Off The Record: నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ ఓపెన్ అయిపోతోంది. చివరికి అది తన్నులాటలు, తలంట్లకు దారితీస్తోంది. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్‌కు, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు మధ్య అగ్గి ఓ రేంజ్‌లో అంటుకుంటోంది. కైలాష్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించడాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తోంది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం. నల్లగొండ నియోజకవర్గంలో జరిగే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు డీసీసీ అధ్యక్షుడిని ఇక్కడి నేతలు ఆహ్వానించడం లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా డీసీసీ అధ్యక్షుడుని ఇన్వాల్వ్ చేయకుండానే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఇతర 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షుడితో కలిసి వేదికలు పంచుకుంటుండగా….. నల్లగొండలో మాత్రం వాతావరణం డిఫరెంట్‌గా ఉంది. దీంతో… ఇక్కడ డీసీసీ అధ్యక్షుడి ఎంట్రీ క్వశ్చన్ మార్క్‌గానే మిగిలింది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు కార్యాలయం లేకపోవడంతో… తన ఇంటి నుంచే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పున్నా కైలాష్. అటు నల్గొండ నియోజకవర్గ నేతలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాత క్యాంప్ ఆఫీస్‌ను ఉపయోగించుకుంటున్నారు.
ఇలా…. రెండు చోట్ల పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం, రెండు పార్టీ సెంటర్స్ యాక్టివ్‌గా ఉండటంతో… కేడర్‌లో గందరగోళం పెరుగుతోందట. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాల్లో అధికార పార్టీ ముఖ్య నేతలకు సహజంగానే పిలుపు ఉంటుంది.. ప్రోటోకాల్ ప్రకారం వాళ్లు వేదికలు ఎక్కకున్నా… కార్యక్రమాలకు తప్పకుండా హాజరఅవుతారు. అలాగే… మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనల్లోనూ కనిపిస్తుంటారు. కానీ… నల్గొండలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ప్రభుత్వ కార్యక్రమాల సంగతి సరేగానీ…. చివరికి పార్టీ ప్రోగ్రామ్స్‌కు కూడా డిసిసి అధ్యక్షుడికి ఎలాంటి ఆహ్వానం అందడంలేదట. ఈ పరిస్థితుల్లో… తాజాగా మరోసారి హస్తం పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పున్నా కైలాష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని తొలగించడం, మరికొన్ని చోట్ల చించివేయడం వివాదాస్పదమైంది. డీసీసీ అధ్యక్షుడి బర్త్‌డే కావడంతో ఆయన అభిమానులు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో పెద్దపెద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో కొన్నింటిని గుర్తు తెలియని వ్యక్తులు చించేయగా… మరికొన్నిచోట్ల మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
దీనికి సంబంధించి డీసీసీ అధ్యక్షుడి అభిమానులు.. మంత్రి అనుచరులపై ఫైర్ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత నుండి పట్టణంలో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రోజుతరబడి పెట్టినా పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడి ఫ్లెక్సీలు తొలగించడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఫ్లెక్సీలు చించి వేయడం వెనక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుల హస్తం ఉందన్నది డీసీసీ వర్గం ఆరోపణ. సమన్వయం చేయాల్సిన నేతలు, మంత్రి అనుచరులు అంతకుమించి అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. అటు పున్నా కైలాష్ వర్గం సైతం.. తమ ఫ్లెక్సీల్లో మంత్రి ఫోటోలు లేకుండా చేయడంతో వివాదం ముదురుతోంది. మంత్రి ఫోటో లేకుంటే ఎలాగన్నది ఆయన వర్గం ప్రశ్న. పున్నా కైలాష్ కూడా పార్టీ కార్యక్రమాలకు తనను ఎందుకు ఆహ్వానించడం లేదని అడుగుతున్నారు. ఉద్యమ నేపథ్యం, బహీనవర్గాలకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఇంతలా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ పున్నా వర్గం మంత్రి అనుచరులపై మండిపడుతోంది. దీన్నిబట్టి చూస్తుంటే… నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ రాజకీయం మెల్లిగా కులం రంగు పులుముకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. మంత్రి అనుచరులు వర్సెస్ డీసీసీ వర్గం అన్నట్టుగా మారిన ఈ పోరుకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందని అడుగుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

