకొనాల్సి ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేక…ఎమ్మెల్యేల సంఖ్యా ఎక్కువగా లేక ఇబ్బందిపడే కంటే…అసెంబ్లీని వదిలేయడమే ఉత్తమమని జగన్ డిసైడ్ అయ్యారనే వారు పెరిగిపోయారు. మొదట్లో దీన్ని లైట్ తీసుకుంది వైసీపీ. ఎప్పుడైతే రేవంత్ నోట…ఈ మాట వచ్చిందో వైసీపీ కూడా అలెర్ట్ అయ్యింది. ఖండించకుంటే పార్టీ కేడర్ కూడా నిజమేనని అనుకుంటుందేమోనన్న డౌట్ మొదలైంది. ఇదంత అబద్దం అని ఖండించింది. జగన్మోహన్‌రెడ్డి అలా చేయరని వివరణ ఇచ్చింది. కానీ ప్రచారం మాత్రం ఆగడం లేదు.