Off The Record: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అప్పట్లో వాటన్నిటిని భరించిన టీడీపీ శ్రేణులు…. కూటమి అధికారంలోకి వచ్చాక ఓపెనైపోతున్నాయి. వర్మ మా నేతల మీది పిచ్చిపిచ్చి పోస్టుల పెట్టి మనోభావాలు దెబ్బతీశారంటూ రాష్టం నలు మూలల కేసులు పెడుతున్నారు. వాటిల్లో ఓ కేసు వర్మను వెంటాడి అరెస్ట్ అంచుల దాకా తీసుకువెళ్ళింది. చివరికి కోర్ట్ ఆదేశాలతో బతుకు జీవుడా అంటూ బయటికి వచ్చారాయన. అయితే… ఇల్లలగ్గానే పండుగ కాదంటోందట సర్కార్. ఆ కేసు పోతేనేం.. ఇంకోటి రెడీగా ఉందని అంటున్నాయట ప్రభుత్వ వర్గాలు.ఇప్పుడు ఆర్జీవీ మెడకు మరో ఉచ్చు పడబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలు..క్లారిటీ ఇచ్చిన ఎన్డీయే..
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా వర్మ తెర కెక్కించిన వ్యూహం సినిమాను అప్పుడు ఏపీ ఫైబర్ నెట్‌లో స్ట్రీమింగ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం ద్వారా కూటమిని దెబ్బకొట్టాలన్నది వైసీపీ పెద్దల ప్లాన్‌గా అప్పట్లో ప్రచారం జరిగింది. అదేమీ వర్కౌట్ కాలేదని ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి. కానీ.. ఈ సినిమా కోసం అప్పట్లో చేసిన పనులు మాత్రం ఇప్పుడు వెంటాడుతున్నాయట. ఏపీ ఫైబర్ నెట్‌లో స్ట్రీమింగ్ అయిన వ్యూహం సినిమాను అప్పట్లో ఎంత మంది చూశారు? ఆ పేరుతో ఎవరెంత తిన్నారో… మొత్తం లెక్కలు పక్కాగా తవ్వుతోందట కూటమి సర్కార్. ఆ క్రమంలో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వ్యూహం సినిమా కోసం ఆర్జీవీఆర్వీ అనే కంపెనీకి ఫైబర్‌నెట్ నుంచి 2 కోట్ల పది లక్షల రూపాయలు చెల్లించారు. వాస్తవానికి పే ఫర్ వ్యూస్ ఆధారంగా ఈ చెల్లింపులు జరగాలి. అంటే… ఒక వీక్షణకు ఇంత అంటూ… ఎన్ని వ్యూస్ వస్తే అంత చెల్లిస్తారన్నమాట. ఒప్పందం ప్రకారం ఏపీ ఫైబర్ నెట్‌లో ఒక వ్యక్తి సినిమా చూస్తే వంద రూపాయలు వస్తాయి. ఆ లెక్క ప్రకారం… ఆర్జీవీఆర్వీకి ఇచ్చిన రెండు కోట్ల పది లక్షల రూపాయలకు 2 లక్షల వ్యూస్ వచ్చి ఉండాలి. ఖచ్చితంగా ఏపీ ఫైబర్ నెట్‌లో రెండు లక్షల మంది వ్యూహం సినిమాను క్లిక్ చేసి చూస్తేనే… ప్రభుత్వం వైపు నుంచి అంత మొత్తం చెల్లించాలి. కానీ.. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.
Read Also: Pushpa 2: అల్లు అర్జున్ కి మరో షాక్.. హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు
వ్యూహం సినిమాకు లక్షల్లో కాదు కదా… కనీసం వేలల్లో కూడా వ్యూస్ రాలేదు. ప్రభుత్వం అధికారికంగా తీసిన వివరాల ప్రకారం ఫైబర్‌నెట్‌లో వ్యూహం సినిమా వ్యూస్ కేవలం 18 వందల 63 మాత్రమే. ఇప్పుడీ లెక్కలు చూసిన సర్కార్ ముఖ్యులకు దిమ్మతిరిగిపోతోందట. ఆర్జీవీ ఆర్వీకి చెల్లించిన సొమ్మును, వచ్చిన వ్యూస్‌ను పోల్చి చూసుకుంటే… వంద రూపాయలు ఇవ్వాల్సిన చోట 11వేల రూపాయలు చెల్లించినట్టు తేలిందంటున్నారు. ఒప్పందం ప్రకారం ఏపీ ఫైబర్‌నెట్‌లో ఒక వ్యక్తి ఒకసారి సినిమా చూస్తే… ఆర్జీవీ ఆర్వీకి 100 రూపాయలు చెల్లించాల్సి ఉండగా అందుకు బదులు ఏకంగా 11 వేల రూపాయలు కట్టారట. ఇప్పుడీ లెక్కలు చూసి షాకవుతున్నారట. మాదేం పోయింది… జనం సొమ్మేకదా… అనుకుంటూ అప్పనంగా ఆర్జీవీకి ఫైబర్ నెట్ నుంచి చెల్లించారన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి ప్రభుత్వ వర్గాల్లో. వాస్తవానికి వ్యూహం సినిమా నిర్మాత వేరు. కానీ…ఆయన ఆ మూవీని అప్పుడే అమ్మేశారట. దాన్ని ఆర్జీవీఆర్వీ సంస్థ ఫైబర్ నెట్‌కు విక్రయించిందట. ఇలా…నాటి ప్రభుత్వం ఆర్జీవీ సంస్థకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చిందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటోంది కూటమి ప్రభుత్వం. దీని మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఐదేళ్ళ వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌లో జరిగిన నియామకాలు, చెల్లింపులు, ఆదాయం, ఖర్చుల వ్యవహారాలపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రామ్‌గోపాల్‌వర్మ… ఈ వ్యూస్ ఎపిసోడ్ నుంచి ఎలా బయటపడతారోనంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.