NTV Telugu Site icon

Off The Record: బీఆర్‌ఎస్‌లో మామిడితోట విందు రాజకీయాలు.. ఎమ్మెల్యేపై తిరుగుబాటు..!

Wyra

Wyra

Off The Record: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే రాములు నాయక్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌కే చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు గళం విప్పారు. ఎమ్మెల్యే వల్ల తమకు ప్రయోజనం లేదని నినదిస్తున్నారు. వైరా మున్సిపాలిటీగా మారి మూడేళ్లే అయ్యింది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని టాక్‌. తాము తెలంగాణలో లేమా అని ప్రశ్నిస్తూ ఓ మామిడి తోటలో విందు రాజకీయాలకు కౌన్సిలర్లు తెరతీయడం చర్చగా మారింది. మున్సిపాలిటీలో మొత్తం 20మంది కౌన్సిలర్లు ఉండగా.. వారిలో 18 మంది బీఆర్‌ఎస్‌ వాళ్లే. తాజా విందు రాజకీయానికి చైర్మన్ సూతకాని జైపాల్ నేతృత్వం వహించారట. ఈ మీటింగ్‌కు ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సహా 18 మంది హాజరు కావడంతో హాట్ హాట్‌ చర్చ జరుగుతోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ జైపాల్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం. కౌన్సిల్‌లో .. వైరా నియోజకవర్గంలో పొంగులేటికి వర్గం బలంగానే ఉంటుంది. జైపాల్ త్వరలో పొంగులేటికి ఓపెన్‌గా మద్దతు తెలియజేస్తారని చెబుతున్నారు.

Read Also: Off The Record: కోటంరెడ్డి ఎపిసోడ్‌లో తెలుగు తమ్ముళ్లు ఎందుకు సైలెంట్..?

మామిడి తోట విందు సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్‌పైనే ఎక్కువగా చర్చించారట. మున్సిపాలిటీకి ఎమ్మెల్యే నిధులు తీసుకురావడం లేదనేది సభ్యుల ఆరోపణ. ఇక్కడో విచిత్రం ఉంది. జైపాల్‌ మాదిరే రాముల్‌ నాయక్‌ కూడా పొంగులేటి వర్గమే. గత ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థిని కాదని రాములు నాయక్‌ను పోటీ చేయించి గెలిపించారు పొంగులేటి. అయితే పరిణామాలు మారిపోవడంతో రాములు నాయక్‌.. మాజీ ఎంపీకి దూరంగా ఉంటున్నారు. పొంగులేటిపై పదునైన విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే. ఇది కూడా విందు రాజకీయాలకు నాంది పలికిందనే ప్రచారం ఉంది. మున్సిపాలిటీకి వంద కోట్లు తీసుకురావాలని ఆ సమావేశంలో ఎమ్మెల్యేను డిమాండ్‌ చేశారు కౌన్సిలర్లు. లేకపోతే సీన్‌ మారిపోతుందని.. కండువాలు మార్చేస్తామని హెచ్చరిస్తున్నారట. వందకోట్లు అనేది పార్టీ మారడానికి ఒక సాకుగా చూపిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. వెనుక పొంగులేటి ఆశీసులు చూసుకునే ఛైర్మన్‌, కౌన్సిలర్లు ఈ విధంగా ఎమ్మెల్యేను సవాల్‌ చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే రానున్న రోజుల్లో వైరా రాజకీయం ఇంకా ఆసక్తిగా మారుతుందని లెక్కలేస్తున్నారు.