NTV Telugu Site icon

Vishnuvardhan Reddy: రేవంత్‌రెడ్డితో విష్ణుకు గ్యాప్‌..? బీజేపీ గాలం వేస్తోందా?

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

కాంగ్రెస్‌ వ్యవహారం నచ్చక బీజేపీలో చేరిపోయారు మర్రి శశిధర్‌రెడ్డి. అదేదారిలో మరికొందరు ఉన్నట్లు టాక్‌. గ్రేటర్‌లో కాంగ్రెస్ బలహీన పడిందని.. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కునే పనిలో పడ్డారు. ఒక రకంగా కాంగ్రెస్‌కు లాయలిస్టులుగా పేరు ఉన్నవాళ్లే ఆ పార్టీకి దూరం అవుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి లాంటి నాయకుడిని పార్టీ మారకుండా ఆపడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. మిగిలిన నాయకులు వెళ్లిపోకుండా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గ్రేటర్ హైదరాబాద్ లోనే మంచి పట్టు ఉండేది. క్రమంగా నగరం పార్టీ చేజారిపోయింది. ప్రస్తుతం ఉన్న నాయకుల పట్ల కేడర్‌ వ్యతిరేక భావనతో ఉంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది దాటినా గ్రేటర్ పై పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. పిజేఆర్ కుమార్తె విజయరెడ్డిని పార్టీలో చేర్చుకొని గ్రేటర్‌లో కాంగ్రెస్‌ బలోపేతానికి ప్రయత్నిస్తానని ఇండికేషన్ ఇచ్చారు. కానీ అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. పీజేఆర్ కుమార్తెను పార్టీలో చేర్చుకోవడంవల్ల ఏ మేరకు లాభం జరిగిందో ఏమో.. ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం మరింత సైలెంట్ అయ్యారు.

విష్ణు కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అడపా దడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పార్టీతో పెద్దగా బాండింగ్‌ కనిపించడం లేదు. ఒకటి రెండుసార్లు అలకతో ఉన్నట్టు ప్రచారం జరిగింది. రేవంత్‌కి వ్యతిరేకంగా తన నివాసంలో సీనియర్లతో సమావేశం పెట్టినట్టు వార్తల్లోకి ఎక్కారు. ఆ తర్వాత పార్టీ నాయకత్వం కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. హైదరాబాదులో కాంగ్రెస్‌కి పీజేఆర్‌ ఎంత కమిటెడ్‌గా పనిచేశారో తెలిసిందే. అలాంటి కుటుంబ వారసుడు విష్ణుని కాంగ్రెస్ విస్మరించిందనే వాదన ఉంది. రేవంత్‌కు విష్ణుకి మధ్య సయోద్య లేదు. గ్రేటర్ ఎన్నికల్లో మొదలైన పంచాయితీ.. ఇటీవల పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో సామూహిక అత్యాచారం జరిగిందన్న రేవంత్ కామెంట్స్ తో గ్యాప్ మరింత పెరిగింది. పార్టీ వ్యవహారాల పట్ల విష్ణు అసహనంతో ఉన్నారు.

పార్టీలో తనకు బాధ్యతలు ఇస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇటీవల విష్ణు చెప్పారు. తాజాగా పీసీసీ కమిటీలపై కసరత్తు చేయడంతో.. అందులోనైనా ప్రాధాన్యం లభిస్తుందా లేదా అనే చర్చ నడుస్తోంది. ఇంతలో విష్ణుపై బీజేపీ కన్నేసింది. హైదరాబాదులో బలమైన కాంగ్రెస్‌ నాయకులను బీజేపీలో చేర్చుకునేందుకు చూస్తోంది. అయితే పార్టీపై అలకతో ఉన్న విష్ణు.. కాంగ్రెస్‌లో కొనసాగాలా లేన తన దారి తాను చూసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారట. మరికొద్ది రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో హైదరాబాద్ బ్రదర్స్‌గా మర్రి శశిధర్ రెడ్డి.. పీజేఆర్‌లకు గుర్తింపు. పీజేఆర్‌ ఇప్పుడు లేకపోయినా.. వాళ్ల వారసులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మర్రి బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇలా కాంగ్రెస్‌కు లాయల్‌గా ఉన్న కుటుంబాలు పార్టీని వీడుతున్నా పీసీసీకి చీమకుట్టినట్టు అయినా లేదు. మరి.. మాజీ ఎమ్మెల్యే విష్ణు విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏం చేస్తుందో చూడాలి.

Show comments