Indian defence: రూ. 1 లక్ష కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) అనుమతి ఇచ్చింది. మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు సహా సైనిక హార్డ్‌వేర్ కొనుగోలు చేయడానికి 10 ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ ఆమోదం తెలిపింది. ‘‘ఆర్మర్డ్ రికవరీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ, త్రివిధ దళాల కోసం ఇంటిగ్రేటెడ్ కామన్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణుల సేకరణకు DAC తన అవసరాన్ని అంగీకరించింది. ఈ కొనుగోళ్లు సైన్యం వేగవంతమైన మోహరింపు, సమర్థవంతమైన వాయు రక్షణ, మెరుగైన సరఫరా గొలుసు నిర్వహణను అందిస్తాయి. సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను పెంచుతాయి’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Industrial Tragedy: సిగాచి ఫ్యాక్టరీలో బ్లాస్ట్.. ఈరోజు 13 మృతదేహాలు బంధువులకు అప్పగింత
మూర్డ్ మైన్స్, మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్, సూపర్ రాపిడ్ గన్ మౌంట్,సబ్‌మెర్సిబుల్ అటానమస్ వెసల్స్ సేకరణకు కూడా డీఏసీ అనుమతి ఇచ్చింది. ఈ కొనుగోళ్లు నావికాదళ, వ్యాపార నౌకలకు ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. స్వదేశీ డిజైన్, డెవలప్‌మెంట్‌ని మరింత ప్రోత్సహించడానికి ఇండియా తయారైన వాటిని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటన తెలిపింది.
భారతదేశ స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 1.46 లక్షల కోట్లకు చేరుకుందని, ఎగుమతులు 2024-25లో రికార్డు స్థాయిలో రూ. 24,000 కోట్లకు పెరిగాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పదేళ్ల క్రితం రక్షణ ఉత్పత్తి కేవలం రూ. 43,000 కోట్లు మాత్రమే ఉండేది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత తయారీ రక్షణ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా పనిచేశాయి. ప్రస్తుతం భారత ఆయుధాలు, వ్యవస్థలు, పరికరాలు, సేవలు దాదాపుగా 100 దేశాలకు చేరుకున్నాయని రక్షణ మంత్రి చెప్పారు. అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి మెగా డిఫెన్స్ ప్రాజెక్ట్‌లో మొదటిసారిగా పాల్గొనడానికి ప్రైవేట్ రంగానికి అవకాశాన్ని కల్పిస్తుందని, రక్షణ పరిశ్రమలో మేక్ ఇన్ ఇండియా డ్రైవ్‌ను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.