Off The Record: కాలం కలిసి రాకపోతే.. తాడే పామవుతుందని అంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణకు ఇది బాగా సూటవుతుందని అంటున్నారు. సరిగ్గా…రెండేళ్ళ క్రితం ఇదే కాలం కలిసొచ్చి…. అదృష్టం లాగిపెట్టి తన్నిన తన్నుడు దెబ్బకు డైరెక్ట్‌గా వెళ్ళి పార్లమెంట్‌లో పడ్డారాయన. కానీ… అదే లక్కు ఇప్పుడు వెక్కిరిస్తోందట. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పరిస్థితులు ఎంపీ సాబ్‌ని వెక్కిరిస్తున్నాయన్నది లోకల్ వాయిస్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే… హిందూపురానికి చెందిన నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ గతంలో ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. కానీ… అక్కడి రాజకీయాల్లో యాక్టివ్‌గా పని చేశారు. బోయ సామాజికవర్గ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. అలాగే… హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉండటం 2024లో ఆయనకు కలిసి వచ్చింది. దీంతో… హిందూపురం లోక్‌సభ సీట్లో పోటీ చేయాలని మొదట భావించారాయన. అయితే.. రకరకాల సమీకరణల కారణంగా అక్కడ పార్థసారథికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో… అంబికాను అనంతపురం ఎంపీ సీటుకు పంపింది టీడీపీ అధిష్టానం. అక్కడ ఆయన స్థానికేతరుడు అయినప్పటికీ.. కూటమి వేవ్ బలంగా కలిసొచ్చి భారీ మెజారిటీతో ఎంపి అయ్యారు. ఆయన గెలుపులో కులం కూడా ప్రధాన పాత్ర పోషించిందన్న విశ్లేషణలున్నాయి. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది.
అలా… లక్ష్మీనారాయణకు విజయం నల్లేరు మీద నడకే అయిందని అంటారు. కానీ… తన జీవిత కాలపు కోరిక నెరవేరిందన్న పిచ్చ హ్యాపీలో అంబికా కాస్త దూకుడుగా వెళ్ళిపోయారట. అదే ఇప్పుడు బూమరాంగ్ అయి నెగెటివ్ సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఒక ఎంపీకి తన పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో పర్యటించే స్వేచ్ఛ ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. కానీ… ఇక్కడే అంబికాకు అసలు సమస్య వస్తోందట. తన పరిధిలోనే కాదు… అసలు జిల్లాలో ఎక్కడ పర్యటించినా… లోకల్ ఎమ్మెల్యేలంతా…. నువ్వొస్తానంటే మేం వద్దంటామని అంటున్నారు. అందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఎంపీగా గెలిచిన వెంటనే… అనంతపురం మీద తన ముద్ర వేసుకోవాలన్న తాపత్రయంతో పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద బాగా ఫోకస్ చేశారు లక్ష్మీనారాయణ. అసలు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండానే దూసుకెళ్లారు. అక్కడే తేడా కొట్టడం మొదలైంది. కొద్ది రోజులకే ఎమ్మెల్యేలకు సీన్ అర్థమై పోయి ఎంపీని పక్కన పెడుతూ వచ్చారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలతో సఖ్యత బాగుండాలి. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు. తమ నియోజకవర్గాల్లో ఎంపీకి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారట సొంత శాసనసభ్యులు. లక్ష్మీనారాయణ గెలిచిన అనంతపురం పార్లమెంట్ పరిధిలో అలా ఉంటే….ఆయన సొంత ప్రాంతమైన హిందూపురంలో కూడా సేమ్ సీన్ అని చెప్పుకుంటున్నారు. అంబికా సొంత ఊరు హిందూపురమే. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు.
కానీ ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే మాత్రం లోకల్ టీడీపీ నాయకులు అస్సలు ఒప్పుకోవడం లేదట. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమం నిర్వహించాలని భావించారు ఎంపీ. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ విషయం స్థానిక టీడీపీ నాయకులకు తెలిసి… వెంటనే వారు ఆ ప్రోగ్రామ్‌కు బ్రేక్ వేశారు. హిందూపురం నీ సొంతూరు కాబట్టి.. బంధువుల ఇళ్లకు, ఫంక్షన్లకు వచ్చి వెళ్తానంటే.. ఓకేగానీ.. ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే మాత్రం కుదరదని చెప్పేశారు. దీంతో… ఇటు సొంత ఊరులో అడుగు పెట్టనివ్వరు, అటు గెలిచిన చోట రానివ్వరు. ఇక నేనేం చేయాలని అంబికా తెగ ఫీలైపోతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో అసంతృప్తులు, ఆధిపత్య పోరు కామనే అయినా… ఇక్కడ మాత్రం ఎందుకింత దారుణంగా మారిపోయిందని అంటే…. కారణం ఎంపీ వ్యవహారశైలే అన్నది ఎక్కువ మంది అంటున్న మాట. ఎక్కడికి వెళ్లినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని లక్ష్మీనారాయణ తాపత్రయ పడతారని, ఆ క్రమంలో వ్యవహరిస్తున్న తీరే అసలు సమస్య అని అంటున్నారు. అయితే… ఇదే సమయంలో ఇదంతా ఆయన స్వయంకృతమా, లేక సీటుకు వేరే ఎవరన్నా ఎసరు పెడుతున్నారా అన్న సందేహాలు సైతం కొందరిలో ఉన్నాయి. ఏదేమైనా ఆయన రెండేళ్ల క్రితం లక్కీ ఎంపీ కాగా… ఇంతలోనే తాడేపామైపోయి…. సొంత ప్రాంతంలోనే నోటీ ఎంట్రీ బోర్డు పెట్టడం నిజంగా విషాదం అన్నది పొలిటికల్ టాక్.

