NTV Telugu Site icon

Off The Record: ఆయన మంత్రి పదవి రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా?

Kala Venkata Rao

Kala Venkata Rao

Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి, తాజా ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లికి మారి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించారు టీడీపీ సీనియర్‌ నేత కళా వెంకటరావు. ఈసారి కేబినెట్‌ బెర్త్‌ మీద గట్టి ఆశలే పెట్టుకున్నా… నెరవేరలేదు. ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గ నేతలతో సమావేశమై తన మనసులోని మాటను బయటపెట్టారట. మీరేం బాధపడకండి… అతి త్వరలోనే మనకు మంత్రి పదవి వస్తుందని చెప్పడంతో అవాక్కవడం అక్కడున్న వాళ్ళ వంతయిందంటున్నారు. ఇదేంట్రా బాబూ… ఏమైంది ఈయనకు, ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏపీ కేబినెట్‌లో ఇక మిగిలి ఉన్నది ఒకే ఒక్క ఖాళీ. దాని చుట్టూ వంద ఆబ్లిగేషన్స్‌ ఉన్నాయి. వాటన్నిటినీ దాటుకుని ఈయనకు ఇచ్చేస్తారా అంటూ మీటింగ్‌కు వెళ్ళిన నాయకులే గుసగుసలాడుకున్నారట.

Read Also: BJP MP Nishikant Dubey: ఆ ప్రాంతాలను యూటీగా చేయడం లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు..

1983లో రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాతి నుంచి టీడీపీలో అనేక పదవులు అనుభవించారు కళా. పాత ఉణుకూరు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారాయన. పునర్విభజనలో ఉణుకూరు రద్దయిన తర్వాత ఎచ్చెర్లకు మారి ప్రజారాజ్యం పార్టీలో చేరారు కళా వెంకట్రావు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున ఎచ్చెర్లలో పోటీచేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు కళా. 2019 ఎన్నికల్లో ఓడిపోగా…24లో జిల్లా మారి చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు. ఇలా ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారాయన. 1998-2004 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, అంతకు మించి టీడీపీ రాష్ట్ర శాఖకు తొలి అధ్యక్షుడిగా పనిచేయడం ఆయన పొలిటికల్‌ కెరీర్‌కు హైలైట్‌ అన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. ఇంత రాజకీయ చరిత్ర ఉన్న కళాకు ఈసారి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ .. రకరకాల సమీకరణలు, యువతకు ప్రాధాన్య క్రమంలో పదవి దక్కలేదు. ప్రస్తుతం ఆయన దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నది నియోజకవర్గంలో టాక్. ఆ పేరుతో అనుచరులంతా డీలా పడతారన్న భయమో… లేక పరోక్షంగా పార్టీ అధిష్టానానికి తన అసంతృప్తిని తెలియజేసి వత్తిడి పెంచే ప్రయత్నమో తెలియదుగానీ… అతి త్వరలోనే మనకి మంత్రి పదవి అంటూ బిల్డప్‌లు ఇస్తున్నారట ఆయన. పనిలో పనిగా ప్రస్తుతం కేబినెట్‌లోని ఓ మంత్రి పనితీరుపై అధినేత అసంతృప్తిగా వున్నారని, ఇక ఆ పదవి మనకే వస్తుందని కూడా చెప్పినట్టు తెలిసింది. లోపల ఆయన చెప్పిందంతా శ్రద్ధగా విన్నట్టు నటించివన కేడర్‌ బయటికి వచ్చాక ఈ పెద్దాయనకు ఏమైందంటూ చెవులు కొరుక్కున్నట్టు తెలిసింది.

Read Also: Proteins: నాన్ వెజ్ తినని వారు ఈ పండ్లను తినండి.. ప్రొటీన్లు ఎక్కువ

పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాల గురించి తెలిసి కూడా కళా ఇలా అనడం ఏంటని వాళ్లలో వాళ్లే ప్రశ్నించుకున్నట్టు తెలిసింది. పురపాలక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, హోం శాఖ, శక్తి వనరుల శాఖ మంత్రిగా పని చేసినా… ఇప్పటికీ ఆయనకు పదవీ వ్యామోహం పోలేదని అంటున్నారట ఇంకొందరు. అలాగే… చీపురుపల్లిలో తనను కలిసిన మరి కొంత మంది నాయకులకు టీటీడీ ఛైర్మన్‌ పదవి మనవైపే తిరుగుతోందని అన్నారట. ముందు మీటింగ్‌లో అన్న మాటల గురించి అప్పటికే తెలుసుకున్న సదరు నాయకులు అక్కడలా, ఇక్కడిలా… ఇంతకీ ఆయనేం కోరుకుంటున్నారని అనుకున్నట్టు తెలిసింది. ఉన్నట్టుండి ఈయనకేమైంది… ఏ పదవి ప్రస్తావన వచ్చినా అది మనకేనని చెప్పేస్తున్నారు.. ఇదెక్కడి విడ్డూరం బాబూ అనుకున్నారట. ఇంకొందరు గడుసు నాయకులైతే… ఈయనకింకా పదవీ వ్యామోహం ఏ మాత్రం తగ్గలేదు… ఎప్పుడూ ఆయనే రేస్‌లో ఉంటే వెనకున్న వాళ్ళకు ఏం అక్కర్లేదా అని కూడా అంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయనకు ఏ పదవి వస్తుందో రాదో తెలియదు గానీ… మొత్తంగా కళా వ్యాఖ్యలు మాత్రం టాక్‌ ఆఫ్‌ది పొలిటికల్‌ సర్కిల్స్‌ అవుతున్నాయి.