ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సబ్ రీజియన్స్‌లో ఒకటి ఉత్తరాంధ్ర. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కలిపి మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంత ఓటర్ల తీర్పు ఏకపక్షమైన ప్రతీసారీ పార్టీలు అనూహ్యమైన విజయాలను కైవశం చేసుకుంటున్నాయి. 1994 ఎన్నికల్లో తొలిసారి ఉమ్మడి అభ్యర్థులతో కలిపి 33స్థానాలను గెల్చుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఒక్కరే ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2019లో వైసీపీ గాలి వీచింది. 28 చోట్ల గెలిచి అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ ఈ లెక్కలేసుకునే పార్టీలు సన్నద్ధం అవుతుంటాయి. అందుకే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఈసారి పవన్ కల్యాణ్ సైతం ఉత్తరాంధ్ర నుంచే విజయయాత్రను కొనసాగించాలని చూస్తున్నారు. ఆ దిశగా కీలకమైన విశాఖ నగరంపై ఫోకస్ పెట్టారు.
గత ఎన్నికల్లో గాజువాకలో ఓటమి తర్వాత మరింతగా ఇక్కడ దృష్టి కేంద్రీకరించారు పవన్. ఇసుక, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై లాంగ్ మార్చ్ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ బహిరంగ సభ.. మొన్నటి ప్రజావాణి ర్యాలీ వరకు ప్రతీ ట్రిప్ పొలిటికల్ మైలేజీ వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే.. సంస్థాగత లోపాలతో జనసేన పటిష్టం కాలేదు. ఫలితంగా జనసేనాని వస్తే కనిపించే జోష్ తర్వాత మచ్చుకు కూడా ఉండటం లేదు. చాలా నియోజకవర్గాలకు ఫలానా వ్యక్తి నాయకుడు అని చెప్పుకొనే పరిస్థితి కనిపించదు. నాయకత్వం, పార్టీ స్ట్రక్చర్ లేకపోతే కష్టమని జనసేన గుర్తించినట్టు ఉంది. పవన్ సహా అభ్యర్థులంతా ఓడినా.. ఈ ప్రాంతంలో చాలాచోట్ల జనసేనకు చెప్పుకోదగ్గ ఓటింగ్ నమోదైంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెల్చుకుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి బోణీ కొట్టాలని జనసేన పట్టుదలగా కనిపిస్తోంది.
జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వారంపాటు ఉత్తరాంధ్రాలో పర్యటించి పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. జనవరి 12న ఎచ్చెర్లలో యువతతో అతి పెద్ద సదస్సు నిర్వహించే యోచనలో ఉన్నారు. అయితే జనసేన ఎత్తుగడలకు విరుగుడు మంత్రం వేస్తోంది వైసీపీ. ఇలా వైసీపీ.. జనసేనలు దూకుడు పెంచడంతో.. టీడీపీ డిఫెన్స్‌లో పడినట్టు కనిపిస్తోంది. టీడీపీ అసంతృప్తి నేతలు జనసేన వైపు చూస్తున్నారట. ప్రస్తుతం నగరంలో టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో వెలగపూడి ఒక్కరే పార్టీ కార్యక్రమంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కేడర్‌ను కాపాడేందుకు గణబాబు ప్రయత్నాలు చేస్తుండగా.. మరో ఎమ్మెల్యే గంటా ఎప్పుడో నియోజకవర్గాన్ని వదిలేశారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ కేడర్ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఎదుర్కొంటోంది. భవిష్యత్ లో పొత్తులు మాటేమో కానీ అధినాయకత్వం తెరుకోకపోతే నష్టం తప్పదనే భయం టీడీపీని వెంటాడుతోంది.