Off The Record: కాకినాడ రూరల్ టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు పదవికి రాజీనామా చేశారు. కారణాలను వివరిస్తూ… పార్టీ అధిష్టానానికి సుదీర్ఘ లేఖ రాశారాయన. అదంతా ఒక ఎత్తయితే… ఈ పరిణామాల గురించి మాత్రం తెగ గుసగుసలాడేసుకుంటోంది లోకల్ టీడీపీ కేడర్. ఏ ప్రయోజనాలు ఆశించి పిల్లి ఈ స్టంట్స్ చేస్తున్నారన్నది కేడర్ క్వశ్చన్. అధికార పార్టీలో కో ఆర్డినేటర్ పదవి అంటే… ఒక స్థాయి, స్థానం ఉంటుంది. అలాంటి పోస్ట్‌ను కూడా పిల్లి దంపతులు ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు? కొత్త వివాదాన్ని ఎందుకు తెర మీదికి తెచ్చారని చర్చించుకుంటున్నారట తమ్ముళ్ళు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటు జనసేనకు వెళ్ళింది. అది మాకే దక్కాలన్న పట్టుదలతో అప్పుడు చాలా ప్రయత్నాలు చేసింది పిల్లి ఫ్యామిలీ. పైకి మాత్రం జనసేన అభ్యర్థి నానాజీ గెలుపు కోసం పని చేస్తున్నామని బిల్డప్‌లు ఇస్తూనే…. తెర వెనక వైసీపీతో మంతనాలు జరిపారన్న ప్రచారం ఉంది. ఎన్నికల తర్వాత స్వయంగా ఎమ్మెల్యే వర్గం ఈ విషయంపై ఓపెన్‌గానే మాట్లాడింది. వాళ్ళ కొడుకులు చెట్ట పట్టాలేసుకుని తిరిగారని సొంత పార్టీలోనే చర్చ జరిగింది. టీడీపీ పెద్దలు కూడా దీని గురించి ఆరా తీసినట్టు గుసగుసలు వినిపించాయి. గతంలో టిడిపి తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు పిల్లి అనంతలక్ష్మి. కానీ… 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక కాడిపడేశారు. అసలు అప్పట్లో టీడీపీకి, తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు మాజీ ఎమ్మెల్యే. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నియోజకవర్గానికి వచ్చినా… కనీసం అటువైపు తొంగి చూడలేదు పిల్లి ఫ్యామిలీ.
Read Also: Schocking : టీవీ సీరియల్ గొడవ.. మహబూబాబాద్‌లో భార్య బిడ్డతో ఆత్మహత్యాయత్నం
దీంతో అసలు వాళ్ళు టీడీపీలోనే ఉన్నారా అన్న చర్చ జరిగింది పార్టీ వర్గాల మధ్య. అలా మూడేళ్ళకు పైగా గడిపేశారట. ఇక 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ అవడంతో… మాజీ ఎమ్మెల్యే భర్త పిల్లి సత్తిబాబుకు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. గతంలో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నాసరే… అటు లోకల్ అవసరాల కోసం పార్టీ దగ్గరకు తీసింది. ఇటు సీటు ఆశతో వీళ్ళు కూడా దగ్గరయ్యారు. కానీ… పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ జనసేనకు వెళ్ళడంతో పిల్లి ఫ్యామిలీకి నిరాశ తప్పలేదు. ఇక అప్పటి నుంచి రాగం, తాళం వేరుగా పడుతున్నాయన్నది ఈ కుటుంబం మీదున్న ఆరోపణ. అందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే కో ఆర్డినేటర్, కో కోఆర్డినేటర్‌ను నియమించారని చెప్పుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. అయినా… ఇప్పుడసలు పిల్లి ఫ్యామిలీకి అంత సీన్ లేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట. ఏదో… ఎన్నికల సమయంలో బుజ్జగింపుల కోసం సత్తిబాబుకు కోఆర్డినేటర్ గా అవకాశం ఇచ్చారుగానీ… వాళ్ళ మీద పార్టీకి అంత ఆశలేం లేవని సొంత కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక తన పదవికి రాజీనామా చేస్తూ… ఒకవైపు ఎమ్మెల్యే మీద, మరోవైపు పార్టీ కో కోఆర్డినేటర్ మీద ఫైరయ్యారట సత్తిబాబు. పార్టీ అబ్జర్వర్ కూడా తనకు విలువ ఇవ్వడం లేదని బరస్ట్ అయిపోతున్నారాయన. ఈ వ్యవహారాలపై జిల్లా పార్టీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. పరిస్థితులను బట్టి సత్తిబాబు, అనంతలక్ష్మి దంపతులు వ్యవహరించాలని, అలా కాకుండా లేనిపోని హడావిడి చేస్తే వాళ్ళకే మైనస్ అవుతుందని కూడా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Urea Shortage: యూరియా కొరత.. ఆంక్షలు పెట్టిన సర్కార్.. అలా చేస్తే కేసులే..!
గత ఎన్నికల్లో సీటు రాదని తెలిశాక పార్టీ జెండాలు తగలబెట్టి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయించిన మాట మర్చిపోయారా అని కూడా ప్రశ్నిస్తున్నారట కొందరు నాయకులు. పార్టీ అన్ని వ్యవహారాలను గమనిస్తూనే ఉంటుందని, టైం వచ్చినప్పుడు ఎవరిని, ఎక్కడ ఎంత నైస్‌గా కట్ చేయాలో పెద్దోళ్ళకి తెలిసినంతగా వేరే ఎవరికి తెలుసంటూ సెటైర్స్ కూడా పడుతున్నాయట. అయినా… పిల్లి ఫ్యామిలీకి ఇదేమీ కొత్త కాదని, ప్రతిసారి రాజీనామా చేస్తామని బెదిరింపులకు దిగడం వల్ల వాళ్లతో పాటు పార్టీ కూడా పలుచన అవుతోందని అంటున్నారు ఇంకొందరు ద్వితీయ శ్రేణి నాయకులు. అసలిప్పుడు పార్టీలో మెజార్టీ క్యాడర్ పిల్లి నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారు కాబట్టే…
కొత్త పలుకులు పలుకుతున్నారన్నది ఇంకో వెర్షన్. మొత్తానికి కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్‌గా పిల్లి సత్తిబాబు రాజీనామాను పార్టీ అంత సీరియస్‌గా తీసుకోనట్టు కనిపిస్తోందన్నది లోకల్ టాక్. ప్రతిసారి చిన్నపిల్లల ఆటలా రాజీ డ్రామాలు ఆడితే ఎవరు నాన్నా పులి కథలా అవుతుందే తప్ప పైసా ప్రయోజనం ఉండబోదన్నది నియోజకవర్గంలో విస్తృతాభిప్రాయం. తాజా రాజీనామా క్రమంలో ఈసారి టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.
