Off The Record: వైసీపీ కంచుకోట పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్. ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానంలో… అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీకి ఓట్లు పడిపోతాయి. అందుకే 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టగలిగింది. గత ఎన్నికల్లో అయితే… రాష్ట్రం మొత్తం కూటమి ప్రభంజనం సృష్టించినా… ఇక్కడ మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు… టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై గెలిచారు. కానీ… ఆ తర్వాతి నుంచి లోకల్ వైసీపీలో తేడాలు పెరిగిపోతున్నాయట. పార్టీకి జనంలో ఆదరణ బాగానే ఉన్నా… పరస్పరం పొసగక నాయకులే పరిస్థితిని దిగజార్చుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది పాడేరులో. ఇటీవల సంస్థాగత మార్పుల్లో భాగంగా… ఎమ్మెల్యేకి అల్లూరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హై కమాండ్. మరో నేత భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్ టీమ్ సభ్యురాలిగా ప్రకటించింది. ఆ తర్వాతి నుంచి మారుతున్న పరిస్థితులతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Maharashtra: ‘మహా’రాజకీయం.. ఫడ్నవీస్, షిండే భేటీ..
ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకు వస్తున్న సమస్యలు విశ్వేశ్వరరాజును చికాకు పెడుతున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంది వైసీపీ హైకమాండ్. దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వర రాజు .. అధ్యక్షా”…. అనే అవకాశం లేకుండానే సమావేశాలు ముగిసిపోయాయి. కానీ… ప్రత్యర్థి వర్గం మాత్రం…ఎమ్మెల్యే ఏం చేయడం లేదు, ఏం మాట్లాడ్డం లేదంటూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తోందట. స్పెషల్ డీఎస్సీ, జీవో నెంబర్ 3 వంటి అంశాలపై విశ్వేశ్వరరాజు గొంతు విప్పాలని, తాము ఓట్లేసి గెలిపించినందున అసెంబ్లీ దగ్గరే స్వరం వినిపించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగానే చేసినట్టు సమాచారం. ఇదంతా చూస్తున్నవారు మాత్రం ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టేందుకే కొందరు పనిగట్టుకుని ఇలాంటి స్పెషల్ కేంపెయిన్ చేస్తున్నట్టు గుసగుసలాడుకుంటున్నారట. మరోవైపు విశ్వేశ్వర రాజు పై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి న్యాయపోరాటం ప్రారంభించారు. ఎన్నికల అఫిడవిట్లో ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు వెల్లడించలేదని, అందుకు ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ కోర్ట్‌కు వెళ్ళారామె. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీ కమిషన్ మెంబర్‌గా లాభదాయకమైన పదవి నిర్వహించిన విశ్వేశ్వర రాజు… అప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతభత్యాలను అఫిడవిట్‌లో పొందుపరచకపోవడం నేరం అన్నది ఈశ్వరి వాదన. ఇందులో గనక ఏదన్నా కాస్త తేడా జరిగినా ఆయనకు ఇంకో టెన్షన్ మొదలైనట్టేనంటున్నారు పరిశీలకులు. ఇటు పార్టీలో, అటు బయట సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట పాడేరు ఎమ్మెల్యే.
Read Also: Relationship Tips: ఆ సమస్యల కారణంగా లైంగిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు.. జాగ్రత్త మరి
బయటి సంగతి ఎలా ఉన్నా… పార్టీ అంతర్గత రాజకీయాలు మాత్రం ఆయనకు చాలా ఇబ్బందికరంగా మారాయన్నది ఇంటర్నల్ టాక్. నియోజకవర్గంలో భాగ్యలక్ష్మి, విశ్వేశ్వర రాజు వర్గాల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందంటున్నారు స్థానిక నాయకులు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన పార్టీ అధినాయకత్వం ఇటీవల పాడేరు నియోజకవర్గ నాయకులను తాడేపల్లి పిలిచి… కుమ్ములాటలతో నష్టం చేస్తే సహించబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఆ మీటింగ్ తర్వాత పార్టీలోని రెండు వర్గాలు కలిసి పనిచేసినట్టు కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నా… వర్గ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ఇటు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుగాని, అటు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిగాని ఎక్కడా తగ్గడం లేదన్నది లోకల్ టాక్. ఈ పరిణామాలతో సీనియర్ లీడర్స్ తలోదారి చూసుకోవడం కేడర్‌ను ఇంకా కంగారు పెడుతోందట. ఎన్నికలకు ముందు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా… ఇప్పుడు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కడం లేదని, నాయకత్వంలో కలుపుకుని పోయే తత్వం కొరవడిందన్నది బాలరాజు ఆవేదనగా చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే… పట్టున్న చోట ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నది పరిశీలకుల మాట. వైసీపీ పెద్దలు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.