తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఎక్కే ఫ్లైట్.. దిగే ఫ్లైట్ అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చాక.. తెలంగాణ పంచాయతీ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లడం.. ఖర్గేతో మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతోంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. తమ పాత పద్ధతిని వదులుకోవడం లేదట. మల్లికార్జున ఖర్గే దగ్గర తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీని మొదలుపెట్టారట. నాలుగైదు రోజులు ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ రెడ్డి.. పిసిసి కమిటీలపై కసరత్తు చేశారు. ఆ వెంటనే రేవంత్ వ్యతిరేక శిబిరం ఢిల్లీకి పయనమయింది. మల్లికార్జున ఖర్గే వద్ద రేవంత్ వ్యతిరేక శిబిరం.. పిసిసి చీఫ్ వ్యవ వ్యవహార శైలిని.. సమన్వయలేమి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారట. అదేరోజు రేవంత్ అనుకూల వర్గం ఢిల్లీకి వెళ్లింది. రేవంత్ పీసీసీ అయ్యాక పార్టీకి జోష్ వచ్చిందని చెప్తూనే.. పాత నాయకత్వం సహకరించడం లేదని.. వివాదాలన్నిటికీ రేవంత్ వ్యతిరేక శిబిరమే కారణం అంటూ ఫిర్యాదులు ఇచ్చి వచ్చిందట. సాధారణంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో గ్రూపులు కట్టడం మొదలవుతుంది. కానీ ఎన్నికలు ఏడాది ముందే ఇలాంటి గ్రూపులు కట్టే పరిస్థితి రావడం పార్టీకి తలనొప్పి తెచ్చే పరిస్థితి ఏర్పడింది.
Read Also: Off The Record: ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మైలేజ్ గేమ్
ఖర్గే దగ్గర తెలంగాణ పార్టీ పరిస్థితిని వివరించడం కంటే.. గ్రూపుల పంచాయతీ ఎక్కువైందట. రేవంత్ అనుకూల వర్గంలో నలుగురు నాయకులు ఖర్గేని కలిస్తే…అంతే సంఖ్యలో వ్యతిరేక శిబిరం కూడా ఖర్గేని కలుస్తోంది. మొదటి విడత ఈ వ్యవహారం ముగిసిన తర్వాత రెండో విడత మొదలైందట. గురువారం పార్టీ సీనియర్ నేత హనుమంతరావు.. కోదండ రెడ్డి.. దామోదర్ రాజనర్సింహ లాంటి సీనియర్ నేతలు అంతా ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు అందుబాటులో లేకపోయినా.. ఆయన కోసం వెయిట్ చేస్తున్నారట. పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు వీళ్లందర్ని సమన్వయం చేస్తున్నట్టు రేవంత్ శిబిరం చర్చించుకుంటోంది. తెలంగాణలో రాజకీయమంతా అరెస్టులు.. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలతో నడుస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అంతర్గత పంచాయతీలతో సతమతమవుతోంది. పార్టీలో ఉన్న పది మంది రెండు గ్రూపులుగా మారి ఢిల్లీలో చక్రం తిప్పే పనిలో పడ్డారని గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. కాంగ్రెస్ లో అంతర్గత పంచాయతీలు కామన్ అయినా.. కలహాల కాపురం పార్టీనే కొంపముంచేలా ఉంది. నాయకులంతా ఐక్యంగా పనిచేయాల్సిన పరిస్థితిల్లో గ్రూపులుగా చీలిపోయి ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఎప్పటికీ సెట్ అవుతుందో చూడాలి మరి.