NTV Telugu Site icon

Off The Record: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ మారుతున్నారా..?

Buggana

Buggana

Off The Record: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిచయం అక్కరలేని పేరు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఐదేళ్ల పాటు పని చేశారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో ఆయనదే కీలకపాత్ర. 2019లో రెండుసార్లు డోన్ ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్‌ కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు జగన్ జిల్లా పర్యటనలో.. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేరునే ఏపీలోనే తొలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో బుగ్గనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి. మంత్రివర్గాన్ని విస్తరించినప్పటికీ.. బుగ్గనను మాత్రం కంటిన్యూ చేశారు. ఆర్థిక వ్యవహారాల్లో బుగ్గనకు మంచి పట్టు ఉండడంతో.. ఐదేళ్లు ఆర్థిక శాఖ మంత్రిగానే కొనసాగారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు నెరిపారు. ఢిల్లీ టు ఆంధ్రప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ టు హస్తినకు చక్కర్లు కొట్టారు. ఆర్థికంగా ఏపీ ప్రభుత్వాన్ని గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించింది బుగ్గనే అని చెబుతారు. సొంత నియోజకవర్గంలో వేలకోట్ల ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశారు. దీంతో 2024 ఎన్నికల్లో గెలుపు తనదేనని భావించారు. అయితే తానొకటి తలస్తే.. దైవమొక్కటి తలచినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఓటమి తప్పలేదు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి చేతిలో 6వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

Read Also: Urvashi Rautela: బాలయ్య సినిమా షూటింగ్‌లో ఊర్వశి రౌతేలాకి తీవ్ర గాయాలు?

ఎన్నికల తరువాత మాజీ మంత్రి బుగ్గన తీరుపై కర్నూలు జిల్లాలో కొత్త చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక్కసారి కూడా కలవనే లేదట. బుగ్గన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఆర్థిక మంత్రి కాషాయ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాజీ మంత్రి బుగ్గనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె ద్వారానే బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తమ నాయకుడు.. మీ పార్టీలో చేరతారా అంటూ బీజేపీ ముఖ్యులతో వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయట. సొంత నియోజకవర్గంలో కొందరు ముఖ్యనేతలతో రాజకీయ పరిస్థితులపై చర్చించారట బుగ్గన.

Read Also: Off The Record: చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? రేవంత్ రెడ్డి ఏపీని టార్గెట్ చేస్తారా..?

ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ? ఏ కులం ఏ పార్టీకి అండగా ఉంది ? రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎలా ఉండబోతోంది అనే అంశాలపై నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారట. ఇది కాకతాళీయంగా నేతలతో మాట్లాడారా.. ఏదైనా ఆలోచనలో ఉన్నారా అనే చర్చ కూడా పార్టీలో ఉంది. బుగ్గనకు మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో.. ఆయన వైసీపీని వీడే అవకాశమే లేదనే మరో వాదన కూడా ఉందట. వైఎస్సార్ జయంతి సందర్బంగా డోన్‌లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బుగ్గన. పార్టీ మారే ఆలోచన ఉంటే వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో ఎందుకు పాల్గొంటారనే ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. 2014-19 మధ్యలో వైసీపీ అధికారంలో లేనపుడు బుగ్గన టీడీపీలో చేరారా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారట. మొత్తమ్మీద బుగ్గన బీజేపీలో చేరుతారనే ప్రచారం మాత్రం ఊపందుకుంది. దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.