Off The Record: తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులుగా బొడ్డు వెంకట రమణ చౌదరి నియామకం వివాదస్పాదంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వలసదారుడిగా టిడిపిలో చేరిన ఆయనకు ఈ పదవి కట్టపెట్టడంపై పార్టీలో నిరుత్సాహం నెలకొందట. ప్రస్తుతం రుడా చైర్మన్‌గా, రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జిగా కొనసాగుతున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి. మళ్లీ టిడిపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై పార్టీ కార్యకర్తలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉన్న రెండు పదవులకే న్యాయం చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. బొడ్డు వెంకటరమణ చౌదరి జిల్లా అధ్యక్ష పదవికి ఏం న్యాయం చేస్తారు?అనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవికి పార్టీలో కష్టపడ్డ సమర్ధుల్లేరా?అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని టాక్. జిల్లా అధ్యక్ష పదవికి పోటీపడిన టిడిపి సీనియర్ నేతలు గన్నికృష్ణ, ముళ్లపూడి బాపినీడులకు పరాభవమే ఎదురైందట. దళితులకు పట్టం కట్టాలనే డిమాండ్‌ను అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదని తెగ మథనపడిపోతున్నారట తెలుగు తమ్ముళ్లు.
ఇక, జిల్లాలో ఈ పరిణామాలతో టిడిపి నాయకులు, కార్యకర్తలకు చిర్రెత్తుకొస్తోందట. కనీసం నాయకత్వ లక్షణాల్ని నిరూపించుకోలేకపోయిన వ్యక్తికి పదవులు ఎలా కట్టబెడతారనే దానికి హైకమాండ్ వద్ద కనీసం ఆన్సర్ లేని పరిస్థితి ఏర్పడిందట. అధ్యక్ష పదవి ఎంపికపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి వలసొచ్చిన వ్యక్తికి జిల్లా స్థాయి కీలక బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకులు, కార్యకర్తలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారని సమాచారం. పైగా ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన చేసిన కృషిని చంద్రబాబు గుర్తించారని చెప్పుకుంటున్నారు. ఈయనకు బాధ్యతలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తారనే నమ్మకం ఉందట హైకమాండ్‌కు. ఒంటరిగా పోటీకి దిగినా అన్ని స్థానాల్లో గెలిచే స్థాయిలో పార్టీని డెవలప్ చేస్తారంటూ ఈ ప్రచారం సాగింది. దీనిపై పార్టీ కార్యకర్తలు తలోరకంగా వ్యాఖ్యనాలు చేస్తున్నారు. బొడ్డు ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జిగా ఉన్నారు. ప్రతిష్టాత్మక రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిలోనూ కొనసాగుతున్నారు. ఈ రెండు బాధ్యతల నిర్వహణలోనే ఆయన ఘోరంగా వైఫల్యం చెందారన్న విమర్శలున్నాయి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు రాజానగరంలో జనసేన అభ్యర్థి విజయానికి బొడ్డు చేసిన కృషి కూడా ఏమీ లేదనిటాక్. వ్యక్తిగత కారణాల పేరిట ఎన్నికలకు ముందు విదేశాలకు వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి గట్టిగా వీస్తోందని, రూఢీ అయ్యాకే ఆయన నియోజకవర్గానికి వచ్చారనే విమర్శలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికీ కూడా అవసరమైన చోట అలకలతోనే ప్రచారంలో పాల్గొంటున్నారట. ఆయన పాల్గొన్న లేకున్నా కలిగే లాభ..నష్టాలేం లేవన్నది కార్యకర్తల మాట. అందుకే ఎమ్మేల్యే బత్తుల బలరామకృష్ణ ఆయనను కలుపుకుపోతున్నారని తెలుస్తోంది. ఎన్నికల అనంతరం బొడ్డుకు రుడా చైర్మన్ పదవి దక్కింది. ప్రమాణస్వీకారం సమయంలోనే భీకర ప్రతిజ్ఞలు చేశారు. వైసీపీ హయాంలో రుడాలో జరిగిన అవినీతి అక్రమాల్ని వెలికి తీసి కేసులు పెడతానన్నారు. ఏడాది కాలంగా అలాంటి ప్రయత్నాలు మచ్చుకైనా జరగలేదని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. పైగా రుడాలో అవినీతి మరింత పెచ్చుమీరిందనే ప్రచారం సైతం జరుగుతోంది. గతం కంటే కూడా ఇప్పుడు రుడాను అవినీతిమయంగా మార్చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారట కొందరు నేతలు. మరోవైపు… నియోజకవర్గంలో టిడిపి గ్రూపుల వారీగా విడిపోయిందని తెలుస్తోంది. కనీసం జనసేనతో కూడా ఏమాత్రం సరితూగలేని దుస్ధితికి పార్టీ చేరిందనే టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఉనికి కోసం పాకులాడే పరిస్ధితికి దిగజార్చేశారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారట.
బొడ్డు వెంకటరమణ చౌదరి తండ్రి దివంగత బొడ్డు భాస్కర రామారావు. ఆయన దీర్ఘకాలం తెలుగుదేశంలో పార్టీలో పనిచేశారు. టిడిపి ప్రభుత్వంలో కీలక పదవుల్ని అధిష్టించారు. పార్టీ అధికారం కోల్పోవడంతో హఠాత్తుగా వైసీపీలోకి మారిపోయారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు. కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరిని కూడా వైసీపీ తరపున రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీ చేయించారు. వైసీపీ ప్రభావం కోల్పోయాక తిరిగి టిడిపి పంచన చేరారు. ఇప్పటికీ వైసీపీ నాయకులతో బొడ్డుకు వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే రుడాలో గతంలో జరిగిన అవినీతిపై చర్యలకు బొడ్డు వెనుకాడుతున్నారంటూ టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు వరకు దళితుడైన మాజీమంత్రి జవహర్ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. దళితుడ్ని తప్పించి బొడ్డు వెంకట రమణ చౌదరికి ఇవ్వడం సమంజసం కాదంటున్నారు. ఒకవేళ కమ్మ సామాజికవర్గానికే టిడిపి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాల్సి వస్తే ఇంకా చాలామంది నాయకులు ఉన్నారంటున్నారట. మొత్తానికి…ఈ వివాదం ఎలాంటి మపులు తీసుకుంటుందో వేచి చూడాలి.