Off The Record: తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. 2024 ఎన్నికల ఫలితాలు, ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీలే అందుకు నిదర్శనం. అందులోనూ గ్రేటర్ విశాఖ సిటీలో అయితే సైకిల్ సవారీకి ఎదురే లేకుండా పోయింది. కూటమి కట్టినా…ఒంటరిగా పోటీ చేసినా సిటీ పరిధిలోని నాలుగు స్ధానాలు టీడీపీ ఖాతాలోనే పడుతున్నాయి. అదే సమయంలో జనసేన, బీజేపీలకు ఇదే ప్రధాన కార్యక్షేత్రంగా మారింది. ఇక్కడ ఓటర్ల ఆదరణ చాలా కీలకమని జనసేన చాలా కాలం క్రితమే గుర్తించింది. అందుకే… ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్ధానాలను పట్టుబట్టి సాధించుకుంది. పెందుర్తి, విశాఖ దక్షిణం, అనకాపల్లి, యలమంచిలి సీట్లను కేవలం గెలుచుకోవడమే కాకుండా… మంచి మెజార్టీలు సాధించింది గ్లాస్ పార్టీ. ఈ విజయం తర్వాత తెలుగుదేశం పార్టీతో సమానంగా ఎదగాలనే ఆలోచనలు పెరిగాయట జనసేన నేతలకు. ఈ క్రమంలో… ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఉత్తరాంధ్ర కేంద్రంగా రాజకీయాలు నడిపేందుకు రెడీ అయ్యారు. ఇక నుంచి నెలకు 10రోజులు ఈ ప్రాంతంలోనే వుంటానని ప్రకటించారాయన. అదే ఊపుతో…. వైసీపీలోని అసమ్మతి వర్గానికి గాలం వేసింది జేఎస్పీ. గ్రేటర్ విశాఖ పరిధిలో సొంతగా మూడు కార్పొరేటర్లను గెలిచింది జనసేన.
Read Also: Hyderabad: నగర వాసులకు అలర్ట్.. వర్షం కారణంగా ఏదైనా ఆపదొస్తే అత్యవసర నంబర్లు ఇవే..
అయితే.. ఇటీవల జరిగిన చేరికలతో జీవీఎంసీలో ఆ పార్టీ బలం 14కు పెరిగింది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. వైసీపీ చేతిలో వున్న మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి టీడీపీ హైడ్రామా నడిపించింది. విదేశాల్లో క్యాంప్స్ పెట్టి మరీ భారీగా ఖర్చు చేసింది. అందుకు ప్రతిగా వైసీపీ ఇతర రాష్ట్రాల్లో క్యాంప్స్ నిర్వహించినా…. జనసేన మద్దతుతో మేయర్ పై అవిశ్వాసం నెగ్గింది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేనకు ఝలక్ ఇచ్చేందుకు తెరవెనుక ప్రయత్నం జరిగినప్పటికీ గ్లాస్ పార్టీ నాయకత్వం పట్టుబట్టడంతో గౌరవం దక్కింది. కానీ.. మెల్లిగా జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య లుకలుకలు తారాస్ధాయికి చేరుతున్నాయని చెప్పుకుంటున్నారు. కనీస గౌరవం లభించడం లేదని….టీడీపీ నాయకత్వం తమను అస్సలు ఖాతరు చేయడం లేదనే ఆవేదన జనసేనలో గూడు కట్టుకుపోతోంద. పార్టీ లైన్ కోసమో…. వ్యక్తిగత ఆలోచనలతోనో ఎమ్మెల్యేలు సర్దుకునిపోతున్నప్పటికీ జనసేనలోని మిగతా నాయకులు మాత్రం రాజీపడలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నాగబాబు నిర్వహించిన సమావేశంలో కేడర్ బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తం చేసింది. ఎన్నికల నాటితో పోలిస్తే ఇప్పుడు టీడీపీ ఆధిపత్య ధోరణి బాగా పెరిగిందని, ఆ కారణంగా నియోజకవర్గాల్లో బలహీనపడ్డామనే ఆందోళన పెరుగుతోందట గ్లాస్ కేడర్‌లో. ఐతే, కూటమికి వ్య తిరేకంగా ఎటువంటి బహిరంగ చర్యలు వద్దని.. ఆలస్యం అయినా పదవులు ఖచ్చితంగా వస్తాయని అనునయిస్తూనే.. జనసేన హైమాండ్ కాస్త హెచ్చరిక ధోరణి ప్రదర్శించిందట.
