NTV Telugu Site icon

IT and ED Raids in Telangana: తెలంగాణపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్‌.. ఈడీ తదుపరి టార్గెట్‌ ఎవరు?

It And Ed Raids

It And Ed Raids

టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య రాజకీయ వైరం.. తెలంగాణలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీపై సీబీఐ దృష్టి పెట్టగా.. తాజాగా గ్రానైట్‌ వ్యాపారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ED విచారణ మొదలుపెట్టింది. ఇక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులు సరేసరి. మునుగోడు ఉపఎన్నిక ముగియగానే ఈడీ విసిరిన పంజా రాష్ట్రంలో వేడి పుట్టిస్తోంది. అది పొలిటికల్‌గానూ అలజడికి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఈడీ రైడ్స్‌ రాడార్‌ పరిధిలో టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు.. నాయకులు ఉండటంతో మరింత సెగలు రేపుతోంది. మంత్రి గంగుల కమాలకర్‌, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఆఫీసులు, నివాసాలు.. వ్యాపార సంస్థల్లో ED సోదాలు తీవ్ర చర్చగా మారాయి.

Read Also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకుంటోంది ఎవరు?

మంత్రి గంగుల, ఎంపీ రవి తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల నజర్‌లో ఉన్నది ఎవరు? అనేది గులాబీ శిబిరంలో ప్రశ్న. టీఆర్ఎస్‌లో కీలకంగా ఉంటూ.. వ్యాపారాలు.. కాంట్రాక్టులు చేస్తున్న నాయకులపై కేంద్ర విచారణ సంస్థలు ఫోకస్‌ పెడతాయా? అయితే ఎవరు? ఏ అంశాలపై కూపీ లాగుతారు? ఏం చేస్తారు? ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కొందరు ప్రజాప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారట. తాజా ఈడీ దాడులపై టీఆర్ఎస్‌ కౌంటర్‌ అటాక్‌ మొదలుపెట్టింది. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారనే కోణంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు అధికార పార్టీ నేతలు. ఇప్పటికే మహారాష్ట్ర, బెంగాల్‌లో జరిగిన, జరుగుతున్న ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు.. అక్కడ రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న టీఆర్ఎస్‌ నేతలు భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారట. ఆయా రాష్ట్రాల్లో ఏం జరిగిందో అని ఆరా తీస్తున్నారట.

టీఆర్‌ఎస్‌లో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు.. సీనియర్‌ నాయకులు దశాబ్దాలుగా వ్యాపారాల్లోనూ.. కాంట్రాక్ట్‌ పనుల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్లంతా జరుగుతున్న పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నారట. పైకి చెప్పకపోయినా.. ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్‌లో మరికొందరు ఉన్నట్టు సమాచారం. నేతలు ఒకరినొకరు కలిసినప్పుడు నెక్స్ట్‌ మీరే అంటే మీరే అని ఇంకొందరు జోకులు పేలుస్తున్నారట. ఈడీ కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. మరి.. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు… చర్చకు ఆస్కారం కల్పిస్తుందో చూడాలి.