Site icon NTV Telugu

Off The Record: బీఆర్ఎస్ ఇంటి గొడవలు గడప దాటేశాయా..?

Kavitha

Kavitha

Off The Record: బీఆర్‌ఎస్‌లో కవిత ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. రజతోత్సవ సభ తర్వాత సంక్లిస్టంగా మారిన పరిస్థితులు ఉండేకొద్దీ ఇంకా దిగజారుతున్నట్టు కనిపిస్తోంది. నాడు ఆ సభ గురించి, పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి కవిత తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాసిన లేఖ లీకవడం, ఆ లీకువీరులెవరో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేయడం, అదే ఊపులో పార్టీ ముఖ్య నాయకుల మీద చేసిన కామెంట్స్‌ తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అలాగే… ఎమ్మెల్సీ నేరుగా తన అన్న కేటీఆర్ ను, మరి కొందరు సీనియర్ నాయకులను, మాజీ మంత్రులను టార్గెట్ చేస్తూ మాట్లాడినా ఇప్పటి వరకు అధిష్టానం స్పందించలేదు. ఎలాంటి యాక్షన్ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఎంతైనా… ఆమె అధినాయకుడి కూతురు కాబట్టి బీఆర్ఎస్‌లో ఉన్న మిగతా నేతలు కూడా ధైర్యం చేసి డైరెక్ట్‌గా మాట్లాడలేక పోతున్నారట. పార్టీ వైపు నుంచి కూడా అఫీషియల్‌గా కవితపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు లేవు. ఇదంతా ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న పొలిటికల్‌ డ్రామా. కానీ… ఇప్పుడుడది ఓపెనైపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, గొడవ గడప దాటిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. తాజా పరిణామాలే అందుకు ఉదాహరణ అంటున్నారు.

Read Also: Off The Record: అక్కడ ఫ్యాక్షన్ మళ్లీ పురుడు పోసుకుంటుందా..?

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి విషయంలో గొడవలు ఇంటి నుంచి రోడ్డెక్కాయంటున్నారు. సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్‌కు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఒక ప్రధాన విభాగంగా ఉంది. ఈ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగుతూ వస్తున్నారు. అయితే సడన్‌గా బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో సమావేశమైన టీబీజీకేఎస్ సభ్యులు తమ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు కవిత. సంఘంలో అందరి అభిప్రాయం తీసుకోకుండా… తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సడన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కుట్రలో భాగమేన్నది ఆమె వాదన. దీనికి సంబంధించి ఓ లేఖ విడుదల చేశారామె. ఇప్పటివరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తమ నాయకురాలిని ఉన్నఫళంగా నిబంధనలకు విరుద్ధంగా తప్పించి మరో నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ జాగృతి నాయకులు. అయితే ఈ విషయమై బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా మరో రకమైన చర్చ జరుగుతోందట. పది రోజుల క్రితమే కవిత తెలంగాణ జాగృతి తరఫున ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారని, సింగరేణి ప్రాంతంలో ఉన్న మరొక సంఘంతో కలిసి పని చేస్తామని ప్రకటించారని చెబుతున్నారు. అలా… బీఆర్ఎస్ అనుబంధ సంఘంతో కాకుండా మరో యూనియన్‌తో కలిసి పనిచేయాలనుకోవడం వల్లే… తాము వేరే నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

Read Also: Hyderabad family suicide: చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా?

కారణం ఏదైనాగానీ…. తాజా పరిణామంతో ఇక డైరెక్ట్‌ వార్‌లోకి దిగారు ఎమ్మెల్సీ. సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఆమె లేఖ రాస్తూ తాను గౌరవాధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఏమేం పనులు చేశానో చెప్పుకొచ్చారు. కొత్త గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు చెబుతూనే ఈ ఎన్నిక సరిగ్గా జరగలేదని బహిరంగ లేఖలో పేర్కొన్నారామె. ఒక సంఘానికి సంబంధించిన సమావేశం పార్టీ ఆఫీసులో జరగడం ఏంటని కూడా తన లేఖలో ప్రశ్నించారామె. ఇలా… బహిరంగ లేఖ రాయడం ద్వారా… తనమీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పేశారు కవిత. ఇప్పటివరకు పార్టీకి, ఆమెకు మధ్య దూరం పెరుగుతున్నా…అది ఎక్కడా బయటపడలేదు. కానీ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడి వ్యవహారం తర్వాత ఇంటిపోరు వీధికెక్కినట్టయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత హైదరాబాద్‌కు వచ్చాక ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడో ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే… గతంలో కేసీఆర్కు రాసిన లేఖ లీకైంది ఆమె అమెరికా టూర్‌లో ఉన్నప్పుడే, ఇప్పుడు టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది కూడా అమెరికా ట్రిప్‌లో ఉన్నప్పుడే. వీటికేమన్నా సారూప్యత ఉందా అన్న కోణంలో సైతం అనుమానాలు పెరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో.

Exit mobile version