NTV Telugu Site icon

Off The Record: వైసీపీలో హాట్ హాట్‌గా కడప అసెంబ్లీ టికెట్‌.. టికెట్‌కు ఫుల్‌ డిమాండ్‌ ?

Kadapa

Kadapa

Off The Record: క‌డ‌ప‌.. సీఎం సొంత జిల్లా.. YSR కుటుంబానికి కంచుకోట‌. పులివెందుల తర్వాత వైఎస్ ప్యామిలీ ప్రభావం బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో రెండు దశాబ్దాలుగా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. కేవలం కడప ఎమ్మెల్యే అని అనిపించుకోవ‌డ‌మే కాదు.. అమాత్య ప‌ద‌వులు చేపట్టి ఓ రేంజ్‌కి వెళ్లిపోయారు. వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు గెలిచిన నాయకులు కనిపిస్తారు. 1955, 1967 ప్రాంతాల్లో ఎం.రహంతుల్లా గెలిస్తే.. తర్వాత రెడ్డి సామాజికవర్గ నాయకులు 1972 నుంచి 1989 ఎన్నిక‌ల వ‌ర‌కు గెలుస్తూ వ‌చ్చారు. ఆపై క‌డ‌ప ట్రెండ్ మారింది. 1994, 1999 ఎన్నిక‌ల్లో టిడిపి నుంచి SA ఖ‌లీల్ బాష గెలిచారు. మంత్రిగానూ పనిచేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు YS ఫ్యామిలీ నిల‌బెట్టిన అభ్యర్థులదే గెలుపు. 2004, 2009లో ఎస్‌.అహ్మదుల్లా కాంగ్రెస్‌ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మారిన రాజకీయ పరిస్థితులతో అహ్మదుల్లా రాజకీయాలకు దూరం కావడంతో వైసీపీ నుంచి SB అంజాద్‌ బాషా కడపలో పాగా వేశారు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి కూడా. గత రెండు ఎన్నికల్లో అంజాద్‌ బాషానే గెలుస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు అంజాద్‌ బాషా.

Read Also: Off The Record: రేవంత్‌ పాదయాత్రలో నర్సంపేట మిస్‌..! ఆ ఒక్క ఫోన్‌ కాలే కారణమా..?

కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లో మైనారిటీ ఓటర్ల తర్వాత బలిజలు, రెడ్డి సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువ. కాకపోతే కడప సెగ్మెంట్‌ మైనారిటీలకు అడ్డాగా మారిపోయింది. ఈ దఫా అధికారపార్టీలో కడప సీటు కోసం గట్టి పోటీయే కనిపించే వీలుంది. వచ్చే ఎన్నికల్లో మైనారిటీ యేతరులకు టికెట్‌ ఇస్తారని ఓవైపు ప్రచారం జరుగుతున్నా.. అది వర్కవుటయ్యే పరిస్థితి లేదని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ముస్లిం సామాజికవర్గానికి చెందిన చాలా మంది నాయకులు వైసీపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక్కడ వైసీపీ సీటును మాజీ మంత్రి డాక్టర్‌ ఖలీల్‌ బాష కుమారుడు సోహెల్‌ కూడా ఆశిస్తున్నారట. ఖలీల్‌ కుటుంబానికి కడపలో రాజకీయ ప్రాధాన్యం ఉంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి టీకే అలీ అఫ్జల్‌ఖాన్‌ కూడా కర్చీఫ్‌ వేస్తున్నట్టు సమాచారం. 2004లోనే ఆయన కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉండటంతో తనకు తప్పకుండా సీటు వస్తుందని ఆశిస్తున్నారు. అయితే కడపలో మొదటి నుంచి టికెట్‌ ఎంపికలో వ్యక్తుల ప్రాధాన్యం కంటే.. వైసీపీ హైకమాండ్‌దే తుది నిర్ణయం. దీంతో టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల్లో ఎవరిని పార్టీ ఎంపిక చేస్తుంది? అసలు మార్పు ఉంటుందా? ఉంటే ఎవరికి ఛాన్స్‌ ఉంటుంది అనే ఉత్కంఠ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.