Off The Record: ప్రతికూల పరిస్థితుల్లో కూడా… తన మెలో డ్రామాతో సానుభూతి సంపాదించుకోవడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట. వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన ఆయన.. గత ఎన్నికల సమయంలో టీడీపీలోకి జంప్ కొట్టి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని కోటంరెడ్డికి హామీ ఇచ్చారట. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని, జీవితాశయం నెరవేరబోతోందని అనుచరులకు తెగ చెప్పేసుకున్నారట. తీరా చూస్తే…. ఇప్పుడా వాతావరణమే కనిపించకపోతుండటంతో…. కొత్త డ్రామా మొదలుపెట్టినట్టు గుసగుసలాడుకుంటున్నాయి సింహపురి రాజకీయవర్గాలు.ఇటీవల పొట్టిపాలెం కలుజుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా… ఎమ్మెల్యే అన్న మాటల చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు శ్రీధర్‌రెడ్డి. పార్టీ నేతలు సహకరించాలని కూడా కోరేశారు.
దీంతో సడన్‌గా కోటంరెడ్డి నోటి నుంచి ఈ రిటైర్‌మెంట్ మాట ఎందుకు వచ్చిందని కూపీ లాగితే కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎప్పటికప్పుడు నాటకీయ పరిణామాలు సృష్టించడంలో దిట్ట అయిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి… మరోసారి తన కౌశలాన్ని ప్రదర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చర్చలు జోరుగా నడుస్తున్నందున ఇప్పుడు మొదలుపెడితేగానీ… అప్పటికి వర్కౌట్ అవదన్న ఉద్దేశ్యంతో.. తమ్ముడి పొలిటికల్ కెరీర్, నా రిటైర్‌మెంట్ అంటూ ఎమోషనల్ డ్రామా పండించే ప్రయత్నం చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మైక్ ముందు సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతున్నా… వెనక మాత్రం… తనను చంద్రబాబు మోసం చేశారంటూ అడిగిన వాళ్ళకు, అడగని వాళ్ళకు చెప్పేస్తున్నారట. అందుకే… ఇలా మరోసారి పోటీ చేయబోనని ప్రకటిస్తే… అది పార్టీ పెద్దలకు చేరి రేపు పునర్ వ్యవస్థీకరణలో తనకు ఛాన్స్ దక్కుతుందన్నది ఆయన లెక్కగా అంచనా వేస్తున్నారు కొందరు. ఈ ఎత్తుగడల గురించి చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ ఉన్నందునే…. ఈయన ఎంత సెంటిమెంట్ పండిస్తున్నా… అట్నుంచి మాత్రం నో రియాక్షన్ అన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో… కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన జీవితాశయం నెరవేరకుండానే పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసేసుకుంటారా? లేక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల టైం ఉంది కాబట్టి…. అప్పటికి మనసు మార్చుకుంటారా అని మాట్లాడుకుంటున్నాయి నెల్లూరు రాజకీయవర్గాలు. నెల్లూరు రూరల్‌లో వైసీపీ బలహీనంగా ఉందని, ఈసారి తన తమ్ముడిని నిలబెట్టి మరోసారి గెలిపిస్తానని టీడీపీ పెద్దలకు ఇప్పటికే చెప్పారట కోటంరెడ్డి. మొత్తం మీద అమాత్యా అనిపించుకోవాలన్న కోటంరెడ్డి కోరిక చుట్టూ… కొత్త చర్చలు మాత్రం మొదలైపోయాయి.
