Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి పార్టీల మధ్య కుంపట్లు గట్టిగానే రాజుకుంటున్నాయట. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పెందుర్తిలో పరిణామాలు సెగలు పొగలు కక్కేస్తున్నట్టు చెబుతున్నారు. జనసేన గెలిచిన ఈ స్ధానంలో… సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోందట. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో… పోలీసు, ఇతర కీలక శాఖల పోస్టింగుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు పెద్ద అగాధమే సృష్టించినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేని అయి ఉండి కూడా.. తన మాట చెల్లుబాటు కాలేదని ఆగ్రహించిన పంచకర్ల రమేష్ బాబు……వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సరెండర్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన పోటీ ఇటీవల వీఎంఆర్డీఏ సమావేశంలో మంత్రుల సాక్షిగా రచ్చరచ్చ చేసుకునే వరకు వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో పార్టీ జెండా తప్ప నేతల అజెండాతో సంబంధంలేని కేడర్ తీవ్రంగా నలిగిపోతోంది. దీంతో పలువురు ప్రజా ప్రతినిధులు సహా సుమారు 400మంది టీడీపీకి రాజీనామా చేసేశారు. అధికారంలో వున్న పార్టీని వదిలిపోవడమంటే మామూలు విషయంకాదు. అయినా సరే… వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే… పెందుర్తిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.
Read Also: Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. ఎగ్జాట్లీ ఏ సమయంలో జరిగిందంటే..?
త్వరలోనే మరికొంత మంది మండల స్ధాయి నాయకులు పార్టీని వీడిపోతారన్న ప్రచారంతో… పెందుర్తి టీడీపీలో ఆందోళన పెరుగుతోందట. అయితే… దీని వెనక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయంటున్నారు స్థానిక నేతలు. ప్రస్తుతం టీడీపీని వీడుతున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరగణం. కాపు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళంతా ప్రజారాజ్యం, జనసేన ఏర్పాటైనప్పుడు కూడా టీడీపీలోనే కొనసాగారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎదురైన సవాళ్ళను తట్టుకుని నిలబడి మరీ పసుపు జెండా ఎగరేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేస్తున్నారంటే… అందులో రాజకీయ కారణాలు వేరే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే… పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి మధ్య వర్గపోరు మొదటి నుంచీ ఉన్నదే. బండారు సొంత నియోజకవర్గం పెందుర్తి కావడంతో ఇక్కడ ఆయనకు గట్టి పట్టుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గండిబాబ్జీ రాజకీయాలతో తీవ్రంగా విభేదిస్తుంటారు బండారు. అధినాయకత్వం ఆదేశాలకు లోబడి కలిసి పనిచేసినట్టు కనిపించినా కౌగిలించుకుని కత్తులు దూసుకోవడం కామన్. విశాఖజిల్లా టీడీపీ అధ్యక్షుడుగా కూడా వ్యవహరిస్తున్న గండి బాబ్జీకి ఇటీవల పెందుర్తి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది టీడీపీ. దాంతో… తన వర్గం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా పాత పరిచయాలను యాక్టివేట్ చేస్తున్నారట ఆయన.
Read Also: Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ హస్తం పార్టీలో గ్రూప్ వార్.. కారణం ఏంటి ?
ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల్ని టీడీపీలో చేర్చుకుని వాళ్ళకు ప్రాధాన్యత కల్పించడం సహజంగానే బండారు వర్గానికి రుచించడం లేదట. మాడుగుల ఎమ్మెల్యేగా వున్నందున పెందుర్తి వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోవద్దని హైకమాండ్ ద్వారా బండారుకు బ్రేకులు వేయించడంలో సక్సెస్ అయ్యారు బాబ్జీ. దీంతో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం తప్ప మరో గడవ తెలియని ద్వితీయ శ్రేణి నాయకులు ఇరుకున పడుతున్నారట. ఇది పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారం కావడంతో… ఇందులో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటంలేదు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు. ఎమ్మెల్యే జనసేనకు ప్రాధాన్యత ఇస్తుండటం, గండిబాబ్జీ వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళకు పెద్దపీట వేయడంతో…ఇక మనకు చోటక్కడ అంటూ రివర్స్ అవడం మొదలుపెట్టారట పాత టీడీపీ నాయకులు. పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళను ఇన్చార్జ్ పట్టించుకోవడం లేదనే అసంత్రుప్తి బహిర్గతం అయింది. అదే ముదిరి ఇప్పుడు రాజీనామాల దాకా వెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. పెందుర్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధిష్టానం చెప్పడంతో… ఇప్పుడు రాజీనామాల విషయంలో కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట బండారు. నియోజకవర్గంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి వెళ్ళిపోవడం, మరికొందరు జంప్ అవుతారనే ప్రచారం అధికారంలో ఉండి కూడా టీడీపీకి మైనస్‌గా మారుతోందని అంటున్నారు. ప్రస్తుతం బయటకు వెళ్ళిపోతున్న టీడీపీ సీనియర్స్ త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. అలాగని వాళ్ళంతా వైసీపీలో చేరే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పంచకర్ల స్వాగతిస్తే పెద్ద ఎత్తున జనసేనలో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వర్గ విభేదాలు, నాయకుల ఇగోలతో పెందుర్తి టీడీపీ బాగా నష్టపోతోందన్నగి లోకల్ వాయిస్.
