Off The Record: వివిధ వర్గాల బాధితులు…. సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు క్యూ కడుతున్నారు,,? ఇంకా మూడేళ్ళ పాలన మిగిలి ఉండగానే… ఏంటీ పరిస్థితి…? మనం ప్రతి రోజు అర్జీలు తీసుకుంటున్నా.. ఎందుకు ఇలా జరుగుతోంది…? ఎక్కడ తేడా కొడుతోంది? అంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి వర్గాల్లో ఈ తరహా చర్చలు పెరిగిపోతున్నాయట. సమస్యలు ఉంటే పరిష్కారం కోసం అధికారంలో ఉన్నవాళ్ళ దగ్గరికి రావాలిగానీ… ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని కలిసి విన్నవించుకోవడం ఏంటంటూ… కూటమి నాయకులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికి అయ్యింది.. రెండేళ్ళు మాత్రమే. ఇంకా మూడేళ్ళ పాలన మిగిలే ఉంది. అయినా సరే ఇంత త్వరగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, వాళ్లకు జగన్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడంటూ ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, ప్రస్తుతం పోరుబాట పడుతోంద కాబట్టి ఏవో చిన్నా చితకా ఇబ్బందుల గురించి చెప్పుకుంటే సరేగానీ… రకరకాల సమస్యల పేరుతో బాధితులంతా వరుసబెట్టి జగన్‌ను ఎందుకు కలుస్తున్నారంటూ ఆరా తీయడం మొదలైందని చెప్పుకుంటున్నారు.
ముందు అమరావతి రైతులు, తర్వాత ఆరోగ్య శ్రీ నిధులపై ఆశా యూనియన్, డీఎస్సీ 2026 పరీక్ష రాసి ఉద్యోగాలు రాని అభ్యర్థులు, రాజమండ్రి కల్తీ పాల బాధితులు, తాజాగా ఆక్వా రైతులు… ఇలా సమస్యలు ఉన్నవారంతా వరుసగా జగన్‌ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అటు డీఎస్సీ విషయంలో వైసీపీ దూకుడుగా వెళ్తోందా.. అనే చర్చ కూడా కూటమిలో జరుగుతోందట. ప్రతి వారం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్ అర్జీలు తీసుకుంటున్నారని… అదే విధంగా మంత్రులు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారని..అయినాసరే… ఇదేం పరిస్థితి అని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ జగన్ పిలిపించుకుని మాట్లాడుతున్నారని అనుకుందామనుకున్నా.. ఇలా వరసగా అంతా వెళ్లడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలంటున్నాయి కూటమి వర్గాలు.
రెండేళ్ళకే పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెలా మారుతుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. వైసీపీ నిర్వహించిన… వెన్నుపోటుకు రెండేళ్ళు కార్యక్రమం విజయవంతం అయిందని కూడా కూటమిలో గుసగుసలాడుకుంటున్నారట. వైసీపీ క్యాడర్ పెద్ద సంఖ్యలో బయటకు రావడం, కొన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం సక్సెస్ అవడం తమకు ఇబ్బందేనని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవైపు ప్రతిపక్షం నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అవడం, మరోవైపు వివిధ వర్గాల బాధితులు జగన్‌ను కలవడం కూటమి నేతల్ని ఆలోచనలో పడేస్తోందట. జగన్ దగ్గరకు ఇలాగే…. బాధితులు క్యూ కడుతుంటే…. సమస్యల పరిష్కారం సంగతి తర్వాతగానీ… అసలు రాష్ట్రంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న చర్చ మొదలవుతుందని, అంతిమంగా అది తమకు నష్టం చేస్తుందన్నది కూటమి నాయకుల భయంగా తెలుస్తోంది.

