Site icon NTV Telugu

Off The Record: కాళేశ్వరం కేసులో వారే బలిపశువులు కాబోతున్నారా..?

Kaleshwaram Inquiry Commiss

Kaleshwaram Inquiry Commiss

Off The Record: తెలంగాణ తాజా రాజకీయం మొత్తం… కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్‌ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో… ఇప్పుడు పొలిటికల్‌ హాట్‌గా మారిపోయింది. ప్రాజెక్ట్‌ అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్‌. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఐతే..ఇప్పుడు విచారణ దాదాపుగా పూర్తవుతున్న టైంలో… రాజకీయ నాయకుల పాత్ర మీద దృష్టి పెట్టింది విచారణ కమిషన్‌. అందులో భాగంగానే… నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌, ఇరిగేషన్‌ మినిస్టర్‌ హరీష్‌రావు ఇప్పటికే విచారణకు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇక ఫైనల్‌గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంతు వచ్చింది. బుధవారం కమిషన్‌ ముందు హాజరవబోతున్నారాయన. ముందు అధికారుల్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళంతా…అప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రి పేరు చెప్పారట. అందుకే ఆ వాంగ్మూలాలను ఆధారం చేసుకుని రాజకీయ నాయకులకు నోటీసులు పంపి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also: Minister Nara Lokesh: అర్థమైందా రాజా..? మంత్రి లోకేష్ కౌంటర్‌ ట్వీట్..

విచారణలో ప్రధానంగా ప్రాజెక్ట్‌ డిజైన్ మార్పు, నీటి నిల్వ, బిల్లుల మంజూరు లాంటి అంశాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. బ్యారేజ్‌లలో నీటిని ఎవరు నిల్వ చేయమన్నారని అంటే…దాంతో మాకేం సంబంధం.. అది ఇంజనీరింగ్ అధికారుల పని అని చెప్పేశారట హరీష్ రావు. అంతకు ముందు ఈటల రాజేందర్ కూడా టెక్నికల్ విషయాల్లో మాకు అవగాహన ఉండదు. ఆ వ్యవహారాలన్నిటిని అధికారులు చూసుకుంటారు కదా అని క్లారిటీగా చెప్పేసినట్టు తెలిసింది. దీంతో ఇక చివరిగా కేసీఆర్‌ కూడా ఇలాంటి సమాధానాలనే చెబుతుండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన కూడా పరిపాలనా వ్యవహారాలు తప్ప… సాంకేతిక విషయాలతో మాకేం సంబంధం అని అంటే మాత్రం… ఫైనల్‌గా అధికారులే ఇరుక్కుపోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి తెలంగాణ రాజకీయవర్గాల్లో. ఇప్పటివరకు జరిగిన విచారణను నిశితంగా పరిశీలిస్తే… రాజకీయ నాయకులు సేఫ్‌గా తప్పించుకునే పనిలో ఉన్నట్టు అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. సాంకేతిక కారణాల పేరుతో వాళ్ళు అలా తప్పించుకోగలిగితే… చివరికి బలయ్యేది ఇంజినీర్లు, అధికారులే కదా… అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అదే సమయంలో మరోరకమైన మాటలుకూడా వినిపిస్తున్నాయి.

Read Also: Health Tips: అవసరానికి మించి నడుస్తున్నారా?.. ఈ సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే!

ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో… అసలు అధికారులు స్వేచ్ఛగా పని చేసుకునే వెసులుబాటు ఉందా..? మంత్రులు…ముఖ్యమంత్రులు ఆదేశిస్తే…. వాళ్ళకు నో అని చెప్పే సాహసం ఆఫీసర్స్ చేయగలుగుతారా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. అదే సమయంలో కొందరు అధికారులు కూడా… చట్టం అంటే వెరపు లేకుండా…రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేయడానికి ఎక్కువ అలవాటు పడ్డారని, తమకున్న పరిజ్ఞానం, వాస్తవాలతో సంబంధం లేకుండా జీ.. హుజూర్‌ అనడానికి అలవాటుపడటం వల్లే… వాళ్ళు ఎక్కువగా ఇరుక్కుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్‌లాంటి విచారణలు వచ్చినప్పుడు అధికారులు చిక్కుకుపోవడాని ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. ఆఫీసర్స్‌ కూడా రూల్స్‌ను ప్రస్తావించి ఆ పేరుతో నాయకులు చెప్పిన పని చేయకుండా ఉంటే… మంచి పోస్టింగ్స్‌ రావని, లూప్‌లైన్‌ నుంచి తప్పించుకుని మెయిన్‌ స్ట్రీమ్‌కు రావాలంటే… పవర్‌లో ఉన్నవాళ్ళు చెప్పినట్టు వినాలని డిసైడ్‌ అవుతున్నారట. ఇలా… రకరకాల కారణాలతో అధికారులు, పాలకుల మధ్య బంధం బలపడి… చివరికి తేడా జరిగితే… ఆఫీసర్సే బలిపశువులు అవుతున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. అలాగే… మంత్రుల్లో కూడా మౌఖిక ఆదేశాలిచ్చేవాళ్ళే ఎక్కువ. లిఖిత పూర్వక ఆదేశాలిచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని, అలాంటి విషయాల్లో తేడా జరిగితే… ఫైనల్‌గా సంతకాలు చేసిన అధికారులే ఇరుక్కుంటారని, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణను చూస్తుంటే… అధికారులు బలయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయ నాయకులు మాత్రం సేఫ్‌జోన్‌లోనే ఉండవచ్చని అంటున్నారు. ఫైనల్‌గా ఎవరు ఇరుక్కుంటారో, ఎవరి మీద వేటు పడుతుందో చూడాలి మరి.

Exit mobile version