Site icon NTV Telugu

Off The Record: ఏలూరు టీడీపీ కార్యక్రమంలో కొత్త వివాదం

Otr Eluru Tdp Controversy

Otr Eluru Tdp Controversy

Off The Record: కొలుసు పార్ధసారధి.. ఏపీ క్యాబినెట్ మినిస్టర్‌ అండ్‌ కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే. గతంలో పెనమలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారధి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తొలిసారి మంత్రి అయ్యారు. 2014లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా….అదే పార్టీ నుంచి 2019లో పెనమలూరు ఎమ్మెల్యే అయ్యారాయన. అప్పుడే మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్నా….చివరికి అది జోగి రమేష్‌ను వరించింది. ఇక అప్పటి నుంచి అసంతృప్తి మొదలవడంతో పాటు…. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో గత ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారాయన. కాంగ్రెస్, వైసీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సారధిటీడీపీ తరపున ఇదే తొలి ఎన్నిక కావటం ఇదే మొదటిసారి. అదే ఊపులో కేబినెట్‌ బెర్త్‌ కూడా దక్కింది. అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్నా…. ఆయన్ని ఇప్పటికీ పాత వాసనలు వదిలిపోవడం లేదన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. మంత్రి ఎంత వదిలించుకుందామనుకుంటున్నా… ఏదో ఒక సందర్భంలో తెర మీదికి వస్తూ… గుచ్చుతున్నాయని, ఆయన కూడా వాటిని సీరియస్‌గా తీసుకుని భుజాలు తడుముకుంటున్నారన్నది టీడీపీలోని ఓ వర్గం మాట.

సారధి టీడీపీ తరపున గెలిచి మంత్రి అయ్యాక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా జోగి రమేష్‌తోపాటు పార్థసారధి ర్యాలీగా ఒకే వాహనంలో వెళ్ళడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ మూలాలున్న వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. కార్యక్రమంలో పాల్గొనాలంటే విడిగా వెళ్ళవచ్చుకదా… జోగితో కలిసి ఒకే వాహనం మీద ర్యాలీగా వెళ్ళడం ఏంటంటూ అప్పట్లో ప్రశ్నించాయి తెలుగుదేశం శ్రేణులు. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నపుడు జోగి రమేష్ చంద్రబాబు, లోకేష్‌ను ఇష్టారీతిన తిట్టాడని, అలాంటి వ్యక్తితో సారధి రాసుకుపూసుకు తిరగడం ఏంటంటూ నిలదీశారు. దాని తీవ్రత పెరిగిపోవడంతో… పార్టీ కార్యాలయం వేదికగా మంత్రి సారీ చెప్పాల్సివచ్చింది. ఇలాంటి వాటిని రిపీట్ కానివ్వనంటూ టీడీపీ శ్రేణులకు క్షమాపణలు చెప్పటంతో విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ కార్యాలయం నుంచే నూజివీడులో అక్రమ మైనింగ్ జరుగుతోందని, వైసీపీ హయాంలో కొడాలి నాని, వంశీ వెనుక తిరిగిన కిషోర్ ఇప్పుడు నూజివీడులో మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అవి నేరుగా మంత్రి పార్థసారధికే తగిలాయి. యార్లగడ్డ ఆరోపణలు చేసిన వారు ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టిమరీ తాము సారధితోపాటే ఎన్నికలకు ముందే టీడీపీలో జాయిన్ అయ్యామని వివరణ ఇచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో… తాజాగా మరోసారి వైసీపీ మూలాలున్న టీడీపీ నాయకుల గురించి ప్రస్తావన రావడం, దానికి సారధి భుజాలు తడుముకోవడంతో రచ్చ మొదలైంది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా ఈ వివాదం రేగింది. కార్యక్రమంలో పాల్గొన్న దెందూలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి.

టీడీపీలో వైసీపీ కోవర్టులు అంటూ ఎమ్మెల్యే అన్న మాటలు మంత్రి సారధికి చికాకు పుట్టించాయట. కూటమిలో కొందరు కోవర్టులు చేరారు, వారు కేరాఫ్ వైసీపీ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుందని, ఒక్క దెందూలూరు మాత్రమే కాదు, జిల్లా అంతటా జాగ్రత్తగా ఉండాలని అన్నారాయన. పార్టీలో ఇప్పటికే చేరిన, చేరబోతున్న వారిని ఉద్దేశించి చింతమనేని అలా మాట్లాడారన్నది ఒక వెర్షన్‌. అసలు ఆయన టార్గెట్‌ మంత్రి కాదని, వేరే నాయకుల్ని ఉద్దేశించి పరోక్షంగా అంటే…. అందుకు మంత్రి అనవసరంగా రియాక్ట్‌ అయ్యారన్న చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వారి గురించి చింతమనేని పదే పదే బాధపడుతున్నారని, చంద్రబాబు,లోకేష్, పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఎవ్వరూ పార్టీలో చేరలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సారధి అనడం హాట్‌ టాపిక్‌ అయింది. అన్నిరకాలుగా స్కానింగ్ చేసి పరిశీలించిన తర్వాతే వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్నారని, వాళ్ళను కలుపుకుని వేళ్ళాలే తప్ప వివాదాలు సృష్టించుకుంటూ వెళ్ళటం సరికాదని మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అధినేత ఒప్పుకున్న తర్వాత చేరికలపై మళ్ళీ వివాదాలను సృష్టించటం తగదన్నారు సారధి. వలస నేతలకు ఈ మాటలు సపోర్టివ్ గా ఉన్నా… మొదట్నుంచి టీడీపీలో ఉన్న వారికి మాత్రం రుచించడం లేదట. అసలు చింతమనేని టార్గెట్‌ వేరే ఉందని, ఆవిషయంలో సారధి రియాక్ట్‌ అయిపోయారన్న మాటలు వినిపిస్తుండగా…. తనను ఉద్దేశించినా, కాకున్నా ఆయన కూడా కావాలనే అలా మాట్లాడి ఉంటారన్నది ఇంకో వెర్షన్‌. ఇలాంటి వ్యాఖ్యలతో ఇప్పటికే ఇబ్బంది పడ్డ మంత్రి…. గట్టి కౌంటర్ ఇవ్వడం ద్వారా మరోసారి ఎవరూ తనను వేలెత్తి చూపకుండా చేసుకున్నారన్నది కొందరి విశ్లేషణ.

Exit mobile version