Site icon NTV Telugu

Off The Record: కేబినెట్‌ విస్తరణకు ముందు అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువ?

Tg Congress

Tg Congress

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పిసిసి కమిటీ, కేబినెట్ విస్తరణపై చర్చ నడుస్తోంది. PCC కమిటీలో పెద్దగా పోటీ దారులు ఉండకపోవచ్చు గానీ…. కేబినెట్‌ విషయంలో మాత్రం ఆశావాహులు ఎక్కువ. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని చూస్తోంది పార్టీ. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ఇటు రాహుల్‌ గాంధీతో జరిగిన ప్రత్యేక భేటీలోనూ, అటు ఇతర అధిష్టానం పెద్దల దగ్గర ప్రస్తావించారట. కేబినెట్‌లో కొత్తగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలన్న దిశగా చర్చ జరుగుతోందట. బీసీ కోటాలో.. పాలమూరు జిల్లా నుంచి వాకిటి శ్రీహరి పేరు దాదాపు ఖరారైంది. రెడ్లకు ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నందున మరో బీసీకి కూడా ఛాన్స్‌ ఇవ్వాలని భావిస్తోందట అధిష్టానం.

Read Also: Off The Record: కేసీఆర్‌ దగ్గర కవిత రెండు ప్రధాన డిమాండ్స్ పెట్టారా..?

దీంతో బీసీ ఎమ్మెల్యేల్లో పోటీ మొదలైందని అంటున్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఐతే.. కరీంనగర్ జిల్లా నుంచి మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. మాకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఫీలింగ్ ఆ సామాజిక వర్గంలో ఉందట. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి మంత్రి వర్గంలో చోటు కల్పించే అంశాన్ని సీరియస్‌గానే ఆలోచిస్తున్నారట పార్టీ పెద్దలు. అటు యాదవుల నుండి కూడా ఒత్తిడి ఉంది. ఈ కుల సమీకరణలు, వ్యవహారాలు ఇలా ఉంటే…. రేస్‌లో ఉన్న ఆది శ్రీనివాస్ పై.. అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయట. ఆది శ్రీనివాస్ రాజకీయ మూలాలు బీజేపీలో ఉన్నాయని, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆయన కెరీర్‌ మొదలైందని, అసలు 2014లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి.. బీజేపీకి మద్దతుగా నిలిచారంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కొందరు. అదంతా వేరే సంగతిగానీ.. ప్రస్తుతానికైతే… అటు బీజేపీ…ఇటు brs నుండి వచ్చే విమర్శలకు కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎక్కువగా కౌంటర్ చేస్తోంది ఆది శ్రీనివాసేనని అంటున్నారు. దీంతో ఆయన అవకాశాలకు గండి పడుతుందా లేక రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజం అని పార్టీ పెద్దలు భావిస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా… ఈ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌ పార్టీ కల్చర్‌ మరోసారి బయటపడ్డట్టయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అక్కడ ఫిర్యాదుల పెట్టెలు ఎప్పుడూ ఓపెన్‌ చేసే ఉంటాయని, ఈసారి ఎవరు కంప్లయింట్‌ చేశారు? ఎందుకు చేశారని ఆరాతీస్తున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు.

Exit mobile version