చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సంబంధించిన ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారం నుంచి తప్పుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కొంతకాలంగా జిన్‌పింగ్ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, బ్రిక్స్ సమావేశానికి హాజరు కాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. అసలు చైనాలో ఏం జరుగుతోంది? జిన్‌పింగ్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? చైనాలో అధికార మార్పిడి జరగబోతోందా..?
ఇది కూడా చదవండి: Anushka : నా ఫస్ట్ లవ్ అతడితోనే.. ఇప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలింది !
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారాన్ని వీడబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నియంతృత్వ పోకడలతో చైనా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న జిన్‌పింగ్ ఇప్పుడు ఎందుకు అనూహ్యంగా తప్పుకుంటున్నారన్నది అంతు చిక్కట్లేదు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారాన్ని వీడబోతున్నారనే ఊహాగానాలు, అంతర్జాతీయ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దానికి పైగా చైనా రాజకీయాలను శాసిస్తున్న జిన్‌పింగ్, తన పాలనా పగ్గాలను నెమ్మదిగా కమ్యూనిస్టు పార్టీలోని కీలక విభాగాలకు బదిలీ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక నియంతృత్వ పాలకుడి శకం ముగియనుందనే చర్చకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం చైనా అంతర్గత రాజకీయాలకే పరిమితం కావు. ప్రపంచ భౌగోళిక-రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Chandrababu and Lokesh: ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు.. విద్యార్థిగా లోకేష్..
జిన్‌పింగ్ కొంతకాలంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బహిరంగంగా ఆయన కనిపించలేదు. దీంతో ఆయన పనైపోయిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవలి కాలంలో జిన్‌పింగ్ పలు కీలక అంతర్జాతీయ సమావేశాలకు, దేశీయ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సుకు ఆయన గైర్హాజరయ్యారు. గత 12 ఏళ్లలో ఆయన బ్రిక్స్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా, చైనా అధ్యక్షులు ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ఆయన గైర్హాజరుపై చైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన కూడా లేదు. అనారోగ్య కారణాలు లేదా అంతర్గత రాజకీయ పరిణామాలు దీనికి కారణం కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పార్టీలో కీలకమైన అధికారాలను ఇతర నాయకులకు బదలాయించే ప్రక్రియలో భాగంగానే ఆయన వెనుకడుగు వేస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సజావుగా అధికార మార్పిడి జరిగేందుకు ఇదొక సూచిక కావచ్చని వారి అంచనా.
చైనాలో జిన్‌పింగ్ తనదైన ముద్ర వేశారు. ఓ నియంతగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో చైనాను అగ్రస్థానంలో నిలిపేందుకు అనేక సంస్కరణలు చేపట్టారు. షీ జిన్‌పింగ్ 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ –CPC ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఆయన తన అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తన పాలన ప్రారంభంలోనే అగ్రశ్రేణి నాయకుల నుంచి చిన్న ఉద్యోగుల వరకు అందరినీ లక్ష్యంగా చేసుకున్నారు. భారీ ఎత్తున అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది పార్టీలో తన ప్రత్యర్థులను తొలగించి, తన పట్టు నిలుపుకునేందుకు సహాయపడింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ- PLAపై తన నియంత్రణను పెంచుకున్నారు. సైనిక కమాండ్ నిర్మాణాన్ని సంస్కరించారు. తన విధేయులను కీలక స్థానాల్లో నియమించారు. 2016లో జిన్‌పింగ్‌కు పార్టీలో ‘ముఖ్య నాయకుడు’ అంటే Core Leader హోదా లభించింది. మావో జెడాంగ్ తర్వాత అతి కొద్దిమందికి లభించిన అరుదైన హోదా ఇది. జిన్‌పింగ్ తనకు అనుకూలంగా 2018లో రాజ్యాంగాన్ని సైతం సవరించారు. అధ్యక్ష పదవికి ఉన్న రెండు-పదవీకాలాల పరిమితిని తొలగించారు. ఇది ఆయనకు జీవితకాల అధ్యక్షుడిగా ఉండే అవకాశాన్ని కల్పించింది. ఈ చర్య ద్వారా ఆయన అధికారాన్ని తన గుప్పిట్లో శాశ్వతంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. అందుకే ఆయన ఓ నియంతలా పేరు తెచ్చుకున్నారు. చైనా చరిత్రలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మారారు.
శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు జిన్‌పింగ్ రాజ్యాంగ నిబంధనలను మార్చుకున్నప్పటికీ, ఇప్పుడు ఆయన అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే దీని వెనుక అనేక కారణాలున్నాయి. జిన్‌పింగ్ చైనాలో అంతర్గతంగా శక్తివంతమైన నాయకుడిగా మారారు. అయితే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. నిర్మాణ రంగం సంక్షోభంలో ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థిక సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాలు కనుగొనడంలో జిన్‌పింగ్ విఫలమయ్యారనే విమర్శలు పార్టీలోనే పెరుగుతున్నాయి. కరోనా సమయంలో జిన్‌పింగ్ దూకుడుగా అమలు చేసిన ‘జీరో-కోవిడ్’ విధానం ప్రజాగ్రహానికి కారణమైంది. ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించింది. ఇది జిన్‌పింగ్ నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. జిన్‌పింగ్ అధికారాన్నంతటినీ కేంద్రీకృతం చేశారు. తన గుప్పిట్లో ఉంచుకున్నారు. ఇది పార్టీలో అసమ్మతి రాజేసింది. మాజీ నాయకులు, సీనియర్ పార్టీ సభ్యులు జిన్‌పింగ్ నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం వల్లే, జిన్‌పింగ్ తలొగ్గి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఒకే వ్యక్తి సుదీర్ఘకాలంపాటు అధికారంలో కొనసాగితే అది దేశంలో అస్థిరతకు దారితీస్తుందనే భయం కమ్యూనిస్టు పార్టీలో ఉంది. అందుకే జిన్‌పింగ్ నుంచి సాఫీగా అధికారిక పగ్గాలను బదలాయించాలని పార్టీ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.
జిన్‌పింగ్ ఓ నియంతలా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనదైన కఠిన నిర్ణయాలతో అటు పాలనలోనూ, ఇటు పార్టీలోనూ అనేక సంస్కరణలు అమలు చేశారు. అయితే వీటిపై విమర్శలు కూడా ఉన్నాయి. జిన్‌పింగ్ వైదొలిగితే, చైనా రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లే. ఆయన పాలనలో చైనా ప్రపంచ శక్తిగా ఎదిగినప్పటికీ, మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్గత అణచివేత, పొరుగు దేశాలతో వివాదాలు వంటి అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన నిష్క్రమణ చైనాకు కొంత సానుకూల మార్పులను తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. అయితే కమ్యూనిస్టు పార్టీ పెత్తనం కొనసాగుతుంది కాబట్టి, పాలనలో నియంతృత్వ పోకడలు పూర్తిగా అంతరించిపోతాయని చెప్పలేం. చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ హక్కులపై పార్టీ నియంత్రణ కొనసాగుతుంది. కొత్త నాయకత్వం పార్టీ ఆధిపత్యాన్ని సవాలు చేసే అవకాశం చాలా తక్కువ.
ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల ద్వారా ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు. కానీ చైనాలో అలా ఉండదు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీదే పెత్తనం. చైనాలో అధికార మార్పిడి ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే సాధారణ ఎన్నికల ప్రక్రియకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ అధికారం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా- CPC అంతర్గత విధానాలకు లోబడి ఉంటుంది. దేశంపై CPC పూర్తి ఏకఛత్రాధిపత్యాన్ని కలిగి ఉంది. రాజ్యాంగబద్ధంగా, సీపీసీకి దేశంలో పాలక పాత్ర ఉంటుంది. అన్ని ప్రభుత్వ సంస్థలు, సైన్యం, న్యాయవ్యవస్థ, మీడియా… ఇలా అన్నీ పార్టీ నియంత్రణలోనే పనిచేస్తాయి. పార్టీ నాయకుల ఎంపిక, పదవీ విరమణ వంటి నిర్ణయాలు పార్టీలోని అత్యున్నత స్థాయి కమిటీలైన పొలిట్‌బ్యూరో, దాని స్టాండింగ్ కమిటీలే తీసుకుంటాయి. ఈ నిర్ణయాలు సాధారణంగా గోప్యంగా ఉంటాయి. ప్రజలకు ఇందులో ఎలాంటి భాగస్వామ్యం ఉండదు. సాధారణంగా చైనాలో నాయకులు ఐదేళ్లపాటు పాలించే అధికారం ఉంది. ఒక వ్యక్తి 2 పదవీకాలాలను పూర్తి చేయొచ్చు. ఆ తర్వాత పదవీ విరమణ చేయాలి. అయితే, జిన్‌పింగ్ ఈ నియమాన్ని మార్చారు. నూతన నాయకుల ఎంపికకు సంబంధించి ఒక సుదీర్ఘ అంతర్గత ప్రక్రియ ఉంటుంది. ఇందులో వ్యక్తిగత విధేయత, పార్టీ పట్ల నిబద్ధత, పాలనా సామర్థ్యాలు పరిగణనలోకి తీసుకుంటారు.
ఒకవేళ జిన్‌పింగ్ వైదొలిగితే ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు తీసుకుంటారనేదానిపై క్లారిటీ లేదు. ఎవరికి బాధ్యతలివ్వాలనేది కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం. అయితే కొంతమంది పేర్లు ఈ స్థానం కోసం గట్టిగా వినిపిస్తున్నాయి. జిన్‌పింగ్ వారసుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నవాళ్లలో లీ కియాంగ్ (Li Qiang) ముందున్నారు. ప్రస్తుతం చైనా ప్రధానిగా ఉన్నారు. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు. కోవిడ్-19 లాక్‌డౌన్‌లను నిర్వహించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జిన్‌పింగ్ బదులు G20 లాంటి అంతర్జాతీయ సదస్సుల్లో ఈయనే పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఈయన పేరొందారు. లీ కియాంగ్ తో పాటు డింగ్ జుయెజియాంగ్ (Ding Xuexiang) పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన మొదటి ఉప ప్రధానిగా, పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహిత సహాయకుడిగా పేరొందారు. అధ్యక్ష రేసులో వాంగ్ హునింగ్ (Wang Huning) పేరు కూడా బలంగా వినిపిస్తోంది. పార్టీ చీఫ్ సిద్ధాంతకర్తగా ఈయన పేరొందారు. ముగ్గురు అధ్యక్షులకు సలహాదారుగా పనిచేసిన అనుభవం ఈయన సొంతం. అయితే, ఈయనకు పరిపాలనా అనుభవం తక్కువ. కాబట్టి నేరుగా అధ్యక్షుడి అయ్యే బదులు “కింగ్‌మేకర్”గా ఉండే అవకాశం ఉంది. రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న వాళ్లలో వాంగ్ యాంగ్ (Wang Yang) ఒకరు. ఈయన సంస్కరణవాదిగా పేరొందారు. టెక్నోక్రాట్ గా ప్రసిద్ధి. ఒకప్పుడు జిన్‌పింగ్ ఈయన్ను పక్కకు నెట్టేశారు. అయితే ఇప్పుడు వాంగ్ యాంగ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. వీళ్లతో పాటు జావో లెజి (Zhao Leji), జనరల్ జాంగ్ యోక్షియా (General Zhang Youxia) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలనేది పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ ఇష్టం.
చైనాలో అధికార మార్పిడి ప్రక్రియ చాలా రహస్యంగా సాగుతుంది. పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉంటుంది. ఒకవేళ జిన్‌పింగ్ అధికారం నుంచి తప్పుకుంటే, అది చైనా రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఓ నియంత శకం ముగిసినట్లే భావించాలి. అయితే ఈ మార్పు కమ్యూనిస్టు పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని ఎంత మేరకు ప్రభావితం చేస్తుందనేది చూడాలి.