Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ బీజేపీలో అలజడి..? ఆపరేషన్‌ వికర్ష్‌ వలలో బీజేపీ నేతలు?

Bjp

Bjp

Off The Record: తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంపై ఢిల్లీలోని పార్టీ పెద్దలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా బీజేపీలో చేరికలపై టాప్‌ టు బాటమ్‌ కసరత్తు జరుగుతోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కొందరు ఇతర పార్టీల నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీ నాయకులు ఆశించినట్టు వరదలా చేరికలు లేకపోయినా.. అడపా దడపా చేరినవారు ఉన్నారు. ప్రత్యేకంగా చేరికల కమిటీ వేసినా అనుకున్నంత జాయినింగ్స్‌ లేవు. పార్టీలో ముఖ్యనేతల మధ్య అభిప్రాయ భేదాలు చేరికల ప్రభావం చూపినట్టు సమాచారం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ కూడా సంస్థాగత బలోపేతంపై క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. చేరికలపై సంతృప్తి లేకపోయినా.. ఇప్పటికే బీజేపీలో ఉన్న నాయకులు ఎవరైనా పార్టీని వీడి వెళ్లిపోతున్నారా అనే అనుమానాలు పెరుగుతున్నాయట. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన కొందరు నాయకులు కాషాయ శిబిరంలో అడ్జెస్ట్‌ కాలేక పోతున్నారట. బీజేపీ పద్దతులకు అలవాటు పడలేక.. ఉండలేక.. ఉక్కపోతుకు ఫీలవుతున్నారట. బీజేపీలోని ఇతర లీడర్స్‌తో మింగిల్‌ కావడం లేదనే చర్చ నడుస్తోంది.

Read Also: EO Lavanna: మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన శ్రీశైలం ఈవో.. అందుకేనంటూ లవన్న వివరణ..

బీజేపీలో కొద్దిరోజులుగా నాయకులు పార్టీని వీడివెళ్లిపోతారు అనే అంశంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో కొందరు అలాగే జంప్‌ చేశారు. దీనికితోడు అధికారపార్టీ BRS కూడా రివర్స్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గులాబీ పార్టీ ట్రాప్‌లో పడ్డది ఎవరన్నదే మిస్టరీ. ఉగాది నాటికి కీలక పరిణామాలకు ఆస్కారం ఉందని చెవులు కొరుక్కుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లిపోయారు. బీజేపీలో ఇమడలేక.. ఉన్న నేతలతో పొసగక బీజేపీని వీడుతున్నట్టు కన్నా ఓపెన్‌గానే చెప్పేశారు. ఇదే పరిస్థితి తెలంగాణ బీజేపీలోనూ ఉందనేది ఓ ప్రచారం. ఒకవేళ బీజేపీని వీడాలని అనుకుంటే.. వాళ్లు ఎవరు? ఈ అంశంలో ఢిల్లీ పెద్దలకు ఉన్న సమాచారం ఏంటి? తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు.. తమకు అందుతున్న రిపోర్టులు ఆధారంగా బీజేపీ అధిష్ఠానం ఆరా తీస్తోందా? వలస నేతలు బీజేపీని వీడటానికే నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారట. మొత్తానికి ఎన్నికల వేళ ఆపరేషన్‌ వికర్ష్‌కు ఎంత మంది బీజేపీ నేతలు చిక్కుతారో.. లేక కేవలం ప్రచారంగానే ఈ అంశం మిగిలిపోతుందో చూడాలి.

Exit mobile version