NTV Telugu Site icon

Amanchi Krishna Mohan and Karanam Balaram: చీరాలలో కరణం.. పర్చూరులో ఆమంచి బరిలో ఉంటారా?

Amanchi Krishna Mohan

Amanchi Krishna Mohan

ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దులు కరణం బలరాం.. ఏలూరి సాంబశివరావులు గెలిచారు. తర్వాత కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. చీరాల వైసీపీ ఇంచార్జ్ గా కరణం వెంకటేష్ కు భాద్యతలు అప్పగించారు.. నియోజకవర్గంలో ఆయనే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేయటంతో వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది.

Read Also: Vishnuvardhan Reddy: రేవంత్‌రెడ్డితో విష్ణుకు గ్యాప్‌..? బీజేపీ గాలం వేస్తోందా?

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున చీరాలలో పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్ది కరణం బలరాంపై ఓడారు. అయినప్పటికీ వైసీపీ అధికారంలోకి రావటంతో చీరాలలో అన్నీ తానై నడిపించారు. కరణం చేరికతో ఆమంచిని పర్చూరులో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధినేత సంకేతాలు ఇచ్చారు. రాష్ర్టంలో ఎన్నికల వేడి మొదలు కావటంతో.. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరిను ఢీకొనాలంటే.. అందుకు ఆమంచే కరెక్ట్ అని భావిస్తున్నారట. పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం, ఇంకొల్లు, పర్చూరు మండలాలతోపాటు మార్టూరు మండలంలో ఇప్పటికే ఆమంచికి అనుచరగణం ఉంది. ఇప్పటి వరకూ పర్చూరు ఇంచార్జ్ గా ఉన్న రావి రామనాధంబాబు అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకూ తన పని తాను చేసుకుపోదామన్న ఆలోచనలో ఉన్నారట. గత ఎన్నికల్లో కప్పదాటు వైఖరితో రావి చర్చల్లో ఉన్నారు.

ఇటీవల వైసీపీ సీనియర్ నేత సజ్జలతో భేటీ అయ్యారు ఆమంచి. ఆపై తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారట మాజీ ఎమ్మెల్యే. పర్చూరు విషయంలో వారి నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో.. వెళ్లి సీఎం జగన్‌ను కలిసి మాట్లాడారట. తాను పర్చూరు వెళ్లాలంటే ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల సమన్వయకర్తగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన సెగ్మెంట్‌లో వేలు పెట్టకూడదని కోరారట. ఏ విషయం ఉన్నా పార్టీ హైకమాండ్‌తో తాను నేరుగా టచ్‌లో ఉంటానని చెప్పారట ఆమంచి. ఇప్పటికే చీరాల వైసీపీలోకి కరణం బలరాంను తీసుకువచ్చి తనకు ఇబ్బందికర పరిణమాలను బాలినేనే సృష్టించారనే ఫీలింగ్‌లో ఆమంచి ఉన్నారట. అదే బాలినేని కనుసన్నలలో పనిచేయాలంటే భవిష్యత్‌పై భరోసా ఉండబోదనే అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆది నిష్టూరం కన్నా అంత్య నిష్టూరమే మేలని భావించారట ఆమంచి.

తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం, బాపట్ల జిల్లాల భాద్యతలు తొలగించి తిరుపతి, కడప కేటాయించటంతో ఆమంచి పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవటం లాంచన ప్రాయమేనన్న టాక్ మొదలైంది. పర్చూరుకు వెళితే బలరాం సహకారం.. ఆమంచి చాణక్యంతో రెండు నియోజకవర్గాల్లో పార్టీ పట్టు పెంచుకోవచ్చునని అంచనా వేస్తుందట వైసీపీ అధిష్టానం. అన్నీ సమస్యలు పరిష్కారమయ్యాక సీఎంతో జగన్‌తో భేటీ అవుతారని భావిస్తున్నారట ఆమంచి అభిమానులు. మరి… ఆచితూచి నిర్ణయాలు తీసుకునే ఆమంచి పర్చూరు ఆఫర్‌ను ఆమోదిస్తారా.. తన రాజకీయంతో పెనవేసుకుపోయిన చీరాలను వీడతారా అనేది కాలమే చెప్పాలి.