NTV Telugu Site icon

Off The Record: బీఆర్ఎస్‌ అధిష్టానం ఎందుకు కామ్‌గా ఉంది..?

Brs

Brs

Off The Record: గులాబీ బాస్ కేసీఆర్… ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులతో ఉత్తేజపూరితంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, వాళ్ళు దొరికితే కొట్టేంత కోపం మీద ఉన్నారంటూ తనదైన శైలిలో స్పీచ్‌ ఇచ్చేశారు. నేనేదో….. ఫామ్‌హౌస్‌లో కామ్‌గా ఉన్నానని అనుకుంటున్నారేమో… కో….డ్తే…… మామూలుగా ఉండదని అంటూ అక్కడున్నవారిలో జోష్‌ నింపే ప్రయత్నం చేశారాయన. ఆ కామెంట్స్‌ని బేస్‌ చేసుకునే… ఇప్పుడు కొత్త రకం సెటైర్స్‌ పడుతున్నాయట. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో అన్న రేంజ్‌ డైలాగ్స్‌ చెబుతున్న కేసీఆర్‌…. మరి కొట్టే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారన్నది ఆ సెటైర్స్‌ వేసే వాళ్ళ క్వశ్చన్‌. పెట్టిన నాటి నుంచి పార్టీకి కంచుకోటగా ఉన్న.. ఉత్తర తెలంగాణలో జరుగతున్న టీచర్, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి… ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నారని అడుగుతున్నారు. ఓవైపు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికల్లో దుమ్ము దులిపేద్దాం…సిద్ధంగా ఉండండని కేడర్‌కి చెబుతున్న గులాబీ అధిష్టానం… ఇప్పుడెందుకు కామ్‌గా ఉందో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

వస్తుందో రాదో తెలియని ఉప ఎన్నిక కోసం సిద్ధంగా ఉండమని చెబుతున్న అధిష్టానం…. అందివచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఎందుకు చేజార్చుకుంటోందో అర్ధం కావడం లేదంటూ గులాబీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోందట. ప్రత్యర్ధులతో కలబడి నిలబడాల్సిన సమయంలో కాడి పడేసే విధంగా మాటలు చెప్పడం వెనక మర్మమేంటి అన్నది ఇప్పుడు బీఆర్‌ఎస్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయిందట. పార్టీ పెద్దలు వేదికల మీద చెబుతున్నదానికి, గ్రౌండ్ రియాల్టీకి పోలిక లేదా…? శ్రేణులు చేజారి పోకుండా పైకేదో గంభీరంగా మాట్లాడుతున్నారుగానీ…వాస్తవం ఏంటో వారికి ఎప్పుడో బోధపడిందనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట ఉత్తర తెలంగాణలో. నిజంగానే అంత నమ్మకం ఉంటే.. పార్టీకి గుండెకాయ లాంటి చోట జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారన్నది క్వశ్చన్‌. టైట్ ఫైట్ ఇవ్వాల్సిన చోట పెద్ద లీడర్లు లైట్ అన్నట్టుగా ఎందుకు ఉంటున్నారు అనేది అర్దంగాక క్యాడర్ బుర్రలు హీటెక్కుతున్నాయట. మామూలుగా అయితే…ఎన్నికలు వచ్చాయంటే కార్ పార్టీ టికెట్ కోసం ఓ రేంజ్‌లో పోటీ ఉండేది. తాము స్ట్రాంగ్ జోన్‌గా పరిగణించే ఉత్తర తెలంగాణలో అయితే టికెట్ వస్తే చాలన్నట్టుగా ఉండేది వ్యవహారం. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్‌లో ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ బరిలోకి దిగకపోవడమే అందుకు నిదర్శనం అన్న చర్చలు జరుగుతున్నాయి.

నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ స్థానాలు, ఆరు ఎంపీ సీట్లలో ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయకపోవడం ఏంటో అంతు చిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. పార్టీ అగ్రనేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత అంతా… ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సీట్ల పరిధిలోనే ఉన్నారు. అయినాసరే… పోటీకి ఎందుకు వెనుకంజ వేస్తున్నారనేది మిలియన్ డాలర్‌ క్వశ్చన్‌ అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. కాస్త లోతుగా తరచి చూస్తే… వరుస ఓటముల ప్రభావం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానం ఎన్నికలపై పడి ఉండవచ్చంటున్నారు. అలాగే.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అధినేత అనాసక్తతకు ఓ కారణం కావచ్చన్న అభిప్రాయం ఉంది. గత మూడు నెలల నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు… బీఆర్ఎస్ తరపున కూడా పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు. కానీ… పైనుంచి ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో పోటీ చేద్దాం అనుకున్నవారు కూడా సైలెంట్ అయినట్టు తెలిసింది.కాంగ్రెస్ తన ఆనవాయితీకి భిన్నంగా ఈసారి నామినేషన్ల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారిని బరిలో దింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ నేతలు ప్రయత్నాలు చేశారట. అభ్యర్థి సొంత బలానికి పార్టీ మద్దతు తోడైతే విజయం సాధించే అవకాశాలున్నాయని పార్టీ పెద్దలు కేటీఆర్, హరీష్‌లను కన్విన్స్‌ చేశారట. ఇదే విషయాన్ని బావా బావమరుదులు ఇద్దరూ కేసీఆర్‌ చెవిన వేసినా….మౌనమే ఆయన సమాధానం అయినట్టు చెప్పుకుంటున్నారు. పైగా అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో ఉంటే తమను మాత్రం స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని లీడర్లు పిలుపు నివ్వడంతో పుండు మీద కారం చల్లినట్టు ఫీలవుతున్నారట లోకల్‌ లీడర్స్‌.

అయితే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి వెనుకంజ వేయడం వెనక ఇతరత్రా కారణాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నాలుగు ఉమ్మడి జిల్లాలకు తెలిసిన నేత దొరక్కపోవడం ఓ రీజన్‌ అయి ఉండవచ్చంటున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కొంతవరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగడంతో… గ్రాడ్యుయేట్స్‌ ఆ పార్టీ విషయంలో సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నారన్న నిర్ధారణకు వచ్చారట కేసీఆర్‌. మూడు నెలల క్రితం నిర్వహించిన ఓ సర్వే రిజల్ట్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో బరిలోకి దిగి ఓడిపోవడం కంటే డ్రాప్ అవడమే బెటర్‌ అని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. అయితే… ఓడిపోతామన్న కారణంతో బరిలో దిగకుండా ఉంటే… బయట నుంచి వచ్చే విమర్శలకు ఏం సమాధానం చెప్పాలని మధన పడుతున్నారట జిల్లా స్థాయి నేతలు. మొత్తంగా ఎన్నికల గోదా నుంచి డ్రాప్ అవడం గులాబీ పార్టీకి లాభిస్తుందా…? డ్యామేజ్‌ ఇంకా పెరుగుతుందా అన్న చర్చ గట్టిగానే జరుగుతోంది తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.