Off The Record: యనమల అడగనంటూనే అడుగుతున్నారా..? బెదిరిస్తున్నారా..? బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారా..?

  • యనమల రామకృష్ణుడు అడగనంటునే అడుగుతున్నారా? ..
  • పార్టీని బెదిరిస్తున్నారా...బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ..
  • గతంలో ఎన్నడూలేనిది దేవుడి మీద ఎందుకు భారం వేశారు? ..
  • అధిష్టానం పట్టించుకోవడం లేదా పట్టించుకోనట్టు నటిస్తోందా? ..
  • తన కల కలగానే మిగిలిపోతుందని యమనల ఎందుకంత ఫీలవుతున్నారు?..
  • జీవితంలో ఒక్కసారైనా రాజ్యసభ ఎంపీగా పని చేయాలని యనమల కల ..
  • 2 స్థానాల్లో తనకు ఒకటి దక్కాలని వీరోచిత ప్రయత్నాలు..
  • అవకాశం అడిగితే వచ్చేది కాదు..భగవంతుడు అనుకోవాలని వేదాంతం..
  • అడగనంటూనే ప్రతీసారి పదవీ ప్రస్తావన ఎందుకు?..
  • యనమల బెదిరిస్తున్నారా...బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?..
  • చిన్నల్లుడి ఎపిసోడ్ తర్వాత గరంగరంగా హైకమాండ్? ..
Otr Yanamala

Otr Yanamala

Off The Record: తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు సీనియర్ మోస్ట్ లీడర్. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా రామకృష్ణుడికి మాత్రం ఏదో పదవి గ్యారెంటీగా ఉండేది. అయితే ఆయన ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా మంత్రిగా, మండలి ప్రతిపక్ష నేతగా పీఏసీ చైర్మన్ గా, స్పీకర్‌గా పార్టీ ఆయనకు చాలా పదవులు కట్టబెట్టింది. కష్టకాలంలో ఉన్నప్పుడు రామకృష్ణుడు కూడా పార్టీకి అదేవిధంగా ఉపయోగపడ్డారు. అయితే గతేడాది ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత నియోజకవర్గానికే పరిమితమయ్యారు యనమల. మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు ప్రయారిటీ లేకుండాపోయిందని చర్చ సాగుతోంది.

మొదటి నుంచీ యనమలకు ఒక కోరిక వుందన్నది ఆయనతో పాటు అనుచరులు ఈమధ్య నిత్యం చెప్పుకుంటున్న మాట. జీవితంలో ఒక్కసారైనా రాజ్యసభ సభ్యుడిగా పని చేయాలని ఆయన కల అట. చాలాసార్లు పెద్దల సభ గురించి పార్టీ ముందు ప్రపోజల్స్ పెట్టారు. బహిరంగ వేదికల మీద కూడా తన జీవిత కాలపు కోరికను బయటపెడుతూ వస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ రేస్ మీద టిడిపిలో గట్టిగానే కసరత్తు జరుగుతోంది. పసుపు పార్టీకి పెద్దల సభకు రెండు స్థానాలు దక్కుతాయి. ఈ రెండింటిలో ఒకటి ఎలాగైనా తనకు దక్కాలని యనమల వీరోచితంగా ప్రయత్నిస్తున్నారు. ఆఖరి అస్త్రం కూడా ప్రయోగిస్తున్నారు. పదవుల కోసం చాలామందికి తాను సాయం చేశాను గానీ, తాను ఎవరినీ సహాయం కోరలేదని అంటున్నారు.. సన్నిహితులు పార్టీని రాజ్యసభ అడగాలని తనకు సలహాలు ఇస్తున్నారని, ఆ అవకాశం మనం అడిగితే వచ్చేది కాదని, భగవంతుడు అనుకోవాలని వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఆయన అనుకుంటే జరగనిది అంటూ ఏదీ ఉండదని గుర్తు చేస్తున్నారు. పార్టీ పెద్దలు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. పార్టీ తనను 44 ఏళ్ళు పోషించిందని చెబుతూనే, తనకు పదవి ఇవ్వండి పరిగెడతాను అని అడగలేనని గుర్తు చేస్తున్నారు. పార్టీ మనుగడ కోసం శత్రువులకు కూడా సాయం చేస్తానంటూ ఎండింగ్ టోన్ సౌండ్ పెంచుతున్నారు. అసలు యనమల ఉద్దేశం ఏంటి…? పదవి అడగనంటూనే ప్రతిసారి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు ఏ ఫ్యామిలికీ ఇవ్వని అవకాశాలు యనమలతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చిందని పార్టీలో మరో వర్గం అంటోంది. అయినా జీవితకాలం మేం పల్లకిలో కూర్చుంటూనే ఉంటాం అంటే మిగతా వాళ్ళు మోస్తూనే ఉండాలా అని ప్రశ్నించేవారూ వున్నారు. యనమల బెదిరిస్తున్నారా…బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అడిగే వాళ్లూ ఎక్కువే వున్నారు. ఎవర్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలో పెద్దలకు తెలుసు….పదేపదే ఆ ప్రస్తావన తీసుకుని రావాల్సిన అవసరమేంటని కాస్త విసుగ్గానే మాట్లాడుకునే వారూ వున్నారు. కొన్ని ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయని గుర్తు చేస్తున్నారు. అయినా ఆ స్థాయిలో దగ్గర్నుంచి చూసిన వ్యక్తికి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం యనమలను పరిగణలోకి తీసుకునే అవకాశం దాదాపు కనిపించడం లేదు. చిన్నల్లుడు మహేష్ యాదవ్ ఎపిసోడ్ తర్వాత పార్టీ మరింత గరంగరంగా ఉంది. ఇక అదేపనిగా అడగడం మానుకోవడం మంచిదని ఉచిత సలహాలు ఇస్తున్నారు కొందరు నేతలు. రామకృష్ణుడు మాత్రం రాజ్యసభ కోసం వీలుచిక్కినప్పుడల్లా ట్రయల్స్ వేస్తూనే వున్నారు. తన పొలిటికల్ రిటైర్మెంట్ ఘనంగా ఉండాలని కోరుతున్నారు. ప్రయత్నించి ప్రయత్నించి….చివరాఖరుకు భగవంతుడిపై భారం వేశారు. మరి పైవాడు ఏం తలుస్తాడో..?