NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ కమలంలో కల్లోలం రేగుతోందా..?

Tbjp

Tbjp

Off The Record: తెలంగాణ బీజేపీలో కొంత కాలంగా అంతర్గత లొల్లి నడుస్తోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో అది అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కూడా అదే కారణం అన్న వాదన బలంగా ఉంది పార్టీ వర్గాల్లో. అప్పట్లో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శించుకున్నారు. సీట్ల కేటాయింపులో తమ మాటే నెగ్గాలన్న విధంగా వ్యవహరించారు. దానిమీద ఇదెక్కడి కల్చర్‌ అంటూ ఆనాడే చర్చ జరిగింది తెలంగాణ బీజేపీ వర్గాల్లో. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎవరి పనిలో వారు బిజీ అయిపోవడంతో…లొల్లి పెద్దగా బయట పడలేదు. అలాగని మనస్పర్ధలున్న సీనియర్స్‌ ఏమీ ఖాళీగా లేరట. చేతల్లో లేకున్నా… మాటల్లో, మనసులో నేను గెలవాలి, వాళ్ళు ఓడిపోవాలని కోరుకున్నారన్నది ఇంటర్నల్‌ టాక్‌. కడుపులో బార పొడవు కత్తులు పెట్టుకొని పైకి మాత్రం తేనె పూసినట్టు తీయగా మాట్లాడుకుంటూ ఉంటున్నారన్న టాక్‌ పార్టీలో గట్టిగానే నడుస్తోంది. ఇప్పుడు మరోసారి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో తేనె పూసిన కత్తుల వ్యవహారం తెర మీదికి వస్తోంది.

Read Also: India warning: లెబనాన్‌లో భారతీయులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

పార్టీ నేతల మధ్య గ్యాప్‌ మరో సారి బయట పడుతోంది. నేతలు రోడ్డున పడి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కౌంటర్స్‌, ప్రతి కౌంటర్స్‌తో వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సన్మాన కార్యక్రమానికి ముందు ఒక ఎంపీ తొందరపాటులో చేయించిన ప్రచారం పార్టీలో సెగలు రేపిందట. లోపల ఏం జరుగుతోందో పూర్తిగా తెలుసుకోకుండా.. కేవలం కేంద్ర మంత్రులకు మాత్రమే సన్మానం చేస్తారన్న అరకొర సమాచారంతో ఆ ఎంపీ హాటు ఘాటు ప్రచారం చేయించారట. ఏం వాళ్లేనా గెలిచింది? మేం గెలవలేదా? మాకు సన్మానాలు అవసరం లేదా అంటూ సన్నిహితుల ద్వారా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారాట ఆయన. కానీ… తీరా చూస్తే… గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ సన్మానాలు జరిగాయి. మరోవైపు ఇక్కడ ఏం జరిగినా.. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఠక్కున హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్ళే మరో బ్యాచ్‌ ఇబ్బందికరంగా తయారైందంటున్నారు.

Read Also: Off The Record: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలక ఎపిసోడ్‌ ముగిసినట్టేనా? డిమాండ్స్ ఏంటి? హైకమాండ్ భరోసా ఏంటి?

సీరియస్‌నెస్‌తో సంబంధం లేకుండా ప్రతి విషయాన్ని పితూరీల రూపంలో పెద్దలకు చేరవేస్తుండటం తలనొప్పిగా మారుతోందంటున్నారు మరి కొందరు లీడర్స్‌. అలాగే పార్టీలోని ఓ వర్గం విషయం ఉన్నా లేకున్నా… కావాలని అవతలి వాళ్ళ గురించి బహిరంగంగా మాట్లాడిస్తున్నారని, ఇది మరింత ఆందోళన కలిగిస్తోందన్న భావన బలపడుతోంది పార్టీలో. ఇదంతా చూస్తున్న ఇంకొందరు నాయకులైతే… బ్రదర్‌, మా పార్టీలోకి కూడా కాంగ్రెస్ కల్చర్ వచ్చిందని చమత్కరిస్తున్నారట. ఇప్పుడు కాంగ్రెస్‌లోనన్నా నాయకులు కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారుగానీ… మావాళ్ళు మాత్రం కత్తులు దూసుకుంటున్నారని, ఇది పార్టీ ఉనికికే ప్రమాదమని అంటున్నారు. బీజేపీ అంటేనే క్రమశిక్షణకు కేరాఫ్‌ అని, ఇప్పుడు తెలంగాణలో పరిణామాలు ఆ పేరును తుడిచి పెట్టేస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది రాజకీయ వర్గాల్లో. ఇన్నాళ్ళు ఏం ఉన్నా… లోలోపల మాట్లాడుకునేవాళ్ళు. కానీ… ఇప్పుడు సీన్‌ మారిపోయి… కాంగ్రెస్‌ కల్చర్‌ మా పార్టీలోకి కూడా వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ మంది లీడర్స్‌.