NTV Telugu Site icon

Off The Record: కొత్తపేటలో బండారు బ్రదర్స్‌ మధ్య సయోధ్య నిల్‌.. పొత్తు కుదిరితే కలిసి సాగుతారా?

Kothapeta

Kothapeta

Off The Record: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు సొంత అన్నదమ్ములే ఇంఛార్జీలు. వారే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం.. బండారు శ్రీనివాస్‌. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఒక చిన్న వివాదం అపోహలతో పెరిగి పెద్దదై పరస్పరం పోటీకి దిగే స్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో ఇద్దరూ అదే చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సత్యానందం.. జనసేన నుంచి శ్రీనివాసరావు బరిలో ఉండాలని చూస్తున్నారు. వీళ్ల ఆశలు ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే ఏం చేస్తారు? అనేది పెద్ద ప్రశ్న.

Read Also: Off The Record: ఎమ్మెల్యే వసంత తీరుపై వైసీపీలో చర్చ.. చర్యలు భిన్నం..!

పొత్తు పొడిస్తే టికెట్‌ మాదంటే మాదని ప్రస్తుతం కొత్తపేటలో టీడీపీ, జనసేన వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. గతంలో ఒకసారి ప్రజారాజ్యం తరఫున సత్యానందం గెలిచారు. తాజా పొత్తులో అది తనకు కలిసి వచ్చే అంశంగా తమ్ముడు శ్రీనివాసరావు లెక్కలేస్తున్నారట. అయితే మూడుసార్లు గెలిచిన తనకే టికెట్‌ వస్తుంది అన్న సత్యానందం గట్టి ధీమాతో ఉన్నారట. వీళ్ల అభిమానుల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే.. టీడీపీ, జనసేన మధ్య పొత్తంటూ కుదిరితే.. అన్నదమ్ములు పరస్పరం సహకరించుకుంటారా లేదా అన్నదే పెద్ద చర్చగా ఉంది. ఇప్పటికే బండారు బ్రదర్స్‌ మధ్య సయోధ్యకు పలువురు కాపు సామాజికవర్గం పెద్దలు విఫలయత్నం చేశారు. సత్యానందం సౌమ్యంగా వ్యవహరిస్తున్నా.. శ్రీనివాసరావు ససేమిరా అంటున్నారట.

Read Also: Off The Record: సాగర్‌లో సయ్యాట.. ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ..!

అన్నదమ్ములు కలిసి ఉంటే మీ కుటుంబానిదే గెలుపని పలువురు నచ్చజెబుతున్నా… సత్యానందం, శ్రీనివాసరావు మధ్య సఖ్యత కుదిరే అవకాశాలు కనిపించడం లేదట. తన రాజకీయ ఎదుగుదలకు అన్నే అడ్డుపడుతున్నారనేది తమ్ముడి ఆరోపణ. గతంలో సత్యానందం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా.. తనకు జడ్పీ ఛైర్మన్‌ పదవి రాకుండా చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పారని అనుచరులకు చెప్పి వాపోతున్నారట శ్రీనివాసరావు. గడిచిన మూడు ఎన్నికల్లో కొత్తపేటలో టీడీపీ ఓడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. పొత్తులో కొత్తపేట టికెట్‌ జనసేనకు ఇస్తే గెలుపు నల్లేరుపై నడకే అన్నది తమ్ముడి వాదన. అయితే తనకు ఆఖరి అవకాశం ఇవ్వాలని సత్యానందం కోరుతున్నారట. టీడీపీ, జనసేనలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవలను.. వైసీపీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డి ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన పునాది వేసుకోవడంతో జగ్గిరెడ్డి గట్టి ధీమాతో కనిపిస్తున్నారట. అన్నదమ్ములు ఇదే విధంగా గొడవ పడితే తమ పని ఇంకా సులువు అవుతుందని చెబుతున్నారట. గతంలో ఈ వైరమే తమకు కలిసి వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని అనుకుంటున్నారట వైసీపీ నాయకులు. మరి.. గెలుపే లక్ష్యంగా అన్నదమ్ములు కలిసి పోతారో.. పంతాలకే ప్రాధాన్యం ఇస్తారో.. కాలమే చెప్పాలి.