Site icon NTV Telugu

Off The Record: దూకుడు పెంచిన జగన్.. వ్యూహం అదేనా..?

Jagan

Jagan

Off The Record: పరామర్శల పేరిట ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. మిగతావాటి వ్యవహారం, చుట్టూ మసురుకున్న వివాదాల సంగతి పక్కనబెడితే…. రైతుల కోసం చేస్తున్న పరామర్శ యాత్రలకు మాత్రం స్పందన బాగుందన్న అభిప్రాయం పెరుగుతోందట పార్టీ సర్కిల్స్‌లో. ముందు గుంటూరు మిర్చి యార్డ్‌కు, ఆ తర్వాత పొగాకు రైతుల కోసం ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్ళారాయన. ఆ రెండు పర్యటనలు సక్సెస్‌ అన్న రిపోర్ట్‌ రావడంతో…ఇప్పుడిక మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతుల్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు యార్డ్‌ మొత్తం కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్ళినప్పుడు కూడా జనం భారీగా రావడం, విపరీతంగా ట్రాఫిక్‌ జాం అయిపోవడం లాంటి అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న వైసీపీ పెద్దలు… ఇక నుంచి రైతుల తరపున గట్టిగా పోరాడితే… ఫలితం కూడా బాగానే ఉంటుందని లెక్కలేస్తున్నారట.

Read Also: Indian defence: రూ. 1 లక్ష కోట్ల క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు ఆర్డర్..

ఆ ఊపులోనే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్‌తో బంగారుపాళ్యం వెళ్ళాలని డిసైడయ్యారని, అక్కడ కూడా భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు మాట్లాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. గుంటూరు, పొదిలి టూర్స్‌లో పలు ఆంక్షల ఉల్లంఘనలు జరిగాయంటూ పార్టీ నేతలు, కార్యకర్తల మీద కేసులు బుక్‌ అయ్యాయి. అయినాసరే… తగ్గకూడదని డిసైడైందట పార్టీ అధిష్టానం. ఏదైతే అదవుతుంది.. ఇక, ముందుకే అనుకుంటూ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు సిద్ధమైనట్టు సమాచారం. ఒకవేళ కేసులు పడ్డా.. రైతులు కోసం పోరాడుతుంటే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పడానికి కూడా వీలుంటుందన్న చర్చ సైతం ఉందట వైసీపీలో. ఈ విషయంలో అంత మొండిగా ముందుకు వెళ్ళడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జల యజ్ఞం పేరుతో ప్రాజెక్ట్‌ల నిర్మాణం, రైతుల కోసం భారీ కార్యక్రమాలను నిర్వహించారు. దాంతోనే రైతుల్లో ఆయన అంటే అభిమానం పెరిగిందని, అలా… గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి స్థిరపడ్డ ఓట్‌ బ్యాంక్‌… ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో తమకు బదిలీ అయిందని నమ్ముతున్నారట వైసీపీ నాయకులు. అందుకు తగ్గట్టే… పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీకి రూరల్ ఓటు బ్యాంక్ అండగా ఉంటోంది. ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన రైతు భరోసా, ఆర్బీకే సెంటర్స్‌ కూడా ప్లస్‌ అవుతాయని లెక్కలేసుకుంటున్నారట ఫ్యాన్‌ పార్టీ పెద్దలు.

Read Also: Pak Social Media Accounts: పాక్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం ఎత్తివేత..? ప్రభుత్వం క్లారిటీ..!

ప్రస్తుతం ఆర్బీకేలను పూర్తిగా మూసేయడం లాంటి వాటిని ప్రధాన ఆయుధాలుగా చేసుకుని రైతుల పక్షాన రెగ్యులర్‌గా పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తే… రూరల్‌ ఏరియాల్లో పట్టు తగ్గకుండా జాగ్రత్త పడవచ్చనుకుంటున్నట్టు సమాచారం. అందుకే వీలైనంత ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్‌ పర్యటనలు ఉండేలా ప్రోగ్రామ్స్‌ డిజైన్‌ చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. అదే సమయంలో… తెలుగుదేశం హయాంలో రైతులకు ప్రాధాన్యత ఉండదంటూ గట్టిగా ప్రచారం చేయగలిగితే తాము త్వరగా కోలుకోవచ్చని భావిస్తున్నారట వైసీపీ పెద్దలు. అలా ప్రచారం చేస్తే…. ఏకకాలంలో తమకు పాజిటివ్‌తో పాటు ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెరుగుతుందన్న లెక్కలున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా… రకరకాల కేలిక్యులేషన్స్‌, ఈక్వేషన్స్‌ని చూసుకునే… ఇక నుంచి వీలైనన్ని ఎక్కువ రైతు పరామర్శ యాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మామిడి రైతుల కోసం బంగారుపాళ్యం వెళితే… సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతుల పరిస్థితి దారుణంగా ఉందంటూ హైలైట్‌ చేసే అవకాశం దొరుకుతుందని కూడా భావిస్తోందట వైసీపీ అధిష్టానం. మొత్తం మీద బలం ఉన్న చోటే మరింత పట్టు బిగించి తిరిగి పుంజుకోవాలన్న వైసీపీ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version