Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఇన్నాళ్ళు రకరకాలుగా ఎదురు చూసీ…చూసీ….ఇక ఫైనల్‌గా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ మీదే హోప్స్ పెట్టుకున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. మొదటిసారి విస్తరణ సమయంలో తర్వాత ఇస్తామని అధిష్టానం చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకున్నారు. కానీ రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం రంగారెడ్డి జిల్లాకు స్థానం దక్కలేదు. దాంతో… ఉమ్మడి జిల్లాలోని పార్టీ శాసనసభ్యులంతా కలిసి అధిష్టానం పెద్దలకు లేఖ రాశారు. ఒకరిద్దరైతే… కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిసి మంత్రివర్గ విస్తరణలో మా జిల్లా నుంచి ఎవరో ఒకరికి పదవి ఇవ్వాలని కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నలుగురు ఉండగా… మరో ఇద్దరు బీఆర్ఎస్ నుంచి ఇటువైపు మారారు.
Read Also: Donald Trump: సహకరించని నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. మేము దీన్ని గుర్తుంచుకుంటామంటూ హెచ్చరిక
అలా… మొత్తం ఆరుగురిలో ముగ్గురిది రెడ్డి సామాజికవర్గం కాగా… ఒక బీసీ, ఇద్దలు ఎస్సీలు ఉన్నారు. ప్రస్తుతం క్యాబినెట్‌లో రెడ్డి కులం మంత్రులే ఎక్కువగా ఉన్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కూడా ఆ సామాజిక వర్గానికి ఇంకో పదవి రావొచ్చన్న ఊహాగానాలున్నాయి. ఆ ఒక్క పదవి తమ జిల్లాకే ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు. ఇటీవల అసెంబ్లీలో, మండలిలో ఖాళీగా ఉన్న విప్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. వాటిలో కూడా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తి బలంగా ఉంది. అందుకే ఈసారి మాత్రం ఏదో ఒక కోటాలో మాకు కేబినెట్ బెర్త్ కావాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు. ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బియ్యని మధుసూదన్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చిన ప్రతిసారి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి వస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ పదవి ఉండగా.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ హోదా దక్కింది. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో… ఈసారైనా అత్యంత కీలకమైన ఉమ్మడి రంగారెడ్డికి ప్రాధాన్యం ఇస్తారా? లేక వోవరాల్‌గా శాడ్ సాంగేనా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.