Site icon NTV Telugu

Off The Record: ప్రభుత్వం మారినా.. రేషన్ మాఫియా తీరు మారలేదా?

Ration Mafia

Ration Mafia

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినా, పాలకుల విధానాలు మారిపోయానా…. కాకినాడలో రేషన్ మాఫియా తీరు మాత్రం మారలేదట. మేమింతే…. అడ్డొచ్చేదెవడహే….అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. డైరెక్ట్‌గా డీలర్ల నుంచే ఎత్తేసి డంప్‌ చేసుకుంటున్నారట. బియ్యం ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి వెళ్లాలనే లెక్కలన్నీ ఒకటో తేదీ నుంచే తయారు అయిపోతున్నాయట. ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఒక మాఫియా పని చేస్తోందన్నది లోకల్‌ టాక్‌. ప్రస్తుతం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వాళ్ళంతా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చుట్టూ చేరారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచి బియ్యం తీసుకురావాలన్నా, తీసుకు వెళ్లాలన్నా… రూరల్ నియోజకవర్గాన్ని స్టాక్ పాయింట్‌గా వాడుతున్నారట. దానికి ఎమ్మెల్యే సన్నిహితులు సపోర్ట్‌ చేస్తున్నారన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. రేషన్ మాఫియా పనులు సక్రమంగా జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత అవసరం. అందుకే… నానాజీకి టచ్‌లోకి వెళ్ళారట కొందరు. మీరు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వొద్దు… వివాదాలు కూడా ఏమీ ఉండవు… జస్ట్, మీ సెగ్మెంట్‌లో మాకు కొంచెం స్పేస్ ఇస్తే చాలు, అలా… అలా… అందరి పనులు అయిపోతాయంటూ అడ్వాన్స్ అయ్యారట అక్రమ రవాణాదారులు. దాంతో ఎమ్మెల్యే నానాజీ కూడా… మన చేతికి మట్టి అంటనప్పుడు ఇబ్బందేముందని అనుకుంటూ తలూపేశారన్నది ఆయన సన్నిహితుల ఇంటర్నల్‌ టాక్‌. వాళ్ళ పని జరుగుతుంది, మనకూ ఉపయోగకరంగా ఉంటుంది..

Read Also: Xi Jinping: నియంతకు వీడ్కోలు..!? చైనాలో జిన్‌పింగ్ శకం ముగిసినట్లేనా..?

అయినా మనం ఆపితే ఆగేది కాదు కదా ఇది. అలాంటప్పుడు ఉభయతారకంగా ఉండేలా కళ్ళు మూసుకుంటే పోలా అని గడుసుగా సమాధానం చెబుతున్నారట పంతం. అది నిజమేనా అన్నట్టు ఈ మధ్య కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో తరచూ అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం దొరుకుతోందని అంటున్నారు స్థానికులు. అలా దొరుకుతున్నది జస్ట్ వన్ పర్సెంట్ అయితే… మిగతా 99 శాతం గుట్టుచప్పుడు కాకుండా వెళ్లాల్సిన చోటికి వెళ్ళిపోతుందని రేషన్ డీలర్లే మాట్లాడుకుంటున్నారట.ఈ విధంగా వ్యాపారం జరిగితేనే మాకూ ఒక రూపాయి మిగులుతుందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. అటు ఈ వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకుంటున్నారన్న ప్రచారం ఉంది. గతంలో వైసీపీలో కీలకంగా ఉన్న కొందరు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ రేషన్ యవ్వారాలలో కూడా వాళ్లు బాగానే సంపాదించుకుని ఎమ్మెల్యేకి నాలుగు రాళ్ళు పక్కన పడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పెద్దగా ప్రచారం లేకుండా అలా కలిసి వచ్చేస్తుంటే ఇక ఇబ్బంది ఏముందని, అధికారులు కూడా చూసీ చూడనట్టు ఉండమని ఎమ్మెల్యేకు అత్యంత దగ్గరి మనుషులు పర్సనల్‌గా చెబుతున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో జనసేనకు టిడిపికి పెద్దగా సఖ్యత లేదు. దీంతోఎక్కడైనా రేషన్ బియ్యం దొరికితే టిడిపి స్థానిక నేతలు డైరెక్ట్ గా అధికారులను ప్రశ్నిస్తున్నారట.

Read Also: Chandrababu and Lokesh: ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు.. విద్యార్థిగా లోకేష్‌..

దాంతో కొన్ని సందర్భాలలో అధికారులు తప్పనిసరై పట్టుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఆ టైంలో కూడా ఎమ్మెల్యే ఆఫీస్‌ నుంచి ఫోన్లు వస్తున్నాయట. రేషన్ బియ్యం సీజ్ చేస్తే చేయండిగానీ…. దొరికిన వాళ్ళు ఎమ్మెల్యే తాలూకా అయినప్పటికీ ఆ ప్రస్తావన తీసుకు రాకండని క్లారిటీగా చెప్పేస్తున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే… ఎమ్మెల్యే నానాజీకి తెలియకుండా ఉంటుందా అని జనసైనికులు సైతం మాట్లాడుకుంటున్నారట. ప్రతి దానికి పాత రేట్ల ప్రకారం ఎమ్మెల్యే గారిని అలా గౌరవిస్తున్నారని అనుచరులు సెటైర్లు వేస్తున్నారట…మొత్తానికి కాకినాడ రూరల్‌లో రేషన్ రైస్ యాపారం బాగానే జరుగుతోందని, ఎమ్మెల్యే కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మనకు ఒరిగేదేంటి అనుకుంటూ…. తాను మాత్రం సీన్‌లోకి రాకుండా చక్రం తిప్పుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ఎటు చూసినా స్టోరేజ్ పాయింట్లే కనిపిస్తున్నాయట. ఎమ్మెల్యే కూడా… ఎక్కడా మన పేరు లేదు, అంతా కూల్‌గా జరిగిపోతున్నప్పుడు కెలుక్కుని బిల్డప్‌లు ఇవ్వడం ఎందుకనుకుంటూ.. బియ్యం బస్తా ఎత్తడానికి ఓ చెయ్యేస్తున్నారని సెటైర్స్‌ వేసుకుంటున్నారట కాకినాడ రూరల్‌ జనం.

Exit mobile version