Read Also: Hyderabad: హైదరాబాదులో భారీగా వర్షపాతం నమోదు.. ఆ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జాం..!
ఇక నాగబాబు పర్యటన జరిగి వారం రోజులు తిరక్క ముందే గ్రేటర్ విశాఖలో కూటమికి ఊహించని షాక్ తగిలింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహాలకు జనసేన చెక్ పెట్టింది. సంఖ్యాబలం ఆధారంగా 6 స్ధానాలకు తెలుగుదేశం, మూడు జేఎస్పీ, ఒక దానికి బీజేపీ పోటీ చేయాలని భావించాయి. ఐతే, ఆఖరి నిము షంలో ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు జనసేన ప్రకటించింది. దీంతో 9 చోట్ల టీడీపీ, ఒకటి బీజేపీ పోటీ చేయగా….వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను నిలిపింది. ఇక్కడ కూటమి సభ్యుల బలం 63 కాగా స్టాండింగ్ కమిటీలో 44ఓట్లు ఎవరు సాధిస్తే వాళ్ళే విజేత. కానీ, టీడీపీ పోటీ చేసిన 9 స్ధానాల్లో అనూహ్యంగా ఒక చోట వైసీపీ విజయం సాధించింది. అది కూడా 50 ఓట్ల మెజారిటీతో. మిగిలిన స్ధానాల్లోనూ ఆశించిన దాని కంటే చాలా ఎక్కువ ఓట్లు ప్రతిపక్షానికి పడ్డాయి. దీన్ని బట్టి చూస్తే పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్టు అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఊహించని ఈ ఫలితంతో టీడీపి ఖంగుతింది.
Read Also: Radhika Apte : ప్రెగ్నెంట్ టైమ్ లో ఆ నిర్మాత ఇబ్బంది పెట్టాడు.. హీరోయిన్ ఎమోషనల్
వైసీపీ నుంచి వలస వచ్చిన కార్పొరేటర్లు కొట్టిన దెబ్బేనని టీడీపీ భావిస్తున్నప్పటికీ…జనసేనతో పెరిగిన గ్యాప్ వల్ల ఎదురైన తొలి షాకింగ్ ఎక్స్ పీరియన్స్ అది అని అంటున్నాయి రాజకీయవర్గాలు. భవిష్యత్ పరిణామాలకు ఇది జస్ట్ శాంపిల్ అంటూ లోలోపల మాట్లాడేసుకుంటున్నారు ఇరు పార్టీల నాయకులు. ఈ పరిస్ధితికి ప్రధాన కారణం టీడీపీయేనన్నది జనసేన వాదన. టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో…. జనసేన నాయకత్వానికి ఎదురౌతున్న గడ్డుపరిస్ధితులే అందుకు కారణం అన్న అభిప్రాయం వ్య క్తం అవుతోంది. మర్యాదలు… మాటలకు, బహిరంగ సభలకు పరిమితం అవుతుండగా రాజకీయంగా ఎదిగేందుకు…..కేడర్ అవసరాలను తీర్చేందుకు ఎమ్మెల్యేలు సహకరించడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. మొత్తంగా టీడీపీ-జనసేన మధ్య పొత్తు సక్రమంగా లేకుండా ఏమవుతుందో జీవీఎంసీలో మరోసారి నిరూపితమైందని అంటున్నారు పరిశీలకులు.
