Site icon NTV Telugu

Off The Record: అక్కడ కూటమిలో 3 పార్టీలకు బదులు 4 పార్టీలు ఉన్నాయా?

Bandaru Satyananda Rao

Bandaru Satyananda Rao

Off The Record: బండారు సత్యానందరావు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే. ఇన్నాళ్ళు సౌమ్యుడిగా పేరున్న బండారు తీరు ఈసారి మారిందన్న టాక్‌ బలంగా నడుస్తోంది నియోజకవర్గంలో. ఇప్పుడాయన ఏకంగా నాలుగు ముక్కలాట ఆడుతున్నారట. కూటమిలోని మూడు పార్టీల నాయకులను పక్కనపెట్టి… వైసీపీ వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారన్నది ఇప్పుడు కొత్తపేటలో హాట్‌ సబ్జెక్ట్‌. అధికారంలోకి వచ్చిన నాటినుండి చాటుమాటుగా కొనసాగుతున్న చెలిమి ఇటీవల ఆయన పుట్టిన రోజు వేడుకల్లో బయటపడిందట. ఆ విషయంలో కూటమి శ్రేణులు కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన బండారు.. ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారట. అందుకే ఈసారి గెలిచిన వెంటనే దందాలు మొదలుపెట్టారన్నది లోకల్‌ టాక్‌. గడిచిన ఏడాది కాలంలో ఇసుక, మట్టి దందాలతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్నది లోకల్‌ టాక్‌.

Read Also: Samantha : చీరలో సమంత హొయలు.. ఆ ఫోజులు చూశారా..

అదే సమయంలో తన వ్యవహారాల మీద రచ్చ జరక్కుండా.. అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేందుకు నియోజకవర్గంలోని వైసీపీ కీలక నేతలతో చేతులు కలిపినట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కక్కలేక, మింగలేక అన్నట్టుగా ఉన్నాయట. దీంతో రెండు వర్గాల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైనట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలను బినామీలుగా పెట్టుకుని సత్యానందరావు అడ్డగోలు వ్యాపారాలను చేస్తున్నారని టీడీపీ, జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు ఓ అడుగు ముందుకేసి… ఇసుక, మట్టి దందాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో… కొత్త రకం రాజకీయం మొదలవుతోంది. వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే విషయంలో సాఫ్ట్‌ కార్నర్‌తో ఉంటే…. కూటమి పార్టీల కేడర్‌ మాత్రం భగ్గుమంటోంది. ఇది నియోజకవర్గంలో పెద్ద వివాదంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాగా రాజ్యమేలిన వైసిపి నేతలనే ఇప్పుడు ఎమ్మెల్యే బినామీలుగా పెట్టుకొని దందా చేస్తున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. కొత్తపేట నియోజకవర్గంలో 16 వరకు ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి.అధికారికంగా ఉన్నవి ఎనిమిదైతే, మరో ఎనిమిది అనధికారికంగా నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇసుక ర్యాంపుల మీద రోజుకు 25 లక్షలు దాకా ఆదాయం వస్తోందంటే… దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. వైసీపీ హయాంలోని మాఫియాతో కలిసి చేస్తే…తన మీద అవినీతి మరక పడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వాళ్ళని ఎంకరేజ్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Samantha : చీరలో సమంత హొయలు.. ఆ ఫోజులు చూశారా..

ఒకరకంగా ప్రతిపక్షం నోట్లో డబ్బు కట్టలు కుక్కి తనపని తాను చేసుకోవచ్చన్న వ్యూహం కూడా ఇందులో ఉండవచ్చంటున్నారు.జనసేన నియోజకవర్గ ఇన్చార్జిగా ఎమ్మెల్యే తన సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్‌కు కూడా ముట్టాల్సినవి ముడుతుండటంతో… ఆయన కూడా నోరు మెదపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలిసి జనశ్రేణులు ఇసుక దందాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా… పెద్దగా ఉపయోగం ఉండటం లేదట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన వారే ఇప్పుడు కూడా పెత్తనం చేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, జనసేన శ్రేణులు అడపాదడపా అడ్డం తిరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ఎమ్మెల్యే. ఇక రావులపాలెం మండలం కొమరాజు లంకలో పరిస్థితి మరోలా ఉందట. ఇక్కడ గతంలో సర్పంచ్ వేధింపులతో విసుగు చెందిన తమ్ముళ్లు అధికారం వచ్చాక ఆయన సంగతి చూడాలనుకున్నారట.

Read Also: Avoid Ice in Street Juices: జూస్‌లో ఐస్ వేసుకుని తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

తీరా ఇప్పుడు చూస్తే గ్రామానికి సమీపంలోని మందపల్లి ఇసుక ర్యాంపులో అతని హవానే నడుస్తోందని అంటున్నారు. విసుగుచెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇటీవల ర్యాంపు దగ్గర ఆందోళన చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. అధికారం ఉన్నా… మా పరిస్థితి ఇంతేనా అని తమ్ముళ్లు మధనపడుతున్నట్టు తెలుస్తోంది.ఇక జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు కరుటూరి నరసింహారావు సైతం ఇటీవల టిడిపి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలిసింది. పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడ్డంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారాయన. ఈ పరిణామాలతో ప్రస్తుతం కొత్తపేట టీడీపీలో వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉంది. నేను మారాను…. మార్పును ఎన్నికల తర్వాత చూస్తారని బండారు సత్యానందం ఎన్నికలకు ముందు చెబితే… ఏదో అనుకున్నామని, ఆయనగారు చెప్పిన మార్పు ఇదేనా అంటూ చెవులు కొరుక్కుంటున్నారట తమ్ముళ్ళు.

Exit mobile version