Site icon NTV Telugu

Off The Record: అత్యంత కీలకమైన ఆ నియోజకవర్గంలో అధికారులు నలిగిపోతున్నారా?

Pulivendula Tdp

Pulivendula Tdp

Off The Record: పులివెందుల….పొలిటికల్‌గా ఈ పేరు చెప్పగానే…. ఏపీలో ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్‌ కుటుంబమే. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటలా మలుచుకుంది ఆ ఫ్యామిలీ. అలాంటిచోట పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది టీడీపీ. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో… వైనాట్‌ పులివెందుల నినాదం ఇచ్చింది. మరి అలాంటి చోట ఆ పార్టీ తీరు ఎలా ఉండాలి? ప్లానింగ్‌ ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉండాలి? కానీ… లోకల్‌ లీడర్స్‌ మాత్రం ఆ రూట్లో లేరని చెప్పుకుంటున్నారు స్థానిక కార్యకర్తలు. ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ బీటెక్‌ రవి వాలకం చూస్తుంటే… వైనాట్‌ పులివెందుల నినాదం సంగతి తర్వాత… అసలు మేం పుంజుకుంటామా లేదా అన్న డౌట్‌ వస్తోందని అంటోందట నియోజకవర్గ పార్టీ కేడర్‌. ఆధిపత్య పోరుతో ఇద్దరూ ఇక్కడ పార్టీకి పాతరేస్తున్నారన్నది కేడర్‌ వాయిస్‌. అదంతా ఒక ఎత్తయితే… ఇక్కడ పని చేయడం మావల్ల కాదు బాబోయ్‌… అంటూ చేతులెస్తేస్తున్నారట అధికారులు.

Read Also: Varun Aaron: ఐపీఎల్ 2026 కోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌..!

ఆధిపత్య పోరుతో నాయకులిద్దరూ వత్తిళ్ళు పెంచడంతో… ఇక్కడ ఉద్యోగం చేయడం మావల్ల కాదని దండం పెట్టేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం కింద.. నియోజకవర్గస్థాయిలో విజన్ 2047 సాకారానికి అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు అధికారులు. మామూలుగా అయితే… ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ లెక్క ప్రకారం పులివెందుల ఎమ్మెల్యే అయిన వైసీపీ అధినేత జగన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాలి. కానీ.. ఆయన మీటింగ్‌కు వచ్చే అవకాశం లేకపోవడంతో… ప్రత్యేక ఆహ్వానితుడిగా….. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవికి ఇన్విటేషన్‌ పంపారు అధికారులు. సరిగ్గా ఇక్కడే తాజా వివాదం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు.. నియోజకవర్గానికి చెందిన నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా… ఆ ప్లేస్‌లో నన్నెందుకు పిలవలేదంటూ…ఫైరై పోయారట ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి. పి4 కార్యక్రమంలో భాగంగా… ప్రతి నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే…. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీని, పులివెందుల నివాసిని అయిన తనను ఎందుకు ఈ కార్యక్రమానికి పిలవలేదంటూ రాంగోపాల్ రెడ్డి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Read Also: Tragic : యాదాద్రిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

ప్రత్యేక అధికారి అయిన రాజ్యలక్ష్మిని వాట్సప్ కాల్‌లో నిలదీశారట ఎమ్మెల్సీ. అధికార పార్టీ ఎమ్మెల్సీ అయిన నన్నే కార్యక్రమానికి పిలవరా ? మీరు ఉద్యోగం ఎలా చేస్తారో, నేను కూడా చూస్తానంటూ బెదిరించినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ బెదిరించారంటూ ఆ అధికారి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారట. పులివెందుల ప్రత్యేక అధికారిగా తాను పని చేయలేనని కూడా రాజ్యలక్ష్మి కలెక్టర్‌కు చెప్పేసినట్టు సమాచారం. అయితే… తొందరపడవద్దని, ప్రజా ప్రతినిధులతో నేను మాట్లాడతానని ఆమెకు కలెక్టర్ భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అయినా ఆమె భయం తగ్గకపోవడంతో…. ఈ అంశాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని కూడా కలెక్టర్ ఆ అధికారికి హామీ ఇచ్చి నచ్చజెప్పినట్టు సమాచారం. మొన్న పోలీసులు, నేడు ఇతర అధికారులు… ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో విభాగానికి చెందిన వారు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారట. అయ్యబాబోయ్ పులివెందులా… అక్కడ మేం పనిచేయలేమంటున్నారన్నది అధికార వర్గాల టాక్‌. రాను రాను సంక్లిష్టంగా మారుతున్న ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా డీల్‌ చేస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Exit mobile version