NTV Telugu Site icon

Off The Record: ఏఐసీసీ కోటాలోకే తెలంగాణ రాజ్యసభ సీటు..?

Cong

Cong

Off The Record: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నాయకుడు కే కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పార్టీ మారినందున నైతికతకి కట్టుబడి.. బీఆర్‌ఎస్‌ తరపున వచ్చిన రాజ్యసభ సీటుని కూడా వదులుకుంటున్నానని చెప్పేశారాయన. ఆ తర్వాత ఆయన్ని సలహాదారుగా నియమించింది కాంగ్రెస్‌ సర్కార్‌. అంతవరకు ఓకే.. ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా ప్రస్తుతం కాంగ్రెస్‌ కోటాలోకి వచ్చే ఆ సీటును ఇప్పుడు ఎవరికి ఇస్తారన్న చర్చ జోరుగా జరుగుతోంది గాంధీభవన్‌ వర్గాల్లో.. అసలు కేశవరావుతో రాజీనామా చేయించడం వెనక ఉద్దేశ్య ఏంటన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వి.హనుమంతరావు, కోదండ రెడ్డి లాంటి వారంతా రాజ్యసభ కోసం క్యూలో ఉన్నారు. కానీ… అక్కడే ఇంకో డౌట్‌ కొడుతోందట. రాష్ట్ర నాయకులు సీటు ఆశించడం వరకు ఓకేగానీ.. అదసలు స్టేట్‌ కోటాకు వస్తుందా? లేక ఏఐసీసీ కోటాలో భర్తీ చేస్తారా అన్న చర్చ మొదలైంది.

Read Also: Warangal: ఎంజీఎంలో దారుణం.. నాలుగు రోజుల పసికందును పీక్కుతిన్న కుక్కలు

ఎక్కువ శాతం అది ఢిల్లీ కోటాకే వెళ్లవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. సీనియర్‌ లీడర్‌ అభిషేక్‌ మనుసింఘ్విని రాజ్యసభకి పంపాలని డిసైడైంది కాంగ్రెస్ హైకమాండ్. ఆయన్ని తెలంగాణ కోటాలోనే పంపవచ్చని అంటున్నారు. అదే నిజమైతే మరో రకమైన సమస్య మొదలు కావచ్చన్నది ఇక్కడి నేతల అభిప్రాయం. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రాష్ట్రంలో వివిధ పదవుల కోసం ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో… తెలంగాణకి వచ్చే రాజ్యసభ సీటును ఇక్కడి వారికి కాకుండా ఢిల్లీ కోటాకు అప్పగిస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్ళవచ్చన్న భయం కూడా ఉందట. తెలంగాణ నేతల అవకాశాలను దెబ్బతీశారన్న అపవాదును సైతం భరించాల్సి వస్తుందన్న భయం ఉన్నట్టు తెలిసింది.

Read Also: MLC Duvvada Srinivas House: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్‌..

దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడి సీనియర్ నేతలుగానీ, ఎన్నికల్లో కష్టపడిన వారి పేర్లను కానీ పరిశీలిస్తుందా.. లేక వాళ్ళ నిర్ణయమే ఫైనల్‌ అవుతుందా అన్నది చూడాలంటున్నారు పార్టీ నేతలు. రాష్ట్ర కోటాలో ఇతర రాష్ట్రాల నాయకులకు ఛాన్స్‌ ఇస్తే… ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్టు అవుతుందన్న చర్చ కూడా నడుస్తోందట కాంగ్రెస్‌ వర్గాల్లో. ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని నాన్‌ లోకల్‌కి అవకాశం ఇస్తే… ఇప్పటికిప్పుడు కాకున్నా… సందరర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని వాదించేవారు సైతం లేకపోలేదు టి కాంగ్రెస్‌లో. దీంతో ఇప్పుడు కేకే కోటా సీట్లో ఎవర్ని పెద్దల సభకు పంపుతారన్నది ఆసక్తికరంగా మారింది.