Site icon NTV Telugu

Off The Record: కాంగ్రెస్‌ పీఏసీలో జగ్గారెడ్డి హాట్‌ కామెంట్స్‌.. ఆంతర్యమేంటి..?

Jagga Reddy

Jagga Reddy

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడో కొత్త రకం చర్చ మొదలైందట. పార్టీలో అందరిదీ ఒక లైన్‌ అయితే… జగ్గారెడ్డిది మరో లైన్‌ అని మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. గాంధీభవన్‌లో ఇటీవల పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో జగ్గారెడ్డి అన్న మాటల గురించే ఇప్పుడు చర్చ అంతా. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో బాగా ప్రచారం జరగాలంటే… కార్యకర్తలని సంతోషపెట్టడం ముఖ్యమని సూచించారట ఆయన. దునియా అంతటిని సంతోషపెట్టే మీరు…కార్యకర్తలను ఆర్ధికంగా ఆదుకోవడం గురించి ఎందుకు ఆలోచించరు? ఆ పని చేయండని చెప్పేశారట ఆయన. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు జేబులకు చిల్లులు పెట్టుకుని కార్యకర్తలు పనిచేశారని, ఇప్పుడు వాళ్లను ఆదుకోకపోతే అసంతృప్తితో ఉంటారని, అది పార్టీకి మంచిది కాదని తేల్చి చెప్పారట జగ్గారెడ్డి. ఇందుకు పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే పథకాలన్నీ ఇల్లిల్లు చేరుతాయనేది జగ్గారెడ్డి కాన్సెప్ట్‌.

Read Also: HYD Animal Smugglers: రెడ్ శాండిల్ స్మగ్లర్స్.. ఇప్పుడు రూట్ మార్చారు..

అందుకే… కార్యకర్తల కోసం ఓ స్పెషల్‌ స్కీమ్‌ పెట్టాలని, ఆర్థికంగా అండగా ఉండే ప్రయత్నం చేయాలన్నది దాని సారాంశం. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌… అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ… కార్యకర్తలను పట్టించుకోకుండా లబ్దిదారులకు నేరుగా పథకాలు ఇవ్వడంవల్లే నష్టపోయాయన్న చర్చ కూడా జరిగిందట మీటింగ్‌లో. కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు కేడర్‌ని పట్టించుకోకుంటే నష్టమేనని మాట్లాడుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్దిదారులు… ఎన్నికల నాటికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆలోచించవచ్చుగానీ…వాళ్ళను పోలింగ్ బూత్ వరకు తీసుకు వెళ్ళేది మాత్రం కార్యకర్తలేనన్నది జగ్గారెడ్డి ఒపీనియన్‌. అందుకే కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను కాపాడుకోవాలని, అప్పుడే మనుగడ ఉండదంటున్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. కేడర్‌కు ప్రత్యేక స్కీమ్‌ లేదా గుర్తింపు ఉండాలంటున్నారు జగ్గారెడ్డి. కానీ… ఆ పని ప్రభుత్వ పరంగా చేయడం కుదురుతుందా అన్నది బిగ్‌ క్వశ్చన్‌. అందుకే పార్టీ పరంగా అయినా ప్రయత్నించాలన్న సూచనలు వస్తున్నాయట. ఈ సందర్భంగా బెంగాల్‌ మోడల్‌ని ఉదహరిస్తున్నారు.

Read Also: TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

గతంలో పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్ట్‌ నాయకులు రికమండ్‌ చేస్తేనే ప్రభుత్వ పథకాలు అందేవి. ఇప్పుడు తెలంగాణలో కూడా అలా చేయాలని జగ్గారెడ్డి అంటున్నారా అన్న చర్చ నడుస్తోంది కాంగ్రెస్‌ సర్కిల్స్‌లో. గతంలో ఆయా పార్టీలు చేసిన పొరపాట్లు.. ఇప్పుడు కాంగ్రెస్ చేయొద్దన్నది మాజీ ఎమ్మెల్యే మాటగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం ఏడాదిన్నరగా చేసిన పనుల్ని ఇప్పుడిప్పుడే ప్రచారం చేసుకుంటోంది. కానీ… ఆశించినంతగా అవి ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఇంకా చెప్పాలంటే… గట్టిగా ఫోకస్‌ లేదంటున్నారు. పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నందున పార్టీ నాయకులకు సంబంధం ఉన్నా..లేకున్నా.. ప్రచారం చేసుకోవడం మాత్రం ముఖ్యమన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. ప్రభుత్వం ఎంత చేసినా… చివరికి దాన్ని చెప్పి ఓటర్‌ని పోలింగ్‌ బూత్‌ దాకా తీసుకువెళ్ళేది మాత్రం కార్యకర్తే గనుక వాళ్ళకు లబ్ది చేకూర్చాలన్న జగ్గారెడ్డి ప్రతిపాదనను ఎలా, ఎంతవరకు అమలు చేస్తారో చూడాలి. అటు కేడర్‌లో మాత్రం ఈ ప్రతిపాదనపై సంతోషం వ్యక్తం అవుతోందట.

Exit mobile version