Off The Record: టీడీపీ టార్గెట్ లిస్ట్ టాప్‌లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ఉంటుందన్నది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ జరుగుతున్న విస్తృత ప్రచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద విచక్షణ మరిచి వంశీ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని చెబుతారు. వాస్తవానికి వంశీ తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువకాలం రాజకీయం చేశారు. 2009లో విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి టికెట్ మీదే వరుసగా రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ. రెండోసారి గెలిచాక టిడిపిని వదిలి అప్పుడు పవర్‌లో ఉన్న వైసీపీకి జై కొట్టారాయన. పార్టీ మారినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. ఓ దశలో శృతిమించి… నైతిక విలువలు కూడా మర్చిపోయి మాట్లాడటం వల్లే వంశీ పేరు హిట్ లిస్ట్‌లో చేరిందని చెబుతుంటాయి టీడీపీ వర్గాలు.
Read Also: Breastfeeding: 30 శాతం మంది తల్లులు పిల్లలకు పాలివ్వడం లేదు.. ప్రమాదం వారికే.. !
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ, కొడాలి నాని టార్గెట్‌గా పార్టీ కేడర్ దూకుడుగా వ్యవరించింది. వంశీ ఇంటి మీదికి టిడిపి కార్యకర్తలు వెళ్ళటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడాలి నానిపై ఇప్పటికే రెండు కేసులు నమోదవగా గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి ఘటనలో ఏ 71గా ఉన్నారు వంశీ.ఈ కేసులో కొంత మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వంశీ కోసం రెండు నెలలుగా గాలిస్తున్నారు. ఆయన అనుచరులు వరసగా పట్టుబడుతున్నప్పటికీ వంశీ మాత్రం ఇంకా చిక్కలేదు. దీంతో అసలాయన ఎక్కడ ఉన్నారన్న చర్చ మొదలైంది. దేశంలోనే ఉన్నారా లేక అమెరికాకు వెళ్ళిపోయారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. అయితే దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. ఈ విషయంలో ఎవరి విశ్లేషణ వారిది, ఎవరి వాదన వారిది. అంతే తప్ప వాస్తవం ఎవరికీ తెలియదు. అలాగని పోలీసుల వైపు నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. మరోవైపు తన ముఖ్య అనుచరులకు టచ్‌లో ఉన్నారని, త్వరలోనే గన్నవరం వస్తానని చెబుతున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. అంతా ఫోన్ కాంటాక్ట్ తప్ప… మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారన్నది వాళ్ళకు కూడా తెలియదని అంటున్నారు.
ఇటీవల వంశీ అనుచరులు అరెస్టు అయిన సందర్భంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారంటూ కొద్దిసేపు హంగామా నడిచింది. చివరికి ఆయన దొరకలేదంటూ పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చుకోవావాల్సి వచ్చింది. అయితే ఈ ప్రచార సమయంలోనే వంశీ చుట్టూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కచ్చితంగా అరెస్టు చేయాల్సిన వ్యక్తి వంశీ అని, అధికారంలో ఉన్నపుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పారిపోయాడన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. వంశీపై నమోదైన కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తారని, టీడీపీ నేతలే ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. అదే సమయంలో వంశీ, కొడాలి నాని ఇద్దరినీ పేర్ని నాని దాచారన్న అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అనండం చర్చను నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్ళింది. ఇంత జరుగుతున్నా… వంశీ మాత్రం సైలెంట్ గా ఉండటంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.