Off The Record: ఏపీలో ఏ పార్టీ అధినేత యాత్ర మొదలుపెట్టినా సెంటిమెంట్‌గా ఫీలయ్యే అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చాపురం. శ్రీకాకుళం జిల్లాకు చివర్న, తెలుగు, ఒడియా సంప్రదాయాల కలబోతగా ఉండే ఈ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ కోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవలేదు. అప్పట్లో ఈ నియోజకవర్గానికి చాలా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అదే సమయంలో నన్ను మరోసారి గెలిపిస్తే… నియోజకవర్గాన్ని నందనవనం చేసేస్తా, వాళ్ళేంటి అసలు డెవలప్‌మెంట్ మోడల్ అంటే ఏంటో నేను చూపిస్తానంటూ కోతలు కోసేశారు బెందాళం. ఆయన కోరుకున్నట్టుగానే జనం గెలిపించారు రాష్ట్రంలో కూడా సొంత పార్టీ ప్రభుత్వమే ఉంది. దీన్నే ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ఇచ్ఛాపురం జనం. మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఈ విడత గెలిచి కూడా ఏడాదిన్నర అయింది. నీ మార్క్ పనేదో ఒకటి చూపించమని నిలదీస్తున్నారట. మాటలు కోటలు దాటుతున్నాయిగానీ… ఆచరణ మాత్రం గడప దాటడం లేదన్నది లోకల్ వాయిస్.
ఎంతసేపూ…. చంద్రబాబు, లోకేష్‌ని పొగడటం, జగన్‌ను తిట్టడం తప్ప… అభివృద్ధిలో నీకంటూ వేసుకున్న మార్క్ ఏంటి, మాకు ఒరగబెట్టిందేంటన్నది ప్రజల ప్రశ్న. అచ్చెన్నాయుడు చెప్పినదానికల్లా తలాడిస్తూ తిరగడానికే నిన్ను మూడుసార్లు గెలిపించింది అంటూ.. తాజాగా వాయిస్ రెయిజ్ అవుతోంది. మరీ ముఖ్యంగా బెందాళం అశోక్ అనుచరులు చేస్తున్న ఇసుక దందాల గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇచ్చాపురం నియోజకవర్గానికి ప్రకృతి వరం బాహుదా, మహేంద్రతనయ నదులు. వాటిలో ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న అడ్డగోలు తవ్వకాలతో పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆ ఉద్దేశ్యంతోనే…గనుల శాఖ అధికారులు ఎక్కడా ర్యాంప్‌లకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ… ఎమ్మెల్యే మనుషులు, ద్వితీయశ్రేణి నాయకులు ఇష్టం వచ్చినట్టు ఇసుక తవ్వేసి పక్కనే ఉన్న ఒడిశాకు తరలించి అక్రమంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారన్న అరోపణలున్నాయి. ఇక మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా కనీసం ఇచ్చాపురం మున్సిపాలిటీలో తాగు నీటి సమస్యను తీర్చలేకపోయారన్న విమర్శలున్నాయి. ఇక రూరల్‌లోఉన్న ఉద్దానం ప్రాంత వాసులకు ప్రతీ ఇంటికి సురక్షిత నీటిని అందిస్తామన్నారు. ఇంతవరకు దానికి అతీగతీ లేదు. వైసీపీ హయాంలో ఇచ్చిన నీళ్ళే ఇప్పటికీ దిక్కు అంటున్నారు స్థానికులు. కొబ్బరి రైతులకు కోకో నట్ పార్క్, పనస పంటకు మద్దతు ధర లాంటి హామీలన్నీ ఏ కాకి ఎత్తుకుపోయిందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.
ముఖ్యంగా ఇచ్చాపురంలో ట్రాఫిక్ సమస్య అధికం. బ్రిటిష్ కాలం నాటి వంతెన 2023లో కూలిపోయింది. గత ప్రభుత్వం తాత్కాలిక మరమత్ములు చేసినా అది టూ వీలర్స్, నడకకే పనికి వస్తోంది. నేను ఎమ్మెల్యే అవగానే…. అసెంబ్లీలో కొట్లాడైనాసరే… రెండేళ్ళలో కొత్త వంతెన నిర్మిస్తానన్నారు బెందాళం. మరి ఏడాదిన్నర గడిచిపోయింది వంతెన ఎక్కడయ్యా అశోకా…. అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అలాగే… తన అనుచరుల ఆస్తులు పోతాయన్న కారణంతో… రైల్వే ప్లై ఓవర్ నిర్మించకుండా పిటిషన్స్ వేయించారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఆ బ్రిడ్జి లేక 16 గ్రామల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంతా కలిసి ఈ సారి మా పవరేంటో చూపిస్తామంటున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గతంలో కొందరు ఒక్కొక్కరి నుంచి లక్షా ఇరవైవేల నుండి లక్ష అరవై వేల దాకా కలెక్ట్ చేశారు. 350 మంది నిరుద్యోగుల మోసం చేసిన వారిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేసినా నిందితుల మీద ఈగ వాలకపోవడం వెనక సీక్రెట్ ఏంటో ఆ పెరుమాళ్ళకే ఎరుక అన్న మాట గట్టిగా వినిపిస్తోంది ఇచ్చాపురంలో. రూల్ ప్రకారం ప్రొసీడ్ అవుతూ తన మాట వినని ప్రభుత్వ ఉద్యోగులను ఎమ్మెల్యే తీవ్రంగా వేధిస్తారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపునకు ఎమ్మెల్యే వైఖరే కారణం అన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. దీన్ని గుర్తు చేసుకుంటూ… ఉద్యోగుల్ని తొలగించడం కాదు, ఈసారి మిమ్మల్ని తొలగించకుండా చూసుకోండంటూ వార్నింగ్ ఇస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామని కూడా అంటున్నారు. ఎమ్మెల్యే బెందాళం తీరు, ఆయన బ్యాచ్ ఇసుక దందాలు మొదటికే మోసం తెచ్చే ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.