Off The Record: కోనేటి ఆదిమూలం…. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే. ఈ ఎస్సీ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా రాజకీయం చేస్తున్న నాయకుడు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, తిరిగి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు. ఒకప్పుడు టిడిపి నుంచి జడ్పీటీసీగా గెలిచి….. ఆ తర్వాత టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి అట్నుంచి వైసీపీకి వెళ్ళారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి… తిరిగి 2019లో అక్కడే ఎమ్మెల్యే అయ్యారాయన. ఇక 2024 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పి తెలుగుదేశం అధిష్టానం దృష్టిలో పడి, చివరి నిమిషంలో టిడిపి టిక్కెట్ దక్కించుకుని కూటమి వేవ్‌లో మరోసారి అసెంబ్లీకి వెళ్లారు. సీన్ కట్ చేస్తే…టీడీపీ ఎమ్మెల్యే అయ్యాక జరిగిన పరిణామాలు, పార్టీ సమన్వయకర్తతో పొసగని పరిస్థితుల్లో…. పార్టీకి చెందిన ఓ నాయకురాలితో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో బయటికి వచ్చింది. ఆ దెబ్బకు ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్సెండ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం. ఇవాళ కాకుంటే రేపు అయినా పార్టీ తిరిగి తనకు అవకాశం ఇస్తుందని భావించి సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్న ఆదిమూలంకు ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మింగుడుపడ్డం లేదట.
గతంలో పార్టీ కార్యక్రమాల అబ్జర్వర్‌గా ఉన్న చంద్రశేఖర్‌తో పాటు సమన్వయ కర్తగా వచ్చిన శ్రీపతి బాబుకు గాడ్‌ఫాదర్‌గా ఉన్న వ్యక్తి…. ఏకంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏతో కలిసి గ్రావెల్ దందా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో టీడీపీ అధిష్టానం రెండు నెలల క్రితం శంకర్ రెడ్డిని పార్టీ కార్యక్రమాల కోఅర్డినేటర్‌గా నియమించింది..స్వతహాగా కాంట్రాక్టర్ అయిన శంకర్ రెడ్డి గతంలో తుడా చైర్మన్ పదవి అశించారు. ఎన్నికల సమయంలో పార్టీకి ఆర్థికంగా సహకరించారన్న ప్రచారం ఉంది. సత్యవేడు ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ప్రోగాం కోఆర్డినేటర్ పేరుతో పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ… ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో వేరే సామాజికవర్గం నేత పెత్తనం ఏంటన్నది ఆదిమూలం అనుచరుల ప్రశ్న. అదే సమయంలో గ్రూప్‌వార్ కూడా పీక్స్‌కు చేరింది. పాత టీడీపీ క్యాడర్‌ను పక్కన పెట్టి… కొత్తగా వచ్చిన ప్రతీ నాయకుడు తమ వర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన సామాజిక వర్గం, లేదా అనుకూల వర్గం వారికి పదవులు కట్ట బెడుతున్న క్రమంలో… నియోజక వర్గంలో అసలు టీడీపీ ఉందా అన్న డౌట్స్ వస్తున్నాయట కొందరికి. దీనికితోడు ప్రభుత్వ అధికారులు శంకర్‌రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తూ… ఎమ్మెల్యే అయిన తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదిమూలం. అధికారిక కార్యక్రమాలకు కూడా తనను పిలవకపోవడంతో… ఇక తాడో పేడో తేల్చుకోవాలని ఎమ్మెల్యే డిసైడైనట్టు సమాచారం. దానికి కౌంటర్‌గా రివర్స్ అటాక్ మొదలుపెట్టారు ఆదిమూలం. అధికారులు సమాచారం ఇచ్చినా, ఇవ్వకున్నా… ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అరగంట ముందుగానే వాలి పోతున్నారట.
దీంతో మరో గత్యంతరం లేక చచ్చినట్టు….ప్రభుత్వ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఇవ్వకపోతే అక్కడే వాళ్లను నిలదీసి రచ్చ చేస్తున్నారు ఎమ్మెల్యే. తాజాగా తిరుపతిలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కార్యక్రమంలో రెచ్చిపోయారు అదిమూలం. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డితో పాటు ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తాను ఎస్సీ ఎమ్మెల్యేను కాబట్టే తన పట్ల చిన్నచూపు చూస్తున్నారని అవేదన వ్యక్తం చేశారాయన. అదే రోజు నారాయణవనం మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని రెవెన్యూ ఆఫీస్‌కు పంపారు జడ్పీటీసీ అయిన ఆదిమూలం కూమారుడు సుమన్. కానీ.. అక్రమ రవాణాదారుల మీద కేసు పెట్టకుండా వదిలేశారంటూ ఏకంగా తహసీల్ధార్ కార్యాలయానికి తాళం వేసి హడావుడి చేశారు సుమన్. దీంతో పోలీసులు వచ్చి తాళం తీసి సుమన్ మీదే కేసు పెట్టారు. ఇక నాగలాపురం మండలంలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయ ఈవో తో ప్రోటోకాల్ గొడవ జరిగిందట. ఇలా…. మొత్తం మీద తండ్రి కొడుకులు ఇద్దరూ టీడీపీ ఇక సస్పెన్షన్ ఎత్తేయబోదని క్లారిటీకి వచ్చాక రివర్స్ అటాకింగ్ మొదలు పెట్టినట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ప్రభుత్వ కార్యక్రమం ఎక్కడ జరిగినా అటెండ్ అవడంతోపాటు దళితుడిని కాబట్టే చిన్నచూపు చూస్తున్నారని చెప్పడం, నియోజకవర్గ అభివృద్దికి ప్రభుత్వం సహకరించడంలేదని అనడం అందులో భాగమేనని చెప్పుకుంటున్నారు.
ఈ విధంగా రివర్స్ అటాక్‌తో తండ్రీ కొడుకులు పోరుబాట పడితే…. దీనికి లోకల్ టిడిపి క్యాడర్ కూడా రివర్స్‌లోనే సమాధానం చెబుతోందట. శంకర్ రెడ్డి వచ్చీరాగానే నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ దందాలకు చెక్ పెట్టారని, దాంతో ఏళ్లుగా నెలనెలా వస్తున్న మామూళ్ళు ఆగిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఎమ్మెల్యే, ఆయన కుమారుడు దళిత కార్డ్‌ను ముందుకు తెస్తున్నారన్నది వాళ్ళ ఆరోపణ. మహిళతో అసభ్యంగా వీడియోలో దొరికిపోయింది ఆయనే కదా..? తీరా ఇప్పుడొచ్చి నేను మంచోడిని, నన్ను వేధిస్తున్నారని మొగసాలకెక్కడం ఆయనకే చెల్లిందని సెటైర్స్ వేస్తున్నారు. మొత్తంగా సత్యవేడు టీడీపీలో రచ్చ అయితే ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.