NTV Telugu Site icon

Off The Record: వేడెక్కుతున్న వైరా రాజకీయాలు.. అభ్యర్థిని ప్రకటించిన పొంగులేటి

Ponguleti Srinivas Reddy Po

Ponguleti Srinivas Reddy Po

Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా రాజకీయాలు వాడీవేడిగా మారుతున్నాయి. ఇది గిరిజనులకు రిజర్వ్‌ చేసినా నియోజకవర్గమైనప్పటికీ సాధారణ సెగ్మెంట్‌కు మించిన పొలిటికల్ ఎత్తులు నడుస్తున్నాయి. వైరాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరులు ఎక్కువే. గత కొన్నిఎన్నికల్లో ఆయన చెప్పినవారే ఎమ్మెల్యేలుగా గెలుస్తుండటంతో.. ఆ విజయాన్ని పొంగులేటి ఖాతాలో వేసేవారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం అధికారపార్టీలో రెబల్‌గా మారిపోయారు పొంగులేటి. ఆయన అనుచరులు సైతం ఒక్కొక్కరుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో వైరాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్న కొందరు బీఆర్‌ఎస్‌ నేతలపై వేటు వేశారు. వాళ్లంతా పొంగులేటి వర్గమే కావడంతో వైరాపై జిల్లా అంతా అటెన్షన్‌ వచ్చింది. ఈ సమస్య ఇలా ఉండగానే వైరాకు అభ్యర్థిని ప్రకటించేశారు ఈ మాజీ ఎంపీ. తన వర్గానికి చెందిన విజయాభాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఆయన చెప్పేశారు.

Read Also: Off The Record: ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు.. లెక్క మారడంతోనే అభ్యర్థిని మార్చారా..?

అసలు పొంగులేటి బీఆర్ఎస్‌ను వీడి ఏ పార్టీలో చేరుతున్నారో ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీలో చేరిపోతారని అనుకుంటున్న సమయంలో వైఎస్‌ఆర్‌టీపీ నేతలతో భేటీ అయ్యి కన్ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇప్పుడు వైరా అభ్యర్థిని ప్రకటించడం మరో ఆసక్తికర పరిణామం. ఆయన ఏ పార్టీనో తెలియదు.. వైరాలో అభ్యర్థి పోటీ చేసే పార్టీ ఏంటో స్పష్టత లేదు. కానీ.. తన వర్గం నుంచి విజయభాయి పోటీ చేస్తారని వెల్లడించారు పొంగులేటి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఇల్లెందు, పినపాక, మధిర, అశ్వారావుపేటలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు మాజీ ఎంపీ. అక్కడ నుంచి ఆయన వర్గంలో ఎవరు పోటీ చేస్తారో.. ఎవరు ఆయన అనుచరులో జనాలకు తెలుసు. కానీ.. వైరాలో ఇన్నాళ్లూ బలమైన నేత కోసం అన్వేషణ చేశారట. చివరకు విజయాభాయిని ఆయన ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. విజయాభాయి 2018 ఎన్నికల్లో వైరాలో CPI అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Read Also: Off The Record: ఎమ్మెల్యే వసంత తీరుపై వైసీపీలో చర్చ.. చర్యలు భిన్నం..!

2014 ఎన్నికల్లో పొంగులేటి వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు వైరాలో తన అనుచరుడిగా ఉన్న మదన్‌లాల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తర్వాత మదన్‌లాల్‌ పొంగులేటితో విభేదించారు. 2018 ఎన్నికల్లో మదన్‌లాల్‌ అధికారపార్టీ నుంచి పోటీ చేస్తే.. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచిన రాములు నాయక్‌కు పొంగులేటి మద్దతు పలికారు.. గెలిపించారు. ఇప్పుడు రాములు నాయక్‌తోనూ మాజీ ఎంపీకి పడటం లేదు. తాను నిలబెట్టిన వారే వైరాలో గెలుస్తున్నారన్న నమ్మకమో ఏమో.. ఇప్పుడు ముందుగానే తన అభ్యర్థి ఎవరో తేల్చేశారు. విజయభాయిది కమ్యూనిస్ట్‌ పార్టీ బ్యాక్‌గ్రౌండ్‌ కావడంతో అది కూడా ఆమెకు కలిసి వస్తుందనే లెక్కలు వేశారట. మరి.. వచ్చే ఎన్నికల్లో వైరాలో ఏం జరుగుతుందో కానీ.. తన రాజకీయ ప్రయాణంపై మాజీ ఎంపీ ఎప్పుడు స్పష్టత ఇస్తారో అని జనాలు.. రాజకీయవర్గాలు ఎదురు చూస్తున్నాయి